ఇరుకిరుకు ఇళ్లు.. ఐసోలేషన్ చెల్లు...
ABN , First Publish Date - 2021-05-17T05:30:00+05:30 IST
పేద, మధ్యతరగతి వర్గాలకు ‘కరోనా’ శాపంగా మా రింది. కుటుంబంలో ఒకరికి వైరస్ వస్తే.. అది అందరికీ అంటుకుంటోంది. ఇరుకిరుకు ఇళ్లలో జీవించే ఈ వర్గాల ప్రజలకు హోం ఐసోలేషన్‌లో ఉండే సదుపాయం లేకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు.
కుటుంబంలో ఒకరి నుంచి అందరికీ సోకుతున్న వైరస్
‘హోం ఐసోలేషన్’ శ్రేయస్కరం కాదంటున్న వైద్య నిపుణులు
కానరాని ఉమ్మడి ఐసోలేషన్, క్వారంటైన్ కేంద్రాలు
సెకండ్ వేవ్‌లో చేతులెత్తేసిన సర్కార్
అద్దె ఇళ్లలో ఉండే వారి పరిస్థితి మరీ దారుణం
సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి
హన్మకొండ, ఆంధ్రజ్యోతి
పేద, మధ్యతరగతి వర్గాలకు ‘కరోనా’ శాపంగా మా రింది. కుటుంబంలో ఒకరికి వైరస్ వస్తే.. అది అందరికీ అంటుకుంటోంది. ఇరుకిరుకు ఇళ్లలో జీవించే ఈ వర్గాల ప్రజలకు హోం ఐసోలేషన్‌లో ఉండే సదుపాయం లేకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితి గ్రామాలే కాదు, పట్టణాలు, నగరాల్లో కనిపిస్తోంది. గత ఏడాది కరోనా తొలి రోజుల్లో ప్రత్యేకంగా క్వారంటైన్ కేంద్రాలు, ఐసోలేషన్ కేంద్రాలు నిర్వహించిన ప్రభుత్వం ఈ సారి వాటి ఊసే ఎత్తకపోవడం ప్రమాదకరంగా మారింది. ఒకే కుటుంబంలో పలువురు మృత్యువాత పడుతుండటానికి, పాజిటివ్‌తో ఆస్పత్రి పాలవుతుండటానికి విడిగా ఉండకపోవడమే కారణంగా కనిపిస్తోంది. ఇక అద్దె ఇళ్లలో ఉంటున్నవారైతే అనేక అవమానాల పాలవుతున్నారు. తలదాచుకోవడానికి చోటు దొరక్క నానా పాట్లు పడుతున్నారు.
కొవిడ్ బారిన పడిన వారు ఇళ్లలోనే విడి గదుల్లో (హోం ఐసోలేషన్) ఒంటరిగా ఉండాలని ప్రభుత్వం చెబుతోందని, కానీ ఈ పద్ధతే తప్పు అని పలువురు వైద్యులు చెబుతున్నారు. కొవిడ్ రోగులు బయట ప్రత్యేక ఐసోలేషన్, క్వారంటైన్ కేంద్రాల్లోనే ఉండటం ఉత్తమ మార్గమని వారు అంటున్నారు. హోం ఐసోలేషన్ వల్ల కరోనా పాజిటివ్ రేటు గణనీయంగా పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా మొదటి వేవ్‌లో తీసుకున్న చర్యలు, పాటించిన జాగ్రత్తలేవీ సెకండ్ వేవ్‌లో అధికారులు తీసుకోవడం లేదు. దీంతో ఎవరికి కరోనా వచ్చిందో, ఎవరికి రాలేదో తెలియని పరిస్థితి నెలకొన్నది. గ్రామీణ జిల్లా కేంద్రాల్లో రెండేసి, అన్ని మండల కేంద్రాల్లో ఒక్కో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసినా, కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న వరంగల్ నగరంలో మాత్రం రెండింటినే తెరిచారు. మండల కేంద్రాల్లో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేసినా వాటి గురించి పెద్దగా తెలియకపోవడం, హోం ఐసోలేషన్‌ను ప్రోత్సహించడంతో కరోనా బాధితులు వెళ్లడం లేదు.
మొదటి వేవ్‌లో పకడ్బందీ చర్యలు
మొదటి దశలో కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో ఐసోలేషన్ సెంటర్లు, క్వారంటైన్ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇప్పటి లాగా రోగులను హోం ఐసోలేషన్‌కే వదిలేయకుండా గ్రామాలు, పట్టణాలకు దూరంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉమ్మడి ఐసోలేషన్ సెంటర్లలో ఉంచారు. వారికి తగిన వైద్య సహాయం అందచేశారు. వారు 7 నుంచి 14 రోజుల పాటు ఈ కేంద్రాల్లో ఉన్న తర్వాత మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించి నెగెటివ్ వస్తేనే ఇంటికి పంపించేవారు. అలా పాజిటివ్ వచ్చిన వ్యక్తితో పాటు ఆ కుటుంబాన్ని కూడా మిగిలిన వారికి దూరంగా ఉంచేవారు. దీని వల్ల కరోనా వ్యాప్తిని కొంత మేర అడ్డుకునేందుకు అవకాశం కలిగింది.
గత సంవత్సరం కరోనా మొదటి వేవ్ సందర్భంగా నగరంలో నిట్ కళాశాలకు చెందిన గెస్ట్ హౌజ్ (పాత పున్నమి హోటల్), వరంగల్ లక్ష్మిపురంలోని ఆయుర్వేద వైద్యశాల, కేయూలోని హాస్టల్‌లో ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. కొవిడ్ రోగులు పెద్ద సంఖ్యలో వస్తే వారికి వసతి కల్పించడానికి నగరంలోని కొన్ని కమ్యూనిటీ సెంటర్లు, ప్రైవేటు ఫంక్షన్ హాళ్లను సైతం గుర్తించి ముందస్తుగా ఏర్పాటు చేశారు.
వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో గురుకుల పాఠశాలలు, సాంఘిక సంక్షేమ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద సంఖ్యలో ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఒక్కో ఐసోలేషన్ సెంటర్‌లో వంద పడకల చొప్పున ఏర్పాటు చేశారు. ప్రతీ కేంద్రం నిర్వహణ బాధ్యతను స్థానిక తహసీల్దార్‌కు అప్పగించారు. రోగులకు వైద్య సేవలు అందించేందుకు ఇద్దరు డాక్టర్లు, పది మందికి పైగా నర్సింగ్ సిబ్బందిని నియమించారు.
ఐసోలేషన్‌లో ఉన్నవారికి ఆహారాన్ని సరఫరా చేసే బాధ్యతను కాంట్రాక్టర్లకు అప్పగించారు. ప్రతీ సెంటర్ దగ్గర ఒక అంబులెన్స్, అవసరమైన మందులను అందుబాటులో ఉంచారు. కరోనా పాజిటివ్ అని తేలిన రోగులను ఈ కేంద్రాలకు పంపారు. మూడు నాలుగు గదులు, అన్ని వసతులతో విశాలమైన స్వంత ఇల్లు కలిగిన వారిని వారి ఇష్ట ప్రకారం ఇంట్లోనే ఉండి (హోం ఐసోలేషన్) చికిత్స పొందేందుకు అవకాశం కల్పించారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారి పట్ల కూడా తగిన శ్రద్ధ తీసుకున్నారు. ఆ చుట్టుపక్కల వారు కరోనా రోగిని కలవకుండా జా గ్రత్తలు తీసుకున్నారు. రోగి హోం ఐసోలేషన్‌లో ఉన్న ఇంటిని మార్కింగ్ చేసేవా రు. ఆ పరిసరాలను నిత్యం శానిటైజ్ చేసేవారు. ఒక ప్రాంతంలో ఒకరి కన్నా ఎక్కువ మంది హోం ఐసోలేషన్‌లో ఉంటే ఆ ప్రాంతం మొత్తాన్ని హైపోక్లోరైడ్‌తో పిచికారీ చేసేవారు. ఐసోలేషన్‌లో ఉన్న రోగి ఐడీని కరోనా కేర్ సెంటర్ (సీసీసీ)కు అనుసంధించేవారు. దీని ద్వారా ఎప్పటికప్పుడు కరోనా బాధితుడి ఆరోగ్యాన్ని, చికిత్స అందుతున్న తీరును అడిగి తెలుసుకునేవారు. ఇప్పుడా పరిస్థితులు లేవు. ఎవరి కరోనాను వారే తగ్గించుకోవాలి... ఎవరి చావు వారే చావాలి అన్న విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
క్వారంటైన్ సెంటర్లు ఏవీ?
కరోనా మొదటి వేవ్‌లో క్వారంటైన్ సెంటర్లు నిర్వహించిన ప్రభుత్వం రెండవ వేవ్‌లో వీటి గురించి పూర్తిగా మరిచిపోయింది. కేవలం సీసీసీ (కరోనా కేర్ సెంటర్)లను ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటోంది. కరోనా మొదటి దశలో పాజిటివ్ వచ్చిన వ్యక్తిని సీసీసీలో ఉంచి, అక్కడ ఆరోగ్యం క్షీణిస్తే ఆస్పత్రులకు తరలించేవారు. అక్కడ కూడా ఆరోగ్యం మెరుగుపడకపోతే రాష్ట్ర స్థాయి ఆస్పత్రులకు పంపించేవారు. ఇదంతా ప్రభుత్వమే ఒక పద్ధతి ప్రకారం చేసింది. కరోనా సెకండ్ వేవ్‌లో ఇవేమీ లేవు.
ఇబ్బందులు, అవమానాలు
ఎగువ మధ్యతరగతి, సంపన్న వర్గాల వారి ఇళ్లల్లో మూడు లేదా నాలుగు గదులు ఉంటాయి. కాబట్టి వాళ్లు హోం ఐసోలేషన్‌ను ఎంచుకుంటున్నారు. అయితే ఇది అందరికీ సాధ్యం కాదు. పేద, మధ్య తరగతి వర్గాల వారు రెండు గదుల ఇళ్లతోనే సర్దుకుంటారు. ఒకే ఇంట్లో ముగ్గురు, నలుగురు ఉండాల్సి వస్తుంది. సెకండ్ వేవ్‌లో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో అందరు హోం ఐసోలేషన్‌లో ఉండలేని పరిస్థితి. ఒకటి రెండు గదులు కలిగిన వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఒక గదిని రోగికే కేటాయిస్తే మిగిలిన ఒక్క గదిలో 14 రోజుల పాటు కుటుంబ సభ్యులు ఉండాల్సి వస్తోంది. పెద్ద కుటుంబం అయితే ఇది ఏమాత్రం సరిపోవడం లేదు. పాజిటివ్ వచ్చిన వ్యక్తికి ప్రత్యేక గదిని కేటాయించలేక పోతున్నారు. ఏదో ఒక మూల సర్దుకుపోయినా ఇంట్లో చిన్న పిల్లలు, పెద్ద వాళ్లు ఏదో ఒక సమయంలో వారితో టచ్ అవుతారు. అందరూ ఒకే టాయిలెట్ ఉపయోగించాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక చోట పాజిటివ్ వ్యక్తితో కాంటాక్టు అయ్యే పరిస్థితి వస్తుంది.
ఇక అద్దె ఇంట్లో ఉండేవారికి కరోనా పాజిటివ్ వస్తే పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. పాజిటివ్ వచ్చిన వ్యక్తిని, ఆయన కుటుంబ సభ్యులను సైతం ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటున్నారు. ఇల్లు ఖాళీ చేయాలనే ఒత్తిళ్లుకూడా వస్తున్నాయి. దురదృష్టవశాత్తు కరోనాతో రోగి మృతి చెందితే వారి కుటుంబ సభ్యుల పరిస్థితి మరీ దయనీయం. శవాన్ని నేరుగా స్మశానవాటికకు తీసుకువెళ్ళి దహన సంస్కారాలు చేసినా, కుటుంబ సభ్యులు ఇంట్లోకి రాకుండా యజమాని అడ్డుకుంటుండటంతో వారికి చివరికి శ్మశానాలు, చెట్లు పుట్టలే దిక్కవుతున్నాయి. ఇటీవల అద్దె ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి కరోనాతో చనిపోతే ఇంటి యజమాని లోపలికి రానివ్వకపోవడంతో కుటుంబ సభ్యులు ఒక హోటల్లో తలదాచుకోవలసి వచ్చింది.
ఉమ్మడి ఐసోలేషన్ సెంటర్లు
ప్రస్తుతం వరంగల్ అర్బన్ జిల్లాలో రెండు ఐసోలేషన్ కేంద్రాలనే నిర్వహిస్తున్నారు. నిట్‌కు చెందిన గెస్ట్‌హౌజ్ (పాత పున్నమి హోటల్), కేయూలోని లేడీస్ హాస్టల్‌లో వీటిని ఏర్పాటు చేశారు. వీటి సంగతి కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. ఈ కేంద్రాల్లో ఒక డాక్టర్‌ను, కొంత మంది ఎఎన్‌ఎంలను నియమించారు. సౌకర్యాలు పెద్దగా లేవు. నగరంలో కరోనా ఉదృతంగా ఉన్న జనావాసాలకు దూరంగా ఉన్న ప్రభుత్వ భవనాలు, కమ్యూనిటీ హాళ్ళు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల భవనాలను, అవసరమైతే ప్రైవేటు ఫంక్షన్ హాళ్ళను కూడా తీసుకొని ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని, కరోనా పాజిటివ్ వచ్చిన వారి కుటుంబ సభ్యులను విడిగా ఉంచడానికి క్వారంటైన్ సెంటర్లను పెద్ద సంఖ్యలో నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.
ములుగు జిల్లాలోని ములుగు మండలం జాకారం, ఏటూరునాగారంలలోని రెండు వైటీసీలో, గురుకులం, ఏరియా ఆస్పత్రి, గిరిజన భవన్‌లో క్వారంటైన్ సెంటర్లు, సిహెచ్‌సీలో ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. వరంగల్ రూరల్ జిల్లాలో నర్సంపేటలో 30, పరకాలలో 10, వర్ధన్నపేటలో 20 మంది కోసం ఐసోలేషన్ సెంటర్లను నిర్వహిస్తున్నారు. నర్సంపేటలోని ఐసోలేషన్ సెంటర్లకు కోవిడ్ బాధితులు వస్తున్నారు. జనగామ జిల్లాలోని జనగామ పట్టణంలోని సాంఘిక సంక్షేమ పాఠశాలలో 100 పడకలతో, పసరమడ్లలో 100 పడకలతో అలాగే అన్ని మండల కేంద్రాల్లో 100 పడకలతో ఐసోలేషన్ సెంటర్లను రోగులకు అందుబాటులో ఉంచారు. ప్రతీ సెంటర్‌లో ఒక డాక్టర్‌ను, 12 మంది నర్సులు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ వర్కర్లను నియమించారు. మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రాల్లో రెండేసి. అన్ని మండల కేంద్రాల్లో ఒక్కొటి చొప్పున ఏర్పాటు చేశారు.
హోం ఐసోలేషన్ శ్రేయస్కరం కాదు
ప్రభుత్వం ఉమ్మడి ఐసోలేషన్ సెంటర్ల నిర్వహణను పక్కన పెట్టి హోం ఐసోలేషన్‌ను ఎక్కువగా ప్రోత్సహిస్తోంది. స్వల్ప రోగ లక్షణాలున్న కరోనా పాజిటివ్ రోగులను హోం ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా సూచిస్తున్నారు. అయితే హోం ఐసోలేషన్ అత్యంత ప్రమాదకరంగా తయారైంది. హోం ఐసోలేషన్ ఎంచుకున్న వారిలో చాలా మంది మృత్యువాత పడుతున్నారు. కుటుంబ సభ్యులంతా సామూహికంగా కరోనా బారిన పడుతున్నారు. కరోనా సెకెండ్ వేవ్‌లో ఒకే కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు, కొన్నిచోట్ల కుటుంబంలోని సభ్యులంతా ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి.
మాటలకే..
ఇప్పుడున్న పరిస్థితుల్లో హోం ఐసోలేషన్ శ్రేయస్కరం కాదని నిపుణులు చెబుతున్నా ప్రభుత్వం మాత్రం ‘హోం ఐసోలేషన్‌లో ఉన్నవారి బాధ్యత మాదే... వారికి అవసరమైన మందులు అందిస్తాం... ఎఎన్‌ఎం లేదా ఆశా వర్కర్లు రోజుకో సారి వచ్చి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తారు... అత్యవసరమైతే ఆస్పత్రికి తరలిస్తారు... అని చెబుతోంది..’ కానీ ఇందులో ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. హోంఐసోలేషన్‌లో ఉన్నవారిలో చాలా మంది సొంత డబ్బులతో మందులు కొనుక్కుంటున్నారు. ఆస్పత్రిలో బెడ్స్ దొరకడం లేదు. కరోనా రోగుల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉమ్మడి ఐసోలేషన్, క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేయడం అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.