వచ్చే నెలంతా... ప్రవేశ పరీక్షలే!

ABN , First Publish Date - 2021-07-12T08:25:57+05:30 IST

ఉన్నత విద్యకు సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం వచ్చే నెలంతా పలు పరీక్షలు జరగనున్నాయు. సాధారణంగానైతే ఇప్పటికే ప్రవేశ పరీక్షలన్నీ పూర్తయి,

వచ్చే నెలంతా... ప్రవేశ పరీక్షలే!

కరోనా ప్రభావంతో మారిన పరీక్షల షెడ్యూల్‌

ఆగస్టు 3 నుంచి వరుసగా ఎంట్రన్సులు 

వెంటనే ఫలితాల విడుదలకు సన్నాహాలు

సెప్టెంబరులో ప్రవేశాలు.. తరగతుల ప్రారంభం


హైదరాబాద్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యకు సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం వచ్చే నెలంతా పలు పరీక్షలు జరగనున్నాయు. సాధారణంగానైతే ఇప్పటికే ప్రవేశ పరీక్షలన్నీ పూర్తయి, తరగతులు ప్రారంభమవుతాయి. కానీ, కరోనా పరిస్థితుల నేపథ్యంలో గత ఏడాది పరీక్షలు ఆలస్యంగా జరిగాయి. తాజాగా ఈ ఏడాది ఆగస్టులో ప్రవేశ పరీక్షల నిర్వహణకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్టు మొదటి వారంలో ప్రారంభం కానున్న పరీక్షలు.. చివరి దాకా కొనసాగనున్నాయి. ఎంసెట్‌, ఈసెట్‌, పీజీ ఈసెట్‌, ఐసెట్‌, లాసెట్‌ రాసేందుకు ఇప్పటికే లక్షలాది మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది అన్ని సెట్లకు కలిపి సుమారు 4.05 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే... ఈ ఏడాది ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ఎంసెట్‌ (ఇంజనీరింగ్‌)కు 1.60 లక్షలు, ఎంసెట్‌ (అగ్రికల్చర్‌)కు 83 వేలు, ఈసెట్‌కు 23,962, ఐసెట్‌కు 51,678, ఎడ్‌సెట్‌కు 31,160, లాసెట్‌ (మూడేళ్ల కోర్సు)కు 24,397 మంది, లాసెట్‌ (ఐదేళ్ల కోర్సు)కు 6,237 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా సమయం ఉండడంతో అభ్యర్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.


ఆగస్టు మూడో తేదీ నుంచి..

ఆగస్టు 3న ఈసెట్‌తో ఈ ప్రవేశ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 4 నుంచి 10వ తేదీ వరకు ఎంసెట్‌  జరగనుంది. ఇలా వచ్చే నెల చివరి వరకూ పరీక్షలు కొనసాగనున్నాయి. వీటి ఫలితాలను సైతం ఆగస్టు చివరి నాటికి విడుదల చేయాలని ఉన్నత విద్యా మండలి అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా విద్యా సంవత్సరం ఆలస్యం కాకుండా అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నారు. ఎంసెట్‌ ఫలితాలను ఆగస్టు 20తర్వాత ప్రకటించి, వెంటనే అడ్మిషన్లకు సంబంధించిన కౌన్సెలింగ్‌ చేపట్టను న్నారు. ప్రవేశాల ప్రక్రియను త్వరగా పూర్తి చేయడం ద్వారా, సెప్టెంబరులో తరగతులు ప్రారంభించడానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.  Updated Date - 2021-07-12T08:25:57+05:30 IST