డెంగీలో కొత్త స్ట్రెయిన్‌?

ABN , First Publish Date - 2021-10-07T07:28:08+05:30 IST

రాష్ట్రంలో కొత్త డెంగీ స్ట్రెయిన్‌ వ్యాపిస్తోందా ? కొంతమందిలో తీవ్ర స్థాయిలో డెంగీ

డెంగీలో కొత్త స్ట్రెయిన్‌?

కేసులు భారీగా పెరగడానికి కారణమదేననే అనుమానాలు

హైదరాబాద్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కొత్త డెంగీ స్ట్రెయిన్‌ వ్యాపిస్తోందా ? కొంతమందిలో తీవ్ర స్థాయిలో డెంగీ జ్వరానికి కారణం అదేనా ? ఈ ఏడాది డెంగీ కేసులు దాని వల్లే పెరిగాయా ? అనే ప్రశ్నలకు సమాధానాలను వెతికే పనిలో వైద్య ఆరోగ్యశాఖ ఉంది. ఇందులో భాగంగా డెంగీతో ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్న కేసులను వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.


ఈనేపథ్యంలో వైద్య విద్య సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, ప్రజారోగ్య సంచాలకుడు (డీహెచ్‌) డాక్టర్‌ గడల శ్రీనివాసరావు ఫీవర్‌, నీలోఫర్‌ ఆస్పత్రులను బుధవారం సందర్శించారు. అక్కడ విషమ స్థితిలో చికిత్సపొందుతున్న డెంగీ రోగుల రక్త నమూనాలను జన్యుక్రమ విశ్లేషణ (జీనోమ్‌ సీక్వెన్సింగ్‌)కు పంపించాలని వైద్యారోగ్యశాఖ అధికారులు సూత్రపాయంగా నిర్ణయించారు. ఇప్పటికే ఆరోగ్యం బాగా విషమించిన రోగుల వివరాలను ఆయా ఆస్పత్రుల నుంచి వైద్యశాఖ తెప్పించుకుంటోంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో డెంగీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. 2019లో 13వేలకుపైగా డెంగీ కేసులు నమోదవగా, ఈ ఏడాది ఇప్పటివరకు 4వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి.


Updated Date - 2021-10-07T07:28:08+05:30 IST