‘జిల్లా కోర్టు’కు కొత్త కళ

ABN , First Publish Date - 2021-12-15T06:05:37+05:30 IST

చారిత్రక వరంగల్‌ జిల్లా కోర్టు నూతన హంగులను సంతరించుకుంది. కోర్టు ప్రాంగణంలో రూ. 23.30 కోట్ల వ్యయంతో నిర్మించిన న్యాయ భవన సముదాయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈనెల 19న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ ప్రారంభోత్సవం చేయనున్నారు.

‘జిల్లా కోర్టు’కు కొత్త కళ
నూతనంగా నిర్మించిన కోర్టు భవనం

రూ. 23 కోట్లతో నూతన భవన సముదాయం నిర్మాణం
19న చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ చేతులమీదుగా ప్రారంభోత్సవం
అందుబాటులోకి రానున్న ఆధునిక సౌకర్యాలు


వరంగల్‌ లీగల్‌, డిసెంబరు 14 :  చారిత్రక వరంగల్‌ జిల్లా కోర్టు నూతన హంగులను సంతరించుకుంది.  కోర్టు ప్రాంగణంలో రూ. 23.30 కోట్ల వ్యయంతో నిర్మించిన న్యాయ భవన సముదాయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈనెల 19న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ మేరకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. నూతన భవనాల  నిర్మాణంతో అదనపు సౌకర్యాలు  అందుబాటులోకి వచ్చాయి. రూ. 21.65 కోట్లతో సువిశాలమైన భవన సముదాయాన్ని నిర్మించగా రూ. కోటి వ్యయంతో పార్కింగ్‌, అంతర్గత సీసీ రోడ్లు, లాన్‌ను ఏర్పాటు చేశారు. మరో రూ. 65 లక్షలతో కోర్టు  ప్రాంగణంలోనే శిశు సంక్షేమ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.

10 కోర్టులు
కొత్త న్యాయ భవన సముదాయంలో పది కోర్టులను ఏర్పాటు చేస్తారు. ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు, మొదటి అదనపు సివిల్‌ జడ్జి కోర్టుతో పాటు రెండవ, మూడవ, నాల్గవ,  అయిదవ, ఆరవ, ఏడవ అదనపు సివిల్‌ జడ్జి కోర్టులు వీటిలో ఉన్నాయి. వీటితో పాటు ఇదే భవనంలో ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ కోర్టు, పీసీఆర్‌ కోర్టును కూడా ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఉన్న నిజాం కాలం నాటి పాత భవనంలో ప్రిన్సిపల్‌ జిల్లా జడ్జి కోర్టుతో పాటు నాలుగు అదనపు జిల్లా కోర్టులను కొనసాగిస్తారు. సీనియర్‌ సివిల్‌  జడ్జి కోర్టులను పాత సబ్‌ కోర్టు భవనంలోనే యథావిధిగా కొనసాగిస్తారు.  ఫ్యామిలీ కోర్టును ప్రస్తుతం ఉన్న ప్రత్యేక భవనంలో కొనసాగిస్తారు. ప్రస్తుతం ఉన్న పాత మూడవ అదనపు మున్సిఫ్‌ కోర్టు (నక్సలైట్‌ ప్రత్యేక కోర్టు) భవనాన్ని శిశు సంక్షేమ కేంద్రంగా మార్చారు. 1,23,980 చదరపు అడుగుల విస్త్రీర్ణంలో నూతన భవనాన్ని నిర్మించారు.

సీజేఐ పర్యటన ఇలా...
నూతన న్యాయ భవన సముదాయాన్ని ప్రారంభించేందుకు భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ హనుమకొండకు రానున్నారు. ఈనెల 18న మధ్యాహ్నం హనుమకొండకు చేరుకుంటారు. ఆ వెంటనే రామప్ప దేవాలయాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి నేరుగా వరంగల్‌ కోటకు వెళతారు. కోట సందర్శన అనంతరం రాత్రి నిట్‌ కళాశాలలోని అతిఽధి  గృహంలో బస చేస్తారు. మరునాడు 19వ తేదీ ఉదయం 5.30 గంటలకు సుప్రసిద్ధ భద్రకాళి ఆలయాన్ని సందర్శిస్తారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఉదయం 9 గంటలకు జిల్లా కోర్టుకు చేరుకొని నూతన న్యాయ భవన సముదాయానికి ప్రారంభోత్సవం చేస్తారు. మధ్యాహ్నం భోజనం అనంతరం తిరిగి వెళతారు.

విస్తృత ఏర్పాట్లు
జీజేఐ రాక సందర్భంగా కోర్టు ప్రాంగణంతో పాటు ఆయన సందర్శించే ప్రదేశాలలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కోర్టు ఆవరణను అందంగా తీర్చిదిద్దుతున్నారు. భవనాలను విద్యుత్‌దీపాలతో అలంకరిస్తున్నారు.



Updated Date - 2021-12-15T06:05:37+05:30 IST