మార్పులు.. చేర్పులు....

ABN , First Publish Date - 2021-07-08T05:41:08+05:30 IST

వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లాల స్వరూపాలను మార్చి హన్మకొండ, వరంగల్‌ జి ల్లాలుగా ఏర్పాటు చేసే ప్రక్రియ రోజుకో మలుపు తిరుగుతోంది. ఎమ్మెల్యేల ప్రతిపాదనలు ఎప్పటికప్పుడు మారుతుండటంతో అధికారులు అందుకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తున్నట్లు సమాచారం.

మార్పులు.. చేర్పులు....

‘హన్మకొండ జిల్లా’లోకి పరకాల, దామెర, నడికూడ మండలాలు
తెరపైకి వచ్చిన సరికొత్త ప్రతిపాదన
‘వరంగల్‌ జిల్లా’లోనే వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి
రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా వర్ధన్నపేట
ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించిన అధికారులు


వరంగల్‌ అర్బన్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి):
వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లాల స్వరూపాలను మార్చి హన్మకొండ, వరంగల్‌ జి ల్లాలుగా ఏర్పాటు చేసే ప్రక్రియ రోజుకో మలుపు తిరుగుతోంది.  ఎమ్మెల్యేల ప్రతిపాదనలు ఎప్పటికప్పుడు మారుతుండటంతో అధికారులు అందుకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తున్నట్లు సమాచారం. ప్రజల సౌకర్యం కంటే ప్రజాప్రతినిధులకు అసౌకర్యం కలిగించకుండా ఉండేందుకే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  భౌగోళిక అనుకూలతలు ఏ విధంగా ఉన్నప్పటికీ తాము సూచించినట్టే జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రజాప్రతినిధులు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధుల భిన్నాభిప్రాయాలతో  హన్మకొండ, వరంగల్‌ జిల్లాల ఏర్పాటు కసరత్తు  మరింత సంక్లిష్టంగా మారుతోంది. ప్రస్తుతం వరంగల్‌ రూరల్‌ జిల్లా (వరంగల్‌) పరిధిలో ఉన్న పరకాల మండలాన్ని హన్మకొండ జిల్లా (వరంగల్‌ అర్బన్‌)లో కలిపేందుకు తాజాగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.  అన్నీ కలిసి వస్తే నాలుగైదు రోజుల్లో దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

పరకాల చేర్పు..
హన్మకొండ జిల్లా (వరంగల్‌ అర్బన్‌)లో పరకాలను కలిపే ప్రతిపాదనను అధికారులు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. పరకాలతో పాటు నడికూడ, దామెర మండలాలను కూడా హన్మకొండ జిల్లాలో కలుపనున్నట్టు తెలిసింది. ఇదే జరిగితే  పరకాల ప్రజలు కొత్తగా ఏర్పడే వరంగల్‌ జిల్లా సరిహద్దులను (ఆత్మకూరు) దాటి రావాల్సి వస్తుంది. సహజంగా ఒక జిల్లా మొత్తం ఒకే  భౌగోళిక స్వరూపాన్ని కలిగి ఉంటుంది. మరో జిల్లా సరిహద్దులను దాటి తమ జిల్లాలోనికి రావడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పరకాల ప్రాంత ప్రజలు గూనిపర్తి, అంబాల, ఎర్రగట్టు గుట్ట ద్వారా హన్మకొండకు రావాలి. ఇదే దారిలో నడికూడ ప్రజలు కూడా చేరుకోవాల్సి ఉంటుంది. దామెర మండల ప్రజలు మాత్రం మరో జిల్లా సరిహద్దును దాటి రావాల్సిందే. కానీ హన్మకొండ జిల్లాలో పరకాలను కలిపే ప్రతిపాదనే పూర్తయినట్లుగా తెలుస్తోంది..

ఆ మూడు మండలాలు...

ఇంతకుముందు ప్రతిపాదించినట్లుగా వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి మండలాలు హన్మకొండ జిల్లాలో కాకుండా మళ్లీ వరంగల్‌ జిల్లాలో చేర్చారు. ఈ మండలాల ప్రజలు తమకు హన్మకొండ కంటే వరంగల్‌ జిల్లాలో చేర్చితేనే సౌకర్యంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని ప్రజాప్రతినిధులు అంటున్నారు. వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల సరిహద్దు గ్రామాలు వరంగల్‌ మండల సరిహద్దును ఆనుకుని ఉంటాయి.  వ్యవసాయ మార్కెట్‌, కూరగాయల మార్కెట్‌, ఎరువులు, విత్తనాలు దుకాణాలన్నీ కూడా వరంగల్‌లోనే ఉన్నాయి. దీంతో హన్మకొండ జిల్లాలో కలిపితే తమకు ఇబ్బందికరంగా మారుతుందన్న అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. దీంతో ఈ మండలాలను వరంగల్‌ జిల్లాలో కలిపేస్తున్నారు.

వర్ధన్నపేట రెవెన్యూ డివిజన్‌ కేంద్రం

హన్మకొండ జిల్లాలోకి పరకాల రెవెన్యూ డివిజన్‌ విలీనమయ్యే ప్రతిపాదన ఉన్నందున ప్రత్యామ్నాయంగా వర్ధన్నపేటను కొత్తగా రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు చేశారు. వర్ధన్నపేట రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటైతే వరంగల్‌ (రూరల్‌) జిల్లాలో ఎప్పటిలాగానే మూడు రెవెన్యూ డివిజన్‌ కేంద్రాలు ఉంటాయి. హన్మకొండ జిల్లాలోనూ హన్మకొండ, పరకాల రెవెన్యూ డివిజన్‌ కేంద్రాలు ఉంటాయి.

త్వరలో ఉత్తర్వులు
హన్మకొండ, వరంగల్‌ జిల్లాల విభజన ప్రక్రియ పూర్తి కావడంతో రెండు మూడు రోజుల్లోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. హరితహారంతో పాటు ఇతర కార్యక్రమాలు ఈనెల 10 వరకు కొనసాగుతాయి. అనంతరం ప్రభుత్వం జిల్లాల విభజన ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. విభజన ప్రక్రియలో భాగంగా ముందుగా ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం పూర్తిస్థాయిలో జిల్లాల విభజనకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తారు.



Updated Date - 2021-07-08T05:41:08+05:30 IST