వరి నాట్లకు ‘పొరుగు’ కూలీలు

ABN , First Publish Date - 2021-02-01T08:53:47+05:30 IST

రాష్ట్రంలో పరిశ్రమలు, భవన నిర్మాణం, హోటళ్లు, ఇతర రంగాల్లో ఎక్కడ చూసినా స్థానికుల కంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పని చేసేవారు ఎక్కువగా కనిపిస్తారు. ఇప్పుడు సాగు పనులకూ వారిపైనే

వరి నాట్లకు ‘పొరుగు’ కూలీలు

యూపీ, మహారాష్ట్ర, ఒడిశా నుంచి రాక

ఎకరాకు రూ.4వేల చొప్పున చెల్లింపులు

రోజుకు 6 నుంచి7 ఎకరాల్లో నాట్లు పూర్తి

ఖర్చులు తగ్గడంతో వారి వైపే రైతుల మొగ్గు

స్థానిక కూలీలు దొరక్కపోవడం మరో కారణం


ఏన్కూరు/మెదక్‌/సిరిసిల్ల, జనవరి 31: (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పరిశ్రమలు, భవన నిర్మాణం, హోటళ్లు, ఇతర రంగాల్లో ఎక్కడ చూసినా స్థానికుల కంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పని చేసేవారు ఎక్కువగా కనిపిస్తారు. ఇప్పుడు సాగు పనులకూ వారిపైనే ఆధారపడాల్సి వస్తోంది. వ్యవసాయ రంగాన్ని కూలీల కొరత వేధిస్తుండడంతో చాలా మంది రైతులు ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీ్‌సగఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి కూలీలను రప్పించి వరినాట్లు పూర్తి చేయుస్తున్నారు. గత ఏడాది భారీ వర్షాలు కురిసి ప్రాజెక్టులు, చెరువులు, వాగులు నీటితో కళకళలాడుతున్నాయి. సాగు విస్తీర్ణం సాధారణం కంటే ఎక్కువగా ఉండడంతో కూలీల కొరత ఏర్పడింది. వరినాట్లకు స్థానికంగా కూలీలు లభించడం లేదు. దీంతో రవాణా చార్జీలు చెల్లించి మరీ ఇతర రాష్ట్రాల కూలీలను రప్పిస్తున్నారు. వీరు 20 మందితో ఒక్కో బృందంగా ఏర్పడి వరినాట్లు వేసే పనిని గుత్తకు తీసుకుంటున్నారు. ఎకరానికి రూ.3,800 కూలిగా, బియ్యం, వంటగ్యాస్‌ కోసం అదనంగా మరో రూ.200 చెల్లిస్తున్నారు. ఉదయం 6.30 నుంచి సాయంత్రం చీకటి పడే వరకు పని చేసే వీరు.. ఒక్కరోజులోనే 6-7 ఎకరాల వరకూ నాట్లు వేస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఓ మధ్యవర్తి ద్వారా యూపీలోని పిలిబిత్‌ జిల్లాకు చెందిన వేలాది మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చేరుకున్నారు. వారిలో కొందరు నిజామాబాద్‌ జిల్లా నవీపేట, ఏపీలోని విజయవాడ, రాజమండ్రి ప్రాంతాలకు వెళ్లగా మరికొందరు మెదక్‌ జిల్లాకు వచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలంలోని గాలిపల్లి, పొత్తూర్‌, సోమారంపేట గ్రామాల్లో ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చిన 24 మంది కూలీలు పదిహేను రోజులుగా నాట్లు వేస్తున్నారు. 


చకాచకా పని.. వ్యయం తక్కువ

వాస్తవానికి స్థానిక కూలీలకు అధిక మొత్తంలో కూలి చెల్లిస్తున్నా సరిపడా మంది అందుబాటులో ఉండడం లేదని రైతులు వాపోతున్నారు. మహిళా కూలీలకు రోజూ రూ.400-500తోపాటు రవాణా చార్జీలు రైతులు చె ల్లించాల్సి ఉంటుంది. దీంతో ఎకరా వరినాటు వేసేందుకు సుమారుగా రూ.6 వేలకుపైగా వ్యయమవుతోంది. అదే ఇతర రాష్ట్రాల కూలీలైతే ఎకరాకు బత్తాతో కలిపి రూ.4వేల లోపే తీసుకుంటూ నాట్లు పూర్తి చేస్తున్నారు. దీంతో కూలీలు ఉండేందుకు చిన్నపాటి రేకుల షెడ్లలో వసతి కల్పించే బాఽధ్యతను రైతులే తీసుకుంటున్నారు. తక్కువ సమయంలో చకచకా పనులు పూర్తి చేస్తుండడంతో ఇతర రాష్ట్రాల కూలీలవైపే అన్నదాతలు మొగ్గుచూపుతున్నారు.  


కూలీల కొరత వల్లే

ఇక్కడ అవసరమైన మేర కూలీలు దొరకడం లేదు. ఎక్కువ కూలి ఇస్తున్నా ఇబ్బందులు తప్పడంలేదు. అందుకే తెలిసిన వ్యక్తి ద్వారా ఉత్తరప్రదేశ్‌కు చెందిన కూలీలను పిలిపించాను. వారి వల్ల వరినాట్లు త్వరగా పూర్తయ్యాయి. ఖర్చు కూడా తగ్గింది.

- సుధాకర్‌రావు, రైతు, మాచవరం, మెదక్‌ 


ఉపాధి కోసమే ఇంతదూరం వస్తున్నాం

మేం ఉత్తరప్రదేశ్‌ నుంచి ఏటా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు పని కోసం వస్తున్నాం. మా ఊళ్లో రోజూ పని దొరకదు. అందుకే సీజన్‌లో ఇక్కడికి వచ్చి వరినాట్లు వేస్తాం. రోజుకు ఒక్కొక్కరం రూ.600పైగానే సంపాదిస్తాం.

- శంకర్‌, వ్యవసాయ కూలీ, ఉత్తరప్రదేశ్‌

Updated Date - 2021-02-01T08:53:47+05:30 IST