సాయుధ పోరాట యోధుల ఫొటోలతో తపాలా కవర్లు!

ABN , First Publish Date - 2021-10-14T09:03:39+05:30 IST

సాయుధ పోరాట యోధుల ఫొటోలతో తపాలా కవర్లు!

సాయుధ పోరాట యోధుల ఫొటోలతో తపాలా కవర్లు!

హైదరాబాద్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): జాతీయ తపాలా శాఖ వారోత్సవాల (అక్టోబరు 11-17) సందర్భంగా తెలంగాణ పోరాట యోధుల ఫొటోలతో రూపొందించిన ప్రత్యేక పోస్టల్‌ కవర్లను వారి జన్మస్థలాల్లో తపాలా శాఖ విడుదల చేసింది. ప్రధానంగా నిజాం నియంతృత్వ పాలనపై తిరుగుబాటు చేసిన కొమురం భీం ఫొటోతో కూడిన ప్రత్యేక కవర్‌ను బుధవారం కొమరంభీం జిల్లా పెద్దధోభా తపాలా కార్యాలయంలో తెలంగాణ సర్కిల్‌ చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ ఎస్‌.రాజేంద్రకుమార్‌ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కొమురంభీం కుటుంబసభ్యులతో పాటు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే చాకలి ఐలమ్మ ఫొటోతో రూపొందించిన ప్రత్యేక పోస్టల్‌ కవర్‌ను జనగాం జిల్లాలోని చాకలి ఐలమ్మ సొంతూరు పాలకుర్తిలో హైదరాబాద్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ డాక్టర్‌ పీవీఎస్‌ రెడ్డి విడుదల చేశారు. 


తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి ఫొటోతో రూపొందించిన ప్రత్యేక తపాలా కవర్‌ను ఆయన సొంతూరు భువనగిరి జిల్లా టేకుల సోమారంలో తపాలా శాఖ రీజినల్‌ హెడ్‌ క్వార్టర్స్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ శ్రీలత ఆవిష్కరించారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ కమ్యూనిస్టు నేత, ఉర్దూ కవి మఖ్దూం మోహియుద్దీన్‌ ఫొటోతో రూపొందించిన పోస్టల్‌ కవర్‌ను ఆయన స్వస్థలం అందోలులో తపాలా శాఖ తెలంగాణ హెడ్‌ క్వార్టర్స్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ పోస్టల్‌ సర్వీసెస్‌ కె.ఎ.దేవరాజ్‌ విడుదల చేశారు. ఇప్పటి వరకు భారత తపాలా శాఖ జాతీయ స్థాయిలో 167 మంది పోరాట యోధుల ఫొటోలతో ప్రత్యేక కవర్‌ను రూపొందించి విడుదల చేసినట్లు తపాలా శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. 

Updated Date - 2021-10-14T09:03:39+05:30 IST