సవాళ్ల నామ సంవత్సరం!

ABN , First Publish Date - 2021-12-31T09:30:02+05:30 IST

టీఆర్‌ఎస్‌కు అంతగా అచ్చిరాలేదు! బీజేపీకి మిశ్రమ ఫలితాలు! కాంగ్రెస్‌కు కొత్త జీవం! ఈ ఏడాది (2021) కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మలుపులు! గత ఏడాది చివర్లో టీఆర్‌ఎస్‌కు దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలింది!

సవాళ్ల నామ సంవత్సరం!

టీఆర్‌ఎస్‌కు అంతగా అచ్చిరాలేదు! బీజేపీకి మిశ్రమ ఫలితాలు! కాంగ్రెస్‌కు కొత్త జీవం! ఈ ఏడాది (2021) కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మలుపులు! గత ఏడాది చివర్లో టీఆర్‌ఎస్‌కు దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలింది! అయినా, అప్పటికి టీఆర్‌ఎస్‌ అజేయ శక్తిగానే ఉంది! ఈ ఏడాది మేలో నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలో తన స్థానాన్ని నిలబెట్టుకున్నా.. ఆ తర్వాత జీహెచ్‌ఎంసీ ఎన్నికలు; హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో వరుస ఎదురు దెబ్బలు తప్పలేదు! బండి సంజయ్‌ నాయకత్వం, దుబ్బాక, హుజూరాబాద్‌, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపుతో కమలం పార్టీకి కొత్త జోష్‌ వచ్చింది! మాస్‌ లీడర్‌ రేవంత్‌ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టడంతో ఆశలుడిగిన కాంగ్రెస్‌కు మళ్లీ జవసత్వాలు వచ్చినట్లయింది! 2023లో అధికారమే పరమావధిగా ఆ రెండు పార్టీలూ పావులు కదుపుతున్నాయి! ఇటు అధికార పార్టీకి, అటు ప్రతిపక్షాలకు 2022 రాజకీయ సవాళ్ల నామ సంవత్సరమే!!హైదరాబాద్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ వచ్చిన ఏడున్నరేళ్లలో అధికార పార్టీ ఎన్నడైనా ధర్నా చేసిందా!? సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేరుగా ధర్నాలో పాల్గొన్నారా!? అది కూడా.. అక్కర్లేదని తానే మూసేసిన ధర్నా చౌక్‌లో ఆయన ధర్నాలో కూర్చున్నారు! వరుసగా విలేకరుల సమావేశాలు పెట్టారు! వరుసగా ఏడేళ్లుగా అధికారంలో ఉండి కూడా హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ముందు లక్షల కోట్ల విలువైన దళిత బంధు పథకాన్ని ప్రకటించారు! 2021 తీసుకొచ్చిన అనూహ్య మార్పులివి! గత ఏడున్నరేళ్లుగా ఎన్నడూ లేనట్లు ప్రతిపక్షాల నుంచి సవాళ్లు ఎదురు కావడమే ఇందుకు కారణం! వచ్చే ఏడాది (2022)లోనూ ఈ సవాళ్లు కొనసాగనున్నాయి. అధికార పార్టీకి కొత్త సంవత్సరం నల్లేరుపై బండి నడక ఏమాత్రం కాబోదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఓవైపు, కరోనా అనంతర ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడం.. మరోవైపు, ప్రభుత్వం ప్రకటించిన పథకాలను అమలు చేయడం.. 2023లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేయడం సీఎంగా కేసీఆర్‌కు సవాలే! ఇక, గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ డిపాజిట్లు కోల్పోయినా.. ఉప ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు అధికార పార్టీని ఢీకొనేలా పార్టీని తీర్చిదిద్దడం సవాలే! అలాగే, తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా చతికిలబడిన కాంగ్రెస్‌.. రేవంత్‌ నాయకత్వంలో హుజూరాబాద్‌లోనూ డిపాజిట్‌ను దక్కించుకోలేకపోయింది! కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న రెండు పార్టీలనూ ఎదుర్కొంటూ.. పూర్వ వైభవం దిశగా పార్టీని నడిపించడం రేవంత్‌ ముందున్న అతి పెద్ద సవాలు!


పథకాల అమలు ఎలా!?

ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలను కొనసాగిస్తూనే, కొత్త పథకాలను అమలు చేయడం సీఎం కేసీఆర్‌కు కత్తి మీద సామే! హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సందర్భంగా ప్రకటించిన దళిత బంధును రాబోయే రెండేళ్లలో సంతృప్త స్థాయిలో అమలు చేయాల్సి ఉంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా వరద బాధితులకు ఇస్తామన్న పరిహారాన్ని ఆ తర్వాత పట్టించుకోకపోవడం హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ప్రభావం చూపిందనే అభిప్రాయం ఉంది. అటువంటి పరిస్థితి దళిత బంధు విషయంలో పునరావృతం కాకుండా చూసుకోవాల్సి ఉంది. అంతేనా, ఈ పథకం అమలుతో ఇతర వర్గాల్లో వెల్లువెత్తే అసంతృప్తిని చల్లార్చడానికి వారికి కూడా పథకాలను ప్రకటించి సంతృప్తస్థాయిలో అమలు చేయడం కత్తి మీద సామే. మరోవైపు, ఒక్కో నిరుద్యోగికి నెలకు రూ.3,016 చొప్పున భృతి ఇస్తామని ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల హామీగా ప్రకటించింది. మూడేళ్లు గడిచినా ఈ పథకం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. నిరుద్యోగ భృతి అమలుతోపాటు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం యువత ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది. నోటిఫికేషన్లు ఇచ్చి రాబోయే రెండేళ్లలో ఉద్యోగాలను భర్తీ చేయడంతోపాటు లక్షలాదిగా ఉన్న నిరుద్యోగులకు భృతి పథకాన్ని అమలు చేయడం టీఆర్‌ఎస్‌ సర్కారుకు అతి పెద్ద పరీక్ష కానుంది.


అలాగే, ఎన్నికల హామీ రుణ మాఫీ ఇప్పటి వరకూ పాక్షికంగానే అమలైంది. కేవలం రూ.32 వేలలోపు వారికి రూ.732 కోట్లు మాఫీ చేశారు. లక్ష రూపాయల వరకూ ఉన్న మిగిలిన వారికి అమలు చేయాల్సి ఉంది. ఇందుకు మరో రూ.25,204 కోట్లు అవసరమని అంచనా. ఈ ఏడాదిలోనే ఈ మొత్తాన్ని కూడా మాఫీ చేయాల్సి ఉంది. ఇక, అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ఏడాదికి రూ.20 వేల కోట్లకుపైనే బడ్జెట్‌ కేటాయించి ఉత్తర తెలంగాణకు కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారు. ఇప్పుడు దక్షిణ తెలంగాణకు గుండె కాయ వంటి పాలమూరు, డిండి వంటి ప్రాజెక్టులను పూర్తి చేయాల్సి ఉంది. వీటికి కూడా భారీగా ఖర్చు చేయక తప్పని పరిస్థితి. పింఛనుదారుల వయసు తగ్గించి, కొత్త పెన్షన్లు అమలు చేయడం; అమల్లో ఉన్న పథకాలను కొనసాగించడానికి పెద్దఎత్తున డబ్బులు కావాలి. సంపన్న రాష్ట్రమైనా, కరోనా వల్ల గత రెండేళ్లుగా రాబడులు గణనీయంగా తగ్గాయి. ఈ ఏడాదే ప్రభుత్వం రూ.35 వేల కోట్ల వరకూ అప్పు చేసింది. తాజాగా, మరోసారి కరోనా ప్రభావం చూపుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఇటు ఆర్థిక పరిస్థితిని; అటు పథకాల అమలును బ్యాలెన్స్‌ చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగాల్సి ఉంది.

Updated Date - 2021-12-31T09:30:02+05:30 IST