సర్పంచ్ మల్లమ్మ ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-03-24T16:39:41+05:30 IST

నల్గొండ: జిల్లాలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య విబేధాలు ఓ గ్రామంలో చిచ్చు రేపాయి.

సర్పంచ్ మల్లమ్మ ఆత్మహత్యాయత్నం

నల్గొండ జిల్లా: ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య విబేధాలు ఓ గ్రామంలో చిచ్చు రేపాయి. ఫ్లెక్సీలో మాజీ ఎమ్మెల్యే ఫోటో పెట్టినందుకు ఆ ఎమ్మెల్యే ఆగ్రహించారు. ఆ తర్వాత సర్పంచ్ పదవికే ఎసరు వచ్చింది. దీంతో మహిళ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం చేసింది. తనను కాపాడాలంటూ టీఆర్ఎస్ పెద్దలను చేతులు జోడించి వేడుకుంది.


చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామ సర్పంచ్‌ దేశబోయిన మల్లమ్మ మంగళవారం ఆత్మహత్యాయత్నం చేసింది. వెలిమినేడు గ్రామంలో హరితహారం కార్యక్రమంలో మొక్కలపై అశ్రద్ధగా వ్యవహరించారని ఫిర్యాదు అందడంతో విచారణ అనంతరం జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ ఈ నెల 22వ తేదీన సర్పంచ్‌ మల్లమ్మను సస్పెండ్‌ చేశారు. సర్పంచ్‌, ఉపసర్పంచ్‌లిద్దరూ అధికార పార్టీకి చెందినవారే కాగా; ఉపసర్పంచ్‌ మహంకాలి మచ్చేందర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు మంగళవారం సర్పంచ్‌ ఆధ్వర్యంలో ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి సమక్షంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అవిశ్వాస తీర్మాన ప్రతులను ఉపసర్పంచ్‌ చింపివేయటంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లుగా ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి ప్రకటించి వెళ్లిపోయారు. అనంతరం బయటకు వచ్చిన సర్పంచ్‌ దేశబోయిన మల్లమ్మ మాట్లాడుతూ తాను ఎలాంటి తప్పు చేయకున్నా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కక్ష సాధింపుతో సస్పెండ్‌ చేయించారని ఆరోపిస్తూ గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట బైఠాయించి కన్నీటి పర్యంతమయ్యారు. ప్రజాసేవ చేసేందుకు భూమిని విక్రయించానే తప్ప తానెక్కడా డబ్బు వసూళ్లకు పాల్పడలేదన్నారు. తాను చేసిన తప్పేంటో రుజువు చేస్తే శిక్షకు సిద్ధమన్నారు. తాను టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున సర్పంచ్‌గా గెలిచినా ఎమ్మెల్యే పట్టించుకోకుండా ఆయన వర్గానికే అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై ఎమ్మెల్యేను పలుమార్లు కలిసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తంచేశారు. 


సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ తన బాధను అర్థం చేసుకోకపోతే ప్రగతిభవన్‌ ఎదుట భైఠాయిస్తానని మల్లమ్మ పేర్కొంది. వార్డు సభ్యులతో కలిసి గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట కూర్చున్న సర్పంచ్‌ మల్లమ్మ ఎక్కడ నుండో పెట్రోల్‌ బాటిల్‌ తెచ్చుకుని ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా అక్కడే ఉన్న పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. సర్పంచ్‌ కళ్లలో పెట్రోల్‌ పడటంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నార్కట్‌పల్లి సీఐ శంకర్‌రెడ్డి, చిట్యాల ఎస్‌ఐ రావుల నాగరాజు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - 2021-03-24T16:39:41+05:30 IST