చికెన్‌ ధరలు ఢమాల్‌....పెరిగిన మటన్‌ ధర

ABN , First Publish Date - 2021-01-14T20:34:35+05:30 IST

బర్డ్‌ఫ్లూ పై భయాందోళనలు ముఖ్యమైన పండగల పైనా ప్రభావం చూపిస్తోంది. ప్రత్యేకించి సంక్రాంతి రోజున హైదరాబాద్‌నగరంలో భారీగా చికెన్‌ అమ్మకాలు జరుగుతుంటాయి.

చికెన్‌ ధరలు ఢమాల్‌....పెరిగిన మటన్‌ ధర

హైదరాబాద్‌: బర్డ్‌ఫ్లూ పై భయాందోళనలు ముఖ్యమైన పండగల పైనా ప్రభావం చూపిస్తోంది. ప్రత్యేకించి సంక్రాంతి రోజున హైదరాబాద్‌నగరంలో భారీగా చికెన్‌ అమ్మకాలు జరుగుతుంటాయి. కానీ ఈసారి బర్డ్‌ఫ్లూ భయాంతోళనల కారణంగా నగర వాసుల్లో దాదాపు 80శాతం మంది చికెన్‌ కొనుగోలు చేయలేదని వ్యాపారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లో బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు లేవని, చికెన్‌తినడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని ఒక పక్క ప్రభుత్వం ఎంతగా చెబుతున్నా ప్రజల్లో భయం మాత్రం తగ్గడం లేదు. దీంతో చికెన్‌ అమ్మకాలు భారీగా పడిపోతున్నాయి. బర్డ్‌ఫ్లూభయాందోళనల నేపధ్యంలో చికెన్‌ ధరలు ఏకంగా కిలో 200 నుంచి 150రూపాయలకు పడిపోయింది. అయినా కొనేందుకు వినియోగ దారులు జంకుతున్నారు. 


సాధారణంగా ఒక్క హైదరాబాద్‌లోనే రోజుకు సుమారు 6లక్షల కిలోల చికెన్‌ అమ్మకాలు జరుగుతుందని నగరంలోని మోండా మార్కెట్‌లో ఉన్న హోల్‌షేల్‌చికెన్‌ వ్యాపారి మహ్మంద్‌ ఖుద్దూస్‌ తెలిపారు. ఇక సంక్రాంతి పండగ రోజున ఒక్కరోజే దాదాపు 10లక్షల కిలో అమ్మకాలు జరుగుతుంటాయని తెలిపారు. వీటితో పాటు నాటుకోళ్ల అమ్మకాలు వేరుగా ఉంటాయని చెప్పారు. కానీ గురువారం సంక్రాంతి రోజున 2లక్షల కేజీల చికెన్‌ కూడా అమ్మకాలు జరగలేదని అంచనా అని ఆయన తెలిపారు. పరిస్థితి ఇలాగే ఉంటే ముందు ముందు చికెన్‌ అమ్మకాలు పూర్తిగా పడిపోయే ప్రమాదం ఉందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

మటన్‌ ధరలకు రెక్కలు!

ఇదిలా ఉండగా చికెన్‌ కొనేందుకు జంకుతున్న వారంతా మటన్‌ వైపు మళ్లుతున్నారు. దీంతో మటన్‌కు డిమాండ్‌ పెరిగింది. దీంతో కొందరు వ్యాపారులు ఇప్పటికే ధరలు పెంచేశారు. మటన్‌ ధర కిలో కు 700 రూపాయలు కాగా గురువారం పండగ నేపధ్యంలో వ్యాపారులు ఏకంగా కిలో 760 నుంచి 800 రూపాయల వరకు పెంచి అమ్మకాలు చేశారు. సాదారణ రోజుల్లో మటన్‌ అమ్మకాలు రోజుకు లక్ష నుంచి రెండు లక్షల కిలోల వరకు ఉంటుంది. కానీ సంక్రాంతి కారణంగా గురువారం ఒక్కహైదరాబాద్‌నగరంలోనే దాదాపు 3.5 లక్షల కేజీల మటన్‌అమ్మకాలుజరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. 




ప్రభుత్వం ఇప్పటికే మటన్‌ ధరలను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. రిటైల్‌ వ్యాపారులు కిలోకు 700 రూపాయలకంటే ఎక్కువ వసూలు చేయరాదని ఆదేశించింది. కానీ మటన్‌ అమ్మకాలు పెరుగుతుండడంతో కొందరు వ్యాపారులు యధేచ్చగా ధరలు పెంచి అమ్మకాలు చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుని, మటన్‌ ధరలను నియంత్రించాలని మాంసం ప్రియులు కోరుతున్నారు. 


Updated Date - 2021-01-14T20:34:35+05:30 IST