5 వేట కొడవళ్లు.. ఓ బ్యాటరీ రంపం!

ABN , First Publish Date - 2021-09-03T08:21:37+05:30 IST

అన్న చాంద్‌పాషాతో నెలకొన్న వ్యాపారం తాలూకు ఆర్థిక లావాదేవీలే మహ్మద్‌ షఫీకి ఆయనపై ఆగ్రహం తెప్పించాయి. ఆదాయాన్నంతా తాను తీసుకొని.. అప్పులన్నీ తన నెత్తిన రుద్దాడన్న..

5 వేట కొడవళ్లు.. ఓ బ్యాటరీ రంపం!

  • అన్న కుటుంబం హత్యకు పక్షం క్రితమే పథకం
  • వ్యాపారంలో అప్పులన్నీ తనపైనే నెట్టాడన్న కసితోనే
  • షఫీకి అతడి దగ్గర పనిచేసే ఐదుగురి సహకారం
  • నిందితుల అరెస్టు.. 
  • 24గంటల్లోనే తేల్చిన పోలీసులు


ఓరుగల్లు, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): అన్న చాంద్‌పాషాతో నెలకొన్న వ్యాపారం తాలూకు ఆర్థిక లావాదేవీలే మహ్మద్‌ షఫీకి ఆయనపై ఆగ్రహం తెప్పించాయి. ఆదాయాన్నంతా తాను తీసుకొని.. అప్పులన్నీ తన నెత్తిన రుద్దాడన్న కోసంతో అన్ననే కాదు ఆయన కుటుంబాన్నే అంతం చేయాలన్నంత కసి పెంచుకున్నాడు. బాధనంతా తన దగ్గర పనిచేసే ఐదుగురితో చెబితే వారు హత్యలకు సహకరిస్తామన్నారు. అంతే.. పక్కా పథకంతో అర్ధరాత్రి తర్వాత అన్న ఇంటిపై వేటకొడవళ్లు, బ్యాటరీ రంపంతో దాడి చేసి ఘోర మారణకాండ సృష్టించాడు.


ఈ మేరకు వరంగల్‌లో బుధవారం తెల్లవారుజామున చాంద్‌పాషా (50) ఇంట్లోకి చొరబడి.. ఆయన్ను, భార్య సబీరా (42)ను, ఆమె సోదరుడు ఖలీల్‌ (40)ను షఫీ ముఠా పాశవికంగా హత్యచేసి.. తీవ్రగాయాలతో చాంద్‌పాషా ఇద్దరు కుమారులను ప్రాణాపాయ స్థితిలోకి నెట్టిన కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. షఫీని, అతడికి సహకరించిన ఐదుగురిని అరెస్టు చేశారు. వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో గురువారం కేసు వివరాలను సీపీ తరుణ్‌జోషి వెల్లడించారు. 


రెండేళ్లుగా వ్యాపారంలో నష్టం

సొంత అన్నదమ్ములైన చాంద్‌పాషా, షఫీ.. వరంగల్‌ జిల్లా పరకాల నుంచి వరంగల్‌ నగరానికొచ్చి ఉంటున్నారు. సంతల్లో పశువులను కొని హైదరాబాద్‌లోని కబేళాలకు అమ్మేవారు. వచ్చిన ఆదాయాన్ని సమానంగా పంచుకునేవారు. రెండేళ్లుగా వ్యాపారంలో నష్టం వచ్చింది. అన్న చాంద్‌పాషా, వ్యాపారంలో వచ్చే రాబడిలో ఎక్కువ డబ్బులు తీసుకుని అప్పులను తనకు చూపించేవాడని షఫీ వాపోయేవాడు. పశువులు అమ్మిన రైతులు, ఇతర వ్యాపారస్తులు డబ్బులు చెల్లించాలని చాంద్‌పాషాపై ఒత్తిడి తెస్తే, ఆ చెల్లింపులతో తనకు సంబంధంలేదని తమ్ముడు షఫీ తీరుస్తాడని చాంద్‌పాషా చెప్పడంతో వారు షఫీ మీద ఒత్తిడి పెంచారు. సమస్య జటిలం కావడంతో రైతులు, వ్యాపారస్తులు పశువులను షఫీకి అమ్మడం నిలిపివేశారు. చాంద్‌ పాషాను ఈ విషయమై పలుమార్లు సంప్రదించి, డబ్బులు చెల్లించాలని షఫీ కోరాడు. డబ్బులు ఇచ్చేది లేదని ఆయన స్పష్టం చేయడంతో షఫీ కక్ష పెంచుకున్నాడు. అన్నను, ఆయన కుటుంబాన్ని హత్య చేసేందుకు 15 రోజుల క్రితమే ప్రణాళిక రచించాడు. ఇందుకోసం తన వద్ద పనిచేసే పాషా, సాజిద్‌, విజేందర్‌, అక్బర్‌, వెంకన్నల సహకారం తీసుకున్నాడు. 


యూట్యూబ్‌ వీడియోలు చూసి.. 

ఈ హత్యలకు కుట్ర పన్నే క్రమంలో.. దృఢంగా ఉండే ఇంటి తలుపులను ఎలా బద్దలు కొట్టాలి? లోపలికి ఎలా ప్రవేశించాలి ? వంటి అంశాలపై షఫీ యూట్యూబ్‌లో వీడియోలు చూశాడు. తలుపులు వేగంగా బద్దలు కొట్టాలంటే చెట్లను కోసే బ్యాటరీ రంపం మేలని ఓ  వీడియో ద్వారా తెలుసుకున్నాడు. వరంగల్‌ చౌరస్తాలోని ఓ షాపులో దాన్ని కొన్నాడు. హైదరాబాద్‌ నుంచి వేటకొడవళ్లు తెప్పించాడు. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఆరుగురు కలిసి ఓ ఆటో, బైక్‌పై చాంద్‌పాషా ఇంటికి వెళ్లారు. రంపంతో తలుపులు కోసి.. కరెంట్‌ కట్‌ చేసి.. ఇంట్లోని వారి కళ్లలో కారం చల్లి దాడికి తెగబడ్డారు. అనంతరం వచ్చిన వాహనాల్లోనే పైడిపల్లి కాలువ వద్దకు వెళ్లి.. రక్తపు మరకలున్న దుస్తులను తగులబెట్టారు. తామిక తప్పించుకోలేమని భావించి తమకు తెలిసిన వారితో చెప్పించి పోలీసులకు చిక్కారు. అయితే ఈ హత్యల పథకానికి ముందు తానే ఆత్మహత్య చేసుకోవాలని ఓ దశలో అనుకున్నానని షఫీ చెప్పినట్లు సమాచారం. నిందితులతో పోలీసులు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు.  

Updated Date - 2021-09-03T08:21:37+05:30 IST