ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ భూ ఆక్రమణ!
ABN , First Publish Date - 2021-06-14T09:41:57+05:30 IST
ఓటుకు నోటు కేసులో.. రేవంత్‌రెడ్డిని ఏసీబీకి పట్టించి, వార్తల్లోకెక్కిన నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్‌సన్ భూకబ్జా బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
- పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
- ఫిర్యాదు అందలేదంటున్న పోలీసులు
పూడూరు/పరిగి, జూన్ 13: ఓటుకు నోటు కేసులో.. రేవంత్‌రెడ్డిని ఏసీబీకి పట్టించి, వార్తల్లోకెక్కిన నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్‌సన్ భూకబ్జా బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లా పూడూరులోని సర్వే నంబర్-202లో తిప్పని నర్సింహులుకు 3.10 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి సంబంధించి 2015లో స్టీఫెన్‌సన్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ క్రమంలో 1.25 ఎకరాలను ఆయన కుమార్తె జెస్సికా పేరుతో రిజిస్టర్ చేయించారు. మిగతా భూమి నర్సింహులు పేరిటే ఉంది. ఆ భూమినీ స్టీఫెన్‌సన్‌కు విక్రయించాలంటూ కొంతకాలంగా నర్సింహులుపై ఒత్తిడి పెరిగింది. దానికి ఆయన అంగీకరించలేదు. ఈలోగా.. ఉపాధి కోసం నర్సింహులు హైదరాబాద్ వెళ్లారు. ఈ నెల 8న స్టీఫెన్‌సన్ మనుషులు తన భూమిని చదును చేసిన్నట్లు తెలుసుకున్న నర్సింహులు.. ఊరికి తిరిగి వచ్చారు. ఈ నెల 9న చన్‌గోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భూమిని ఆక్రమించిన స్టీఫెన్‌సన్‌పైన.. అతని అనుచరులపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే.. పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, తన ఫిర్యాదును బుట్టదాఖలు చేశారంటూ బాధితుడు ఆదివారం విలేకరుల ముందు వాపోయారు. స్టీఫెన్‌సన్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయంపై ఎస్సై శ్రీశైలాన్ని విలేకరులు ప్రశ్నించగా.. భూతగాదా విషయం తమ దృష్టికి వచ్చిందని, ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని వివరించారు.
