కేటీఆర్‌ కనుసన్నల్లో బియ్యం స్మగ్లింగ్‌

ABN , First Publish Date - 2021-12-07T07:58:38+05:30 IST

సీఎం కేసీఆర్‌ తనయుడి కనుసన్నల్లో బియ్యం స్మగ్లింగ్‌ జరుగుతోందని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆరోపించారు. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు, బియ్యం స్మగ్లింగ్‌పై దర్యాప్తు జరిపించాలని

కేటీఆర్‌ కనుసన్నల్లో బియ్యం స్మగ్లింగ్‌

టీఆర్‌ఎస్‌ ఎంపీలది అనవసర గందరగోళం: ఎంపీ అర్వింద్‌

 

న్యూఢిల్లీ, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌ తనయుడి కనుసన్నల్లో బియ్యం స్మగ్లింగ్‌ జరుగుతోందని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆరోపించారు. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు, బియ్యం స్మగ్లింగ్‌పై దర్యాప్తు జరిపించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన లోక్‌సభ జీరో అవర్‌లో మాట్లాడారు. ఉప్పుడు బియ్యం విషయంలో స్వయం సమృద్ధి సాధించిన నేపథ్యంలో ఉప్పుడు బియ్యం ఉత్పత్తిని తగ్గించాలని కొంత కాలంగా ఎఫ్‌సీఐ రాష్ట్ర ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపిందని పేర్కొన్నారు. ‘‘రాష్ట్రంలో ఇతర పంటలను నిర్లక్ష్యం చేయడం వెనుక పెద్ద స్మగ్లింగ్‌ ఉంది. ధాన్యం కొనుగోలు చేసి మిల్లింగ్‌ కోసం రైస్‌ మిల్లర్లకు ప్రభుత్వం సరఫరా చేస్తుంది. పాతకాలపు, ఆధునిక రైస్‌ మిల్లులకు క్వింటా ధాన్యాన్ని రూ.1,600 చొప్పున విక్రయిస్తున్నాయి. ఆధునిక రైస్‌ మిల్లులు ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి కిలో బియ్యాన్ని రూ.40 చొప్పున దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్నాయి. పాత రైస్‌ మిల్లు లు రీసైకిల్‌ చేసిన బియ్యాన్ని పొరుగు రాష్ట్రాల నుంచి కిలో రూ.18 చొప్పున కొనుగోలు చేసి, 100 కిలోల ధాన్యానికి 67 కిలోల రీసైకిల్‌ బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అందిస్తున్నాయి. కిలోకు రూ.18 చొప్పున 67 కిలోలకు ఈ మిల్ల ర్లు రూ.1,206 వెచ్చించి క్వింటా ధాన్యంపై రూ.400 ఆర్జిస్తున్నారు.


ఈ వేల కోట్ల కుంభకోణం కేసీఆర్‌ కుమారుడి కనుసన్నల్లో జరుగుతోంది’’ అని వివరించారు. 60 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు కేంద్రంతో ఒప్పందం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సేకరించకపోవడం వల్ల రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన సిద్దిపేటలో 416 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. తెలంగాణ నుంచి బియ్యాన్ని తీసుకోబోమని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంటులో గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి ప్రస్తావనను స్పీకర్‌ ఓం బిర్లా రికార్డుల నుంచి తొలగించారు.  

Updated Date - 2021-12-07T07:58:38+05:30 IST