ఉద్యమ నినాదాలు ఒక్కొక్కటిగా అమలు

ABN , First Publish Date - 2021-06-02T10:06:38+05:30 IST

ఉద్యమం నాటి నినాదాలను తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నదని సీఎం కేసీఆర్‌ అన్నారు. అనేక పోరాటాలు, త్యాగాలు, బలిదానాలతో.. పార్లమెంటరీ

ఉద్యమ నినాదాలు ఒక్కొక్కటిగా అమలు

గర్వించదగ్గ రీతిలో తెలంగాణను నిలబెట్టుకున్నాం: కేసీఆర్‌

ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు


హైదరాబాద్‌, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): ఉద్యమం నాటి నినాదాలను తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నదని సీఎం కేసీఆర్‌ అన్నారు. అనేక పోరాటాలు, త్యాగాలు, బలిదానాలతో.. పార్లమెంటరీ ప్రజాస్వామిక పద్ధతిలో పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లోనూ దేశం గర్వించదగ్గ రీతిలో నిలబెట్టుకున్నామన్నారు. ఏడేళ్ల అనతి కాలంలోనే ధృఢమైన పునాదులతో సుస్థిరతను చేకూర్చుకున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర 8వ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.


తాగు, సాగునీరు, విద్యుత్తు, విద్య, వైద్యం, రోడ్లు, తదితర మౌలిక వసతులను కల్పించుకుంటూ వస్తున్నామని సీఎం పేర్కొన్నారు. దేశంలో 29 రాష్ట్రంగా అవతరించిన తెలంగాణను.. అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచే స్థాయిలో నిలబెట్టుకున్నందుకు గర్వంగా ఉందన్నారు. అభివృద్ధి ద్వారా అమరుల త్యాగాలకు ఘన నివాళిని అర్పించాలనే స్ఫూర్తితో ముందుకు పోతున్నామన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి వ్యవసాయాన్ని స్థిరీకరించి, గ్రామీణ వ్యవస్థను ఆర్థికంగా పరిపుష్ఠం చేయడంలో ప్రభుత్వం సఫలీకృతమైందన్నారు. ఈవిజయంలో ప్రజల సహకారం గొప్పదని, అందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకొంటున్నానన్నారు.కరోనా ఉపద్రవం వల్ల రాష్ట్ర ఖజానాకు ఇబ్బంది కలిగినా ప్రజల సహకారంతో ముందుకుపోతున్నామని తెలిపారు.  

Updated Date - 2021-06-02T10:06:38+05:30 IST