బీజేపీకి మోత్కుపల్లి గుడ్‌బై

ABN , First Publish Date - 2021-07-24T07:38:28+05:30 IST

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బీజేపీకి రాజీనామా చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు రాజీనామా లేఖను పంపించారు. బేగంపేటలోని నివాసంలో శుక్రవారం మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. దళితులు, ఆలయ భూములను ఆక్రమించుకున్న ఈటల రాజేందర్‌ను పార్టీలో ఎలా చే

బీజేపీకి మోత్కుపల్లి గుడ్‌బై

బండి సంజయ్‌కి రాజీనామా లేఖ

తన అనుభవాన్ని వాడుకోవట్లేదని అసహనం

ఈటల రాజేందర్‌.. ఓ అవినీతి తిమింగలం

పార్టీలో ఆయన్ను ఎలా చేర్చుకుంటారని ప్రశ్న

అంబేడ్కర్‌ వారసుడు కేసీఆర్‌ అని ప్రశంస

త్వరలో గులాబీ గూటికి చేరేందుకు సన్నాహాలు

హైదరాబాద్‌/బేగంపేట, జూలై 23 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బీజేపీకి రాజీనామా చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు రాజీనామా లేఖను పంపించారు. బేగంపేటలోని  నివాసంలో శుక్రవారం మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. దళితులు, ఆలయ భూములను ఆక్రమించుకున్న ఈటల రాజేందర్‌ను పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. ఈటల ఏమైనా పేదోడా? ఆయనపై సానుభూతి ఎందుకు చూపాలి? అని ప్రశ్నించారు. హుజురాబాద్‌ ప్రజలు ఓడించడం కాదు.. బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈటల అవినీతిపరుడు.. తిమింగళం అని ఆరోపించారు. ఈటలకు ఓటు వేయాలని పిలుపునివ్వడం రూ.10 లక్షలను వద్దని చెప్పడమేనని అన్నారు.


 దళిత బంధు పథకాన్ని ప్రకటించిన కేసీఆర్‌.. అంబేడ్కర్‌ వారసుడని అభివర్ణించారు. కేసీఆర్‌లో మార్పు వచ్చిందని, ఆయన మానవతావాది అని, మొనగాడని ఆకాశానికెత్తారు. సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న కేసీఆర్‌ చరిత్రలో నిలిచిపోతారని ప్రశంసించారు. కేసీఆర్‌ను దళితుడిగానే గుర్తించాలని పిలుపునిచ్చారు. దళిత బంధు రాష్ట్రమంతా అమలు చేస్తారన్న విశ్వాసంతో కేసీఆర్‌కు మద్దతు ఇస్తూ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. దళితుడిని సీఎం చేస్తామని, మూడెకరాల భూమి పంపిణీ చేస్తామన్న హామీలను కేసీఆర్‌ అమలు చేయలేదు గదా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. అది ప్రజలు చూసుకుంటారని వ్యాఖ్యానించారు. అన్ని పార్టీల్లోని దళితులు కేసీఆర్‌ను ఉత్సాహపరచాలని సూచించారు. టీఆర్‌ఎ్‌సలో చేరబోతున్నారా? అన్న ప్రశ్నకు.. దాన్ని కాలమే నిర్ణయిస్తుందని జవాబిచ్చారు. బీజేపీలోకి మాత్రం ఎవరూ వెళ్లరని, అక్కడకు పోయినోళ్లు కూడా ఉండరని చెప్పారు. గతనెల 27న సీఎం కేసీఆర్‌, దళితుల సాధికారతపై ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశాన్ని బీజేపీ బహిష్కరించగా, మోత్కుపల్లి హాజరయ్యారు. పార్టీలో ఈటల చేరికను తప్పుపట్టారు. అప్పటినుంచి పార్టీ నాయకత్వం ఆయనకు ప్రాధాన్యం తగ్గించింది. మోత్కుపల్లి కూడా రాష్ట్ర పార్టీ కార్యాలయానికి దూరంగా ఉన్నారు. తాజాగా టీఆర్‌ఎ్‌సలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలిసింది.


అందుకే రాజీనామా..

‘‘నా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని అయినా  సముచిత స్థానం కల్పించలేకపోయినందుకు బాధపడుతున్నా. కనీసం కేంద్ర కమిటీలో ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడిగా కూడా అవకాశం ఇవ్వలేదు. అభిప్రాయం తెలియజేయాలని ఆహ్వానిస్తేనే సీఎం కేసీఆర్‌ నిర్వహించిన దళిత సాధికారత సమావేశానికి మీకు చెప్పి వెళ్లా. దానిపై పార్టీలో భిన్నాభిప్రాయాలు బహిర్గతం కావడం నన్ను బాధించింది. దళితుల భూములు ఆక్రమించుకున్న ఈటలను పార్టీలో చేర్చుకోవడం నన్ను ఇబ్బందికి గురిచేసింది.  రాజకీయాల్లో విలువల కోసమే పని చేసే నన్ను దూరం పెట్టడం బాధ కలిగించింది. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నా’’ అని రాజీనామా లేఖలో మోత్కుపల్లి పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-24T07:38:28+05:30 IST