నైతిక విజయం మాదే : జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2021-12-15T08:15:30+05:30 IST

మెదక్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతికవిజయం కాంగ్రెస్‌ పార్టీదేనని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.

నైతిక విజయం మాదే : జగ్గారెడ్డి

హైదరాబాద్‌, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): మెదక్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతికవిజయం కాంగ్రెస్‌ పార్టీదేనని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు,  ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో మంగళవారం పార్టీ అభ్యర్థి, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని నిలబెట్టడం వల్లే టీఆర్‌ఎస్‌ స్థానిక ప్రజాప్రతినిధులకు విలువ పెరిగిందన్నారు. తమ పార్టీ అభ్యర్థి నిర్మలా జగ్గారెడ్డి  ఇచ్చిన పోటీని తట్టుకోలేకే టీఆర్‌ఎస్‌ పార్టీ క్యాంపులు నిర్వహించిందన్నారు. తాము దమ్మున్నోళ్లమని,  క్యాంపులు నిర్వహించకపోయినా తమ ఓట్లు తమ అభ్యర్థికే వచ్చాయని చెప్పారు.   ఈ ఎన్నికల్లో జిల్లా కాంగ్రెస్‌ నాయకత్వం బాగా పనిచేసిందన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావుల జిల్లా అయిన మెదక్‌లో ఎన్నిక ఏకగ్రీవం కాకుండా చేయడమే తమ మొదటి విజయమని పేర్కొన్నారు.  జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న 231 ఓట్లకు అదనంగా ఏడు ఓట్లు వచ్చాయని, తమ ఓటు బ్యాంకును తాము కాపాడుకున్నామని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ అంటే నెలకొన్న భయం వల్ల మంత్రి హరీశ్‌రావుకు క్యాంపులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.  


తమ స్థానిక ప్రజా ప్రతినిధులు మాత్రం ఏ క్యాంపులకూ వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండి, ఎన్నికల రోజు తమ అభ్యర్థికే ఓటు వేశారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తాము ప్రలోభాలకు పాల్పడి ఉంటే 400 ఓట్లకు పైగా వచ్చేవని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న 230 ఓట్లలో ఒక్క ఓటు తగ్గినా తాను టీపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించానని గుర్తు చేశారు. తాను మాటమీద నిలబడే మనిషినని,  తన మాటకు విలువ ఇచ్చి ఓట్లేసిన తమ పార్టీ ఓటర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. టీఆర్‌ఎస్‌ స్థానిక ప్రజా ప్రతినిధులు తనను కలిసినప్పుడు వారికి నిధులు, కూర్చునేందుకు కుర్చీలూలేవని ఆవేదన వెలిబుచ్చారన్నారు. పోరాటం చేసేందుకే తాను అభ్యర్థిని పెట్టానని, కానీ వారు ఓట్లు ఎందుకు వేయలేదో తెలియదన్నారు.  తాము వ్యూహాత్మకంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినట్లు చెప్పారు. ఇక ఉమ్మడి మెదక్‌ జిల్లాలో తమ గేమ్‌ను స్టార్ట్‌ చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో 8 సీట్లు ఎలా గెలుచుకోవాలన్న వ్యూహరచనలో ఉంటామన్నారు.  గజ్వేలు, సిద్దిపేటలనూ కైవసం చేసుకుంటామన్న ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2021-12-15T08:15:30+05:30 IST