పేదవాడి బండి.. పట్టాలెక్కదేమండి..!
ABN , First Publish Date - 2021-05-20T15:00:36+05:30 IST
లింగంపల్లి బీహెచ్‌ఈఎల్ ఎంఐజీ కాలనీకి చెం దిన రాజు జీపీఓ ఉద్యోగి. రోజూ ఎంఎంటీఎ్‌సలో విధులకు వెళ్లి, వచ్చేవాడు

ఎంఎంటీఎస్ రద్దుతో ప్రయాణ భారం
క్యాబ్‌లు, షేర్ ఆటోలతో జేబులు గుల్ల
సర్వీసులు ప్రారంభించాలంటున్న నగరవాసులు
హైదరాబాద్/అల్లాపూర్: లింగంపల్లి బీహెచ్‌ఈఎల్ ఎంఐజీ కాలనీకి చెం దిన రాజు జీపీఓ ఉద్యోగి. రోజూ ఎంఎంటీఎ్‌సలో విధులకు వెళ్లి, వచ్చేవాడు. ఈ రైళ్లు నడవకపోవడంతో టూవీలర్‌పై ప్రయాణం చేస్తున్నాడు. దీంతో పెట్రోల్ ఖర్చు తడిసి మోపెడవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
గతేడాది మార్చిలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో రద్దయిన ఎంఎంటీఎస్ రైళ్లు ఇప్పటి వరకు మళ్లీ పట్టాలు ఎక్కలేదు. సాధారణ రైళ్లతో పాటు మెట్రో రైళ్లు, విమానాలు, బస్సులు వంటి అన్ని ప్రయాణ సాధనాలు నడుస్తున్నా, పేదవాడి బండి అయిన ఎంఎంటీఎస్ నిలిచిపోవడంతో సగటు నగర జీవిపై ఆర్థిక భారం పడుతోంది.
అనుకూల ప్రయాణం
దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల నుంచి సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వేస్టేషన్లకు చేరుకుని అక్కడినుంచి సిటీలోని పలు ప్రాంతాలకు వెళ్లేందుకు ఎంఎంటీఎస్ ఎంతో అనుకూలమైంది. వాస్తవానికి ఇలాంటి లాక్‌డౌన్ సమయాల్లో దూర ప్రాంతాల నుంచి వచ్చే, వెళ్లే ప్రయాణికులకు ఎంఎంటీఎస్ రైళ్లు ఊరటనిస్తాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఎంఎంటీఎస్ సేవలు అందుబాటులో లేకపోవడం, బస్సులు నడవక పోవడంతో క్యాబ్‌లు, ట్యాక్సీలను ఆశ్రయిస్తూ, వారు అడిగినంత చెల్లించాల్సి వస్తోంది.
తక్కువ సమయం.. కారు చౌక..
పెద్దగా ప్రజా రవాణా సౌకర్యాలు అంతగా లేని అల్లాపూర్ లాంటి ప్రాంతాలకు ఎంఎంటీఎస్ రైళ్లు ఎంతో ఉపయోగకరం. కేవలం 15 నుంచి 20 నిమిషాల్లో హైటెక్‌సిటీ, బోరబండల నుంచి సికింద్రాబాద్, హైదరాబాద్‌లకు చేరుకోవటం ఏ ఇతర మార్గంలో వీలు కాదు. అందునా కారు చౌకగా, కేవలం రూ.5 చెల్లించి దర్జాగా ప్రయాణించవచ్చు.
భారంగా మారిన ప్రయాణం..
అల్లాపూర్, హఫీజ్‌పేటలాంటి శివారు ప్రాంతాల్లో ప్రజా రవాణా వ్యవస్థ సరిగ్గా లేదు. ఎంఎంటీఎస్ రైళ్లు కూడా లేకపోవడంతో సొంతవాహనాలు, క్యాబ్‌లు, షేరింగ్ ఆటోలలో ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. లాక్‌డౌన్ నేపథ్యంలో షేర్ ఆటోల వారు కిలో మీటర్ నుంచి రెండు కిలోమీటర్లకే రూ. 20 వరకు వసూలు చేస్తున్నారు. ఎంఎంటీఎస్ నడిచిన రోజుల్లో అల్లాపూర్ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లి, రావాలంటే రూ.10తో సరిపోయేది. ఇప్పుడు బోరబండ బస్టాండ్‌కు రూ. 20, అక్కడి నుంచి డైరెక్ట్ బస్ దొరికితే రూ. 15 నుంచి రూ. 20 చెల్లించాల్సి వస్తోంది. రానుపోనూ మొత్తంగా రూ. 80 వరకు ఖర్చు అవుతోంది.
మెట్రో తరహాలో నడపాలి...
అమీర్‌పేట్‌లోని స్కూల్‌లో టీచర్‌గా ఉద్యోగం. బోరబండ నుంచి నేచర్‌క్యూర్ వరకు ఎంఎంటీఎస్ సేవలను వినియోగించుకునేదాన్ని. ఏడాదికి పైగా ఈ సర్వీసులు నిలిపివేయటంతో ప్రయాణం సజావుగా సాగక ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. ఎంఎంటీఎస్ తప్ప వేరే ప్రయాణ సాధనం లేకపోవటంతో ఆటోలని, క్యాబ్‌లలో వెళ్లాల్సి వస్తోంది. వచ్చే కొద్దిపాటి జీతంలో ఎక్కువ ప్రయాణానికే ఖర్చు చేయాల్సిన పరిస్థితి. లాక్‌డౌన్ కష్టాలతోపాటు శివారు ప్రాంతాల్లో నివసించే మధ్యతరగతి వారికి ఎంఎంటీఎస్ నిలిపివేయటం గొడ్డలిపెట్టుగా మారింది. మెట్రో తరహాలో ఎంఎంటీఎస్ కూడా నడపాలి.
స్వర్ణలక్ష్మి, ఉపాధ్యాయిని, తులసీనగర్
ఎంఎంటీఎస్ మొదలైతే డ్యూటీలో చేరుతా..
ఫతేనగర్ పారిశ్రామికవాడలోని ఓ పరిశ్రమలో ఉద్యోగిని. బోరబండ ఎంఎంటీఎస్ స్టేషన్ ఇంటికి దగ్గరగా ఉండటంతో డ్యూటీకి ట్రైన్‌లో వెళ్లే దాన్ని. ఏడాదిగా అవి రద్దవటంతో ఎంతో ఇబ్బంది పడ్డాను. కొన్నాళ్లు మా అబ్బాయి సహాయంతో టూవీలర్‌పై వెళ్లి వచ్చే దాన్ని. పిక్ అండ్ డ్రా్‌పతో వాడికి రోజు రెండు చక్కర్లు అయ్యేది. బస్సు సౌకర్యం, వేరే ప్రయాణ సాధనం లేకపోవటంతో డ్యూటీ మానేయాల్సి వచ్చింది. ఇద్దరి పిల్లలకు నేను సింగిల్ పేరెంట్‌ను. ఆర్థిక అవసరాలు, బరువు-బాధ్యతలు కూడా ఎక్కువే. మళ్లీ ఎంఎంటీఎ్‌సలు మొదలైతే డ్యూటీలో చేరతాను.
భారతి ఆకుల, చిరుద్యోగి, అల్లాపూర్
ఎంఎంటీఎస్ మళ్లీ నడపాలి
దశాబ్దకాలంగా ఎంఎంటీఎ్‌స రైలు ద్వారా ఆఫీ్‌సకు వెళ్లేవాడిని. ఇల్లు చందానగర్‌లో ఉండటంతో ఆబిడ్స్‌కు వెళ్లేందుకు దానికి మించిన ప్రయాణ సాధనమేదీ లేదు. ఏడాదిగా ఎంఎంటీఎస్ నడవకపోవటంతో బండి మీదే వెళుతున్నాను. పెట్రోల్ ధర పెరగడం, 30 కిలోమీటర్లు వాహనంపై వెళ్లడం వల్ల కాలుష్యం బారిన పడుతున్నాను. ఎంఎంటీఎస్ సర్వీసులు మళ్లీ నడపాలి.
నగేష్, పోస్టల్ ఉద్యోగి, చందానగర్