‘పోచంపల్లి’ ఏకగ్రీవం

ABN , First Publish Date - 2021-11-26T05:56:08+05:30 IST

‘పోచంపల్లి’ ఏకగ్రీవం

‘పోచంపల్లి’ ఏకగ్రీవం
పోచంపల్లి శ్రీనివా్‌సరెడ్డిని అభినందిస్తున్న మంత్రి దయాకర్‌రావు, ఇతర నేతలు

వరంగల్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవి టీఆర్‌ఎస్‌ కైవసం

పోటీ నుంచి తప్పుకున్న స్వతంత్ర అభ్యర్థులు

చక్రం తిప్పిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

నేడు అధికారికంగా ప్రకటించనున్న ఎన్నికల అధికారి

పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి అభినందనల వెల్లువ

శాసనమండలిలో రెండోసారి అడుగు


వరంగల్‌,  నవంబరు 25 (ఆంధ్రజ్యోతి) : వరంగల్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పర్వం ఊహించినట్టే జరిగింది. నామినేషన్లు వేసిన స్వతంత్ర అభ్యర్థులు బరి నుంచి తప్పుకోవడంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివా్‌సరెడ్డి ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుంచి బరిలో నిల్చోవడానికి స్వతంత్రులు క్యూ కట్టారు.  అధికార పార్టీ అభ్యర్థిగా శ్రీనివా్‌సరెడ్డి పేరును టీఆర్‌ఎస్‌ ప్రకటించిన తర్వాత 13 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్‌ వేశారు.  స్ర్కుటినీ సమయంలో 10 మంది నామినేషన్లను వివిధ ఫిర్యాదుల మేరకు రిటర్నింగ్‌ అధికారులు బుధవారం తిరస్కరించారు. మిగతా ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులైన పోతురాజు రాజు, బానోతు రూప్‌సింగ్‌, మంత్రి శ్రీశైలం.. పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా గురువారం రిటర్నింగ్‌ అధికారికి లేఖలు ఇచ్చారు. దీంతో బరిలో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మాత్రమే మిగలడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అయింది.  


తిరస్కరణతో వేగం

నామినేషన్ల స్ర్కుటినీలో నామినేషన్లు దాఖలు చేసిన 10 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురి కావడంతో టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవంపై గురిపెట్టింది. కాంగ్రెస్‌ మద్దతు పొందే అవకాశం ఉన్న స్వతంత్ర అభ్యర్థి వేం వాసుదేవరెడ్డికి చెందిన నామినేషన్‌ పత్రంలో లొసుగులపై తీగ లాగారు. నామినేషన్‌ పత్రంలో వాసుదేవరెడ్డిని బలపరుస్తూ ముగ్గురు ఓటర్లు చేసిన సంతకాలు బోగస్‌ అని ఫిర్యాదు వచ్చింది. ఆ సంతకాలు తమవి కావని సదరు ముగ్గురు ఓటర్లు రిటర్నింగ్‌ అధికారికి తెలిపారు. దీంతో వాసుదేవరెడ్డి నామినేషన్‌ పత్రం తిరస్కరణకు గురైంది. మరో 9 మంది స్వతంత్ర అభ్యర్థులను బలపరిచిన వారంతా తిరగబడడంతో వారి నామినేషన్లు కూడా తిరస్కరణకు  గురికాక తప్పలేదు. మొత్తం 14 మంది అభ్యర్థులు 21 సెట్ల నామినేషన్లను దాఖలు చేయగా, వారిలో నలుగురికి చెందిన 8 నామినేషన్‌ పత్రాలను ఆమోదించగా, మిగిలిన 10 మందికి చెందిన నామినేషన్లను తిరస్కరించారు. 


బుజ్జగింపుల పర్వం

వరంగల్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో అధికార పార్టీ అభ్యర్థితో పాటు మరో ముగ్గురు స్వతంత్రులు ఉండడంతో బుధవారం రాత్రి నుంచే వారితో సంప్రదింపులు జరిపారు. ఒక అభ్యర్థికి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీటీసీలు, కార్పొరేటర్లు మద్దతు ఇచ్చారు. అయినా గురువారం ఉదయానికి సీన్‌ మొత్తం మారిపోయింది. కాంగ్రెస్‌ నుంచి ఓ కౌన్సిలర్‌  మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకొని కాంగ్రె్‌సకు ‘చేయి’ ఇచ్చాడు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు గురువారం కావడంతో  మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వేగంగా పావులు కదిపారు. నామినేషన్లు వేసిన అభ్యర్థులతోపాటు వారిని బలపరిచిన వారికి బంపర్‌ ఆఫర్‌ ఇచ్చి తమ దారికి తెచ్చుకున్నట్టు ప్రచారం సాగుతోంది.  


నిరాశలో ఓటర్లు

ఎమ్మెల్సీ ఏకగ్రీవం కావడంతో  స్థానిక సంస్థల ఓటర్లకు తీవ్ర నిరాశే మిగిలింది. వరంగల్‌ స్థానిక సంస్థల నియోజకవర్గంలో 1,029 మంది ఓటర్లున్నారు. వారిలో అత్యధిక ఓటర్లు 800 వరకు టీఆర్‌ఎ్‌సకు  చెందిన వారే ఉన్నారు. జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు ఓటర్లుగా ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం బెంగళూరు వంటి ప్రాంతంలో క్యాంపు ఉంటుందని గురువారం ఉదయం అందరూ బ్యాగులు సర్దుకున్నారు. గురువారం మధ్యాహ్నానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కార్యాలయం నుంచి వరంగల్‌ స్థానం ఏకగ్రీవమైందంటూ మెసేజ్‌లు రావడంతో నిరాశ చెందారు. ఓటు హక్కును వినియోగించుకుంటే ఎంతో కొంత గిట్టుబాటు కావడంతో పాటు క్యాంపులో రిలాక్స్‌ అవుదామనుకున్న వారికి ఏకగ్రీవం సమాచారం రుచించనట్టుగా తెలిసింది. నామినేషన్లు వేసిన వారు.. వారిని బలపరిచిన ప్రతిపక్షాలకు చెందిన ఓటర్లకు భలేగా గిట్టుబాటు అయిందని, తమకు నిరాశే మిగిలిందంటూ టీఆర్‌ఎస్‌ ఓటర్లు వాపోతున్నారు.


నేడు అఽధికారిక ప్రకటన

వరంగల్‌ స్థానిక సంస్థల ఎన్నికల బరి నుంచి ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్‌ ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించడంతో ఏకగ్రీవం అనివార్యమైంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శ్రీనివా్‌సరెడ్డి ఏకగ్రీవంగా గెలుపొందినట్టు అధికారికంగా శుక్రవారం ప్రకటించే అవకాశముంది. గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. గురువారం ఉదయమే ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు తప్పుకుంటున్నట్టు రిటర్నింగ్‌ అధికారి, వరంగల్‌ కలెక్టర్‌ బి.గోపికి లేఖలు అందించారు. గురువారం సాయంత్రం రిటర్నింగ్‌ అధికారి బి.గోపి ముగ్గురు అభ్యర్థులు ఉపసంహరించుకున్నట్టుగా తుది జాబితాను ప్రకటించారు. 


అభినందించిన మంత్రి ఎర్రబెల్లి

హనుమకొండ టౌన్‌, నవంబర్‌ 25: వరంగల్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన  పోచంపల్లి శ్రీనివా్‌సరెడ్డిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అభినందించారు. గురువారం శ్రీనివా్‌సరెడ్డి హనుమకొండలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు పలువురు నేతలను మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా మంత్రితో పాటు ఎమ్మెల్యే అరూరి రమేశ్‌, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ కె.వాసుదేవరెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవిందర్‌రావు, నేతలు మర్రి యాదవరెడ్డి, భీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, సంపత్‌, వంశీధర్‌రెడ్డి తదితరులు పోచంపల్లిని అభినందించారు. 

Updated Date - 2021-11-26T05:56:08+05:30 IST