ఆరుగురు ఎమ్మెల్సీల ఏకగ్రీవం

ABN , First Publish Date - 2021-11-23T09:28:47+05:30 IST

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, బండా ప్రకాష్‌, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, వెంకట్రామారెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఆరుగురు ఎమ్మెల్సీల ఏకగ్రీవం

  • ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో శాసనమండలికి..
  • కడియం, సుఖేందర్‌రెడ్డి, బండా ప్రకాశ్‌,
  • రవీందర్‌రావు, వెంకట్రామారెడ్డి, కౌశిక్‌రెడ్డి

హైదరాబాద్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, బండా ప్రకాష్‌, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, వెంకట్రామారెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరికి రిటర్నింగ్‌ అధికారి మంగళవారం గెలుపు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ స్థానాలకు నెల 26న పోలింగ్‌ నిర్వహించాల్సి ఉంది. అయితే శాసనసభలో టీఆర్‌ఎస్‌ మినహా ఏ పార్టీకీ ఈ కోటాలో ఎమ్మెల్సీని గెలిపించుకునే సంఖ్యాబలం లేకపోవడంతో ప్రతిపక్షాలేవీ అభ్యర్థులను నిలబెట్టలేదు. స్వతంత్ర అభ్యర్థులుగా ఓ ఇద్దరు నామినేషన్లు దాఖలు చేసినా.. ఆ పత్రాలు నిబంధనల ప్రకారం లేకపోవడంతో తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం సాయంత్రం 3 గంటలకు గడువు ముగియడం, టీఆర్‌ఎస్‌ తరఫున దాఖలైన ఆరుగురి నామినేషన్లే ఉండడంతో వారి ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఇక వీరితోపాటు గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికైన మధుసూదనాచారికి సంబంధించి ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయగానే.. ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది.


సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు..

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినట్లుగా ధ్రువీకరణ పత్రాలు అందుకున్న ఆరుగురు అభ్యర్థులు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి వారు మీడియా పాయింట్‌లో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో తాము చిత్తశుద్ధితో పనిచేస్తామని కడియం శ్రీహరి అన్నారు. ఓర్వలేకే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. ధాన్యం సేకరణ కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిదని, కానీ, కేంద్రం కొనడంలేదని విమర్శించారు. 

Updated Date - 2021-11-23T09:28:47+05:30 IST