మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి టెండర్లు: మంత్రి హరీష్‌

ABN , First Publish Date - 2021-12-07T05:33:46+05:30 IST

మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి టెండర్లు: మంత్రి హరీష్‌

మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి టెండర్లు: మంత్రి హరీష్‌
అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న మంత్రి హరీ్‌షరావు

వరంగల్‌ సిటీ, డిసెంబరు 6: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వరంగల్‌ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి ఈ నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీ్‌షరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లో మెడికల్‌ కాలేజీల నిర్మాణాలపై సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా కాలేజీలకు సంబంధించిన డిజైనింగ్‌ ఏజెన్సీలు, అధికారులతో సమీక్ష జరిపారు. కాలేజీల నమూనాలను సీఎస్‌, హెల్త్‌ సెక్రెటరీ, సంబంధిత అధికారులతో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ.1100 కోట్లతో వరంగల్‌ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి పాలనాపరమైన అన్ని అనుమతులను ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసిందన్నారు. జనవరి మొదటి వారంలో నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లాకో మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొందన్నారు. వరంగల్‌ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి పూర్తయితే వరంగల్‌ రాష్ట్రానికే మెడికల్‌ హబ్‌గా మారుతుందన్నారు. ఇదే సమయంలో 8 మెడికల్‌ కాలేజీలు త్వరగా పూర్తి చేస్తే మారుమూల ప్రాంత ప్రజలకు సైతం నాణ్యమైన వైద్య సేవలు అందుతాయన్నారు. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా విస్తరించుకునే విధంగా నిర్మాణాలు ఉండాలని సూచించారు. నిర్ధిష్టమైన డిజైన్లు  నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ నిబంధనల ప్రకారం రూపొందించాలన్నారు. ఆధునిక పద్ధతులతో, మెరుగైన వైద్య సదుపాయం ఉండేలా డిజైన్లు రూపొందించాలన్నారు. వైద్యాధికారులు, ఇంజనీరింగ్‌ విభాగం ఎన్‌ఎంసీ నిబంధనల మేరకు మంగళవారం మరోసారి సమీక్షించుకొని పూర్తి స్థాయి నమూనాలను, అంచనాలను రూపొందించాలని సూచించినట్టు పేర్కొన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలను సాకారం చేసేందుకు పనులు వేగిరం చేయాలన్నారు. ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. పల్లె దవఖానల గ్రామీణులకు ఎంబీబీఎస్‌ వైద్యుల సేవలు, మెడికల్‌ కాలేజీల ద్వారా సమీపంలోనే సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయన్నారు.   సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమే్‌షరెడ్డి, డీహెచ్‌. శ్రీనివాసరావు, కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్‌, టీఎంఎ్‌సఐడీసీ ఎండి చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్‌ అండ్‌ బీ ఈన్‌సీ గణపతిరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-07T05:33:46+05:30 IST