గొల్ల,కుర్మలు అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి వుంది:తలసాని

ABN , First Publish Date - 2021-12-30T22:21:12+05:30 IST

గొల్ల, కుర్మలు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో 75 శాతం సబ్సిడీపై గొర్రెల పంపిణీ చేపట్టడం జరిగిందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, చెప్పారు.

గొల్ల,కుర్మలు అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి వుంది:తలసాని

హైదరాబాద్: గొల్ల, కుర్మలు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలనే  దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో 75 శాతం సబ్సిడీపై గొర్రెల పంపిణీ చేపట్టడం జరిగిందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, చెప్పారు. గతంలో ఉన్న పాలకులు గొల్ల, కురుమలను కేవలం ఓటు బ్యాంకు గానే చూశారని అన్నారు. రాష్ట్రంలో గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న వారికి సేవ చేసే అవకాశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బాలరాజ్ యాదవ్ కు కల్పించారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర షీప్స్ అండ్ గోట్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. 


ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదవుల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్ర సాధన కోసం ఉద్యమం లో భాగస్వాములైన ఉద్యమకారులకు ప్రభుత్వం సముచిత స్థానం కల్పించిందని చెప్పారు. రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుండగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు కొందరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి తో యాదాద్రి దేవాలయం ఒక అద్భుత కళాఖండం గా రూపుదిద్దుకున్నదని తెలిపారు. 


యాదవుల కులదైవం కొమురెల్లి మల్లన్న ఆలయం కూడా గతంలో కంటే ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. ఈ కార్యక్రమంలో  రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, గొర్రెలు, మేకల అభివృద్ధి ఫెడరేషన్ ఎండి రాంచందర్, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, బేవరేజెస్, వేర్ హౌస్ కార్పొరేషన్ ల చైర్మన్ లు గజ్జెల నగేష్, సాయిచంద్, నల్లగొండ జిల్లా డీసీసీబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, మాజీ ఎంఎల్సీ పూల రవీందర్, వివిధ జిల్లాల నుండి వచ్చిన గొర్రెల పెంపకం దారులు, యాదవ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-30T22:21:12+05:30 IST