మీకు క్షమాపణలు చెప్పడానికి సిద్ధం
ABN , First Publish Date - 2021-01-20T08:41:59+05:30 IST
రాష్ట్రంలో గంగపుత్రుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ సానుకూలంగా వ్యవహరిస్తుందని మంత్రి తలసాని

మిమ్మల్ని బాధపెట్టేలా నేను మాట్లాడలేదు
గంగ పుత్రులతో సమావేశంలో మంత్రి తలసాని
హైదరాబాద్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గంగపుత్రుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ సానుకూలంగా వ్యవహరిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో మత్స్య శాఖ అధికారులు, గంగపుత్ర సంఘం ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఈ నెల 10న కోకాపేటలో జరిగిన ముదిరాజ్ భవన్ శంకుస్థాపన కార్యక్రమంలో తాను ముదిరాజ్‌లను ఉత్తేజపరిచే విధంగా మాట్లాడానే తప్ప ఎవరిని బాధ పెట్టే విధంగా ప్రసంగించలేదని వివరించారు. ‘‘నేను కూడా వెనుకబడిన వర్గాల నుండి వచ్చిన వాడినే! నామాటలతో మీ మనసు బాధించి ఉంటే క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా’’ అని గంగ పుత్రులతో తలసాని చెప్పారు. గతంలో గంగపుత్రులు, ముదిరాజ్‌లకు సంబంధించి అనేక సమస్యలు తన దృష్టికిరాగా వాటి పరిష్కారానికి కృషి చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ సందర్భంగా గంగాపుత్ర సంఘం ప్రతినిధులు పలువురు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకు రాగా... వారి సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.