రాష్ట్రంలో పంటల మార్పిడి పెద్దయెత్తున జరుగుతోంది: నిరంజన్ రెడ్డి

ABN , First Publish Date - 2021-10-21T21:48:11+05:30 IST

రాష్ట్రంలో పంటల మార్పిడి పెద్దయెత్తున జరుగుతోందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రైతులకు కావాల్సినన్ని విత్తనాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు.

రాష్ట్రంలో పంటల మార్పిడి పెద్దయెత్తున జరుగుతోంది: నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్రంలో పంటల మార్పిడి పెద్దయెత్తున జరుగుతోందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రైతులకు కావాల్సినన్ని విత్తనాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. పప్పు, నూనెగింజల సాగుకు రైతులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని మంత్రి తెలిపారు. గురువారం మంత్రుల సముదాయంలోని తన నివాసంలో వ్యవసాయం, మార్కెటింగ్, ఉద్యాన శాఖలతో మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గతంతో పోలిస్తే మినుములు, ఆముదాలు, నువ్వులు, ఆవాల సాగుకు రైతుల ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. రైతువేదికలలో పంటల మార్పిడి మీదనే కాకుండా సమగ్ర వ్యవసాయ విధానం మీద చర్చలు, శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు.అధికారులు, శిక్షకులకు అవసరమైన వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ సమాచారం రైతు వేదికలలో అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. 


రైతువేదికల ద్వారా క్షేత్రస్థాయిలో ఇప్పటివరకు పంటల మార్పిడి కోసం 8098 శిక్షణా తరగతులతో పాటు మొత్తం వివిధ అంశాల మీద 22,123 శిక్షణా తరగతులు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.వ్యవసాయ అనుబంధ విషయాలు రైతులకు చేరవేయడంలో నూతన సాంకేతికతతో పాటు వాటి ప్రచారానికి మీడియాను పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు.పంటల మార్పిడిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయిల్ పామ్ నర్సరీలలో మొక్కల పెంపకం మీద కూడా మంత్రి సమీక్ష నిర్వహించారు.వచ్చే వానాకాలం నాటికి నిర్దేశించిన లక్ష్యం ప్రకారం క్షేత్రస్థాయిలో రైతులకు ఆయిల్ పామ్ మొక్కలు అందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు.


యాసంగి సాగుకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.వివిధ మార్కెట్లలో పత్తి ధరలను కూడా మంత్రి అడిగి తెలుసుకున్నారు. మద్దతుధర రూ.6025 వేలు ఉండగా రూ.7 వేలకు పైగా ధర పలకడంపై హర్షణీయమన్నారు.ఈ ఏడాది అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది రైతులు పెద్దఎత్తున పత్తిని సాగుచేయాలని సూచించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీభాయి, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-21T21:48:11+05:30 IST