సర్కారీ ఆస్పత్రుల్లో బయోమెట్రిక్‌ హాజరు

ABN , First Publish Date - 2021-02-06T09:03:57+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని వెంటనే అమలు చేయాలని, అందుకు సంబంధించిన యంత్రాలను సమకూర్చే బాధ్యత

సర్కారీ ఆస్పత్రుల్లో బయోమెట్రిక్‌ హాజరు

నిమ్స్‌లో ఐసీయూ పడకల సంఖ్య పెంపు

ఇక నుంచి ఉచితంగా డెంటల్‌ ఇంప్లాంట్స్‌

వైద్య, ఆరోగ్య శాఖ సమీక్షలో కీలక నిర్ణయాలు

ఆస్పత్రులను ఉన్నతంగా తీర్చిదిద్దుతాం: మంత్రి ఈటల


హైదరాబాద్‌, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని వెంటనే అమలు చేయాలని, అందుకు సంబంధించిన యంత్రాలను సమకూర్చే బాధ్యత టీఎ్‌సఎంఎ్‌సఐడీసీకి అప్పగించాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. వైద్య, ఆరోగ్య శాఖలోని అన్ని విభాగాల అధిపతులు, ఆస్పత్రుల డైరెక్టర్లు, సూపరింటెండెంట్లతో శుక్రవారం మంత్రి ఈటల రాజేందర్‌ సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.


డెంటల్‌ ఆస్పత్రికి వచ్చే రోగులకు డెంటల్‌ ఇంప్లాంట్స్‌ ఉచితంగా అందించాలని, నిమ్స్‌లో ఐసీయూ పడకల సంఖ్యను 500కు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి అత్యాధునిక వైద్య పరికరాలు సమకూర్చాలని, గాంధీలో రూ.35 కోట్లతో అవయవ మార్పిడికి అత్యాధునిక ఆపరేషన్‌ థియేటర్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రానున్న రోజుల్లో మండల కేంద్రాల్లోనూ డయాలసిస్‌ కేంద్రాల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సమీక్ష అనంతరం మంత్రి ఈటల మీడియాతో మాట్లాడుతూ అన్ని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లోని సమస్యలు పరిష్కరించి, వాటిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. వైద్య శాఖలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో కొన్ని ఆస్పత్రులను కొవిడ్‌ ఫ్రీగా మార్చామని తెలిపారు. ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వారికి చెస్ట్‌ ఆస్పత్రి, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వారికి గాంధీ, టిమ్స్‌లో కొవిడ్‌ చికిత్స అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు.




రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సాఫీగా సాగుతోందని, శనివారం నుంచి పోలీస్‌, మునిసిపల్‌, రెవెన్యూ సిబ్బందికి టీకాలు ఇస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు వైద్యశాఖ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వైద్య, ఆరోగ్యశాఖలో మొత్తం 1400 మందికి పదోన్నతులు కల్పించామని, వైద్య విధాన పరిషత్‌కు సంబంధించిన ప్రమోషన్ల ఫైల్‌పై సీఎం సంతకం చేశారని తెలిపారు. కేన్సర్‌, ఎంసీహెచ్‌ సెంటర్ల ఏర్పాటుకు నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ద్వారా నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆయుష్మాన్‌ భారత్‌ను ఎలా అమలు చేయాలన్న అంశంపై కసరత్తు చేస్తున్నామని తెలిపారు.

Updated Date - 2021-02-06T09:03:57+05:30 IST