పంటలకు పరిహారం అందేలా చూస్తాం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ABN , First Publish Date - 2021-07-24T20:06:22+05:30 IST
వరదల వల్ల నీట మునిగిన పంట పొలాలకు ప్రభుత్వపరంగా సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ తెలిపారు.

నిర్మల్: వరదల వల్ల నీట మునిగిన పంట పొలాలకు ప్రభుత్వపరంగా సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ తెలిపారు. భారీ వర్షాల వల్ల వరద నీటిలో మునిగి దెబ్బతిన్న పంటలను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. శనివారం పీచర, ధర్మారం, చింతల్ చాంద గ్రామాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, పంటలను, చేపల చెరువును పరిశీలించారు. ఏ మేరకు పంట నష్టం వాటిల్లిందని రైతులను, అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల వరద ఉధృతితో నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయన్నారు. వరదల తాకిడి వల్ల పంటలు నీట మునిగి రైతులు నష్టపోయారని, వారికి ప్రభుత్వ పరంగా సహాయం అందించేందుకు రెవెన్యూ శాఖ చర్యలు తీసుకుంటుందని అన్నారు. వర్షాలు అధికంగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.