వానాకాలంలో ఇబ్బందులు లేకుండా ముగిసిన ధాన్యం కొనుగోళ్లు.

ABN , First Publish Date - 2021-02-06T20:17:23+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి పట్టుదల ముందుచూపు దార్శనికత వల్ల రాష్ట్రంలో ప్రతి ఏడాది సాగు విస్తీర్ణం పెరిగి ధాన్యం దిగుబడులు పెరుగుతున్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

వానాకాలంలో ఇబ్బందులు లేకుండా ముగిసిన ధాన్యం కొనుగోళ్లు.

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి పట్టుదల ముందుచూపు దార్శనికత వల్ల రాష్ట్రంలో ప్రతి ఏడాది సాగు విస్తీర్ణం పెరిగి ధాన్యం దిగుబడులు పెరుగుతున్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పెరుగుతున్న ధాన్యం దిగుబడులకు అనుగుణంగా రైతాంగానికి ఏలాంటి ఇబ్బందులు కలగకుండా పౌరసరఫరాల శాఖ ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందన్నారు. ఈ ఏడాది 2020-21 వానాకాలానికి సంబంధించి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ముగిసిందని, కొనుగోలు కేంద్రాలను మూసివేయడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఈ వానాకాలంలో అత్యధికంగా ధాన్యం కొనుగోలు జరిగిందని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి తెలిపారు.

 

గత ఏడాది వానాకాలంలో 3670 కొనుగోలు కేంద్రాల ద్వారా 47.08 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా ఈ ఏడాది వానాకాలంలో 6,506 కొనుగోలు కేంద్రాల ద్వారా 11 లక్షల మంది రైతుల నుంచి 48.89 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు జరిగిందని తెలిపారు. రూ.9,224 కోట్లు విలవ చేసే ఈ ధాన్యానికిగాను 9086 కోట్ల రూపాయలను రైతుల బ్యాంకు ఖాతాలో నేరుగా జమచేశామని తెలిపారు. 


మరో ఒకటి రెండు రోజుల్లో మిగితా మొత్తాన్ని కూడా జమచేస్తామన్నారు. 48.89లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో 29.04లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డురకంకాగా, సన్నరకం 19.85లక్షల మెట్రిక్ టన్నులు. పౌరసరఫరాల శాఖ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి వచ్చిన ప్రతి ధాన్యం గింజను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడం జరిగింది. దక్కన్ పీఠభూమిలో వ్యవసాయమే సాధ్యం కాదన్న చోట ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడాదిలో కోటి టన్నుల ధాన్యాన్ని పండించి చూపించారు.

గత ఏడాది వానాకాలం, యాసంగిలో పౌరసరఫరాల శాఖకోటి 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని, ధాన్యం కొనుగోలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండోస్థానంలో నిలిచిందన్నారు. ఈ వానాకాలంలో సాగు విస్తీర్ణంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని వరి పంట 53 లక్షల ఎకరాల్లో సాగైందన్నారు. సీఎం కేసీఆర్ కృషి, పట్టుదలతోనే ఇది సాధ్యమైందన్నారు. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతుల అభివృద్ధి సంక్షమం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని అన్నారు.


కరోనా సమయంలో రైతులు ధాన్యం అమ్ముకోవడానికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా కింది స్థాయి నుండి పై స్థాయి వరకు అధికార యంత్రాంగం పకడ్బందిగా పనిచేసిందని ప్రశంసించారు. మిల్లర్ల నుంచి సిఎంఆర్ సేకరించే విషయంలో కూడా ఇదే పనితీరును కనబర్చాలని ఆయన కోరారు.

Updated Date - 2021-02-06T20:17:23+05:30 IST