నీవు బాగానే ఊపుతున్నావు.. ఇక్కడ ఊపుతలేవు!

ABN , First Publish Date - 2021-07-10T08:38:37+05:30 IST

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలం ఉప్పల్‌ గ్రామంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. శుక్రవారం జరిగిన పల్లెప్రగతి గ్రామసభలో మంత్రి పాల్గొన్నారు. మొదట గ్రామ

నీవు బాగానే ఊపుతున్నావు.. ఇక్కడ ఊపుతలేవు!

ఎంపీడీవోపై మంత్రి ఎర్రబెల్లి వివాదాస్పద వ్యాఖ్యలు

వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఉప్పల్‌ పల్లెప్రగతిలో ఘటన 

 నా మాటలు వక్రీకరించారు: దయాకర్‌రావు


కమలాపూర్‌/హైదరాబాద్‌/హన్మకొండ టౌన్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలం ఉప్పల్‌ గ్రామంలో మంత్రి ఎర్రబెల్లి  దయాకర్‌రావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. శుక్రవారం జరిగిన పల్లెప్రగతి గ్రామసభలో మంత్రి పాల్గొన్నారు. మొదట గ్రామ కార్యదర్శితో  మాట్లాడుతూ.. ప్రకృతి వనంలో ఏ లోపం కనిపిస్తుందని ప్రశ్నించారు. పువ్వుల చెట్లు పెట్టాలని, పిల్లలు ఆడుకునేలా ఉండాలని, గడ్డి పెంచాలని, వ్యాయామం చేసుకునేలా ఉండాలని, చెట్టు కింద తనలాంటి ముసలోళ్లు కూర్చునేటట్లు గద్దెలు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. ‘ఏమీ సర్పంచ్‌గారు.. నేను నెల రోజుల తర్వాత వస్తా.. ప్రకృతి వనాన్ని బాగా అభివృద్ధి చేయాలి’ అని చెప్పారు. అనంతరం ఎంపీడీవో ఉన్నారా? అని మంత్రి అనడంతో.. వెనుకనే సభలో కూర్చున్న ఎంపీడీవో పల్లవి లేచి నిలబడ్డారు.


దీంతో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ‘మేడం నీవు బాగానే ఊపుతున్నావ్‌.. కానీ, ఇక్కడ ఊపుతలేవు’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆపై వెంటనే మేడమ్‌ బాగానే పనిచేస్తది అని కితాబు ఇచ్చారు. మంత్రి వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కాగా, ‘కమలాపూర్‌ ఎంపీడీవో కుటుంబంతో ఉన్న సన్నిహిత సంబంధంతో ఏం బిడ్డా (కూతురు) బాగున్నావా.. అంటూ పలకరించి బాగా పని చేస్తున్నావు ఇంకా అందరినీ ఉరికించి పనిచేయించండని’ ప్రోత్సహించానని మంత్రి ఎర్రబెల్లి ఒక ప్రకటనలో తెలిపారు. తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించి సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. కాగా, ఎంపీడీవో పల్లవిని ప్రశంసించే క్రమంలో మంత్రి ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని ఎంపీడీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్తయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఎర్రబెల్లిని  మంత్రి పదవి నుంచి బర్త్‌రఫ్‌ చేయాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్‌ డిమాండ్‌ చేశారు.  

Updated Date - 2021-07-10T08:38:37+05:30 IST