ఏప్రిల్‌లోనే మినీ మునిసి‘పోల్’
ABN , First Publish Date - 2021-02-26T07:52:59+05:30 IST
గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌లతో పాటు సిద్దిపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు, అచ్చంపేట మునిసిపాలిటీలకు ఏప్రిల్‌లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మినీ మునిసిపోల్‌గా పేర్కొంటు న్న ఈ ఎన్నికల కోసం

ముసాయిదా వార్డుల జాబితా సిద్ధం
మార్చి 25న వార్డుల ఖరారు
హైదరాబాద్, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌లతో పాటు సిద్దిపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు, అచ్చంపేట మునిసిపాలిటీలకు ఏప్రిల్‌లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మినీ మునిసిపోల్‌గా పేర్కొంటు న్న ఈ ఎన్నికల కోసం వార్డుల పునర్విభజన ప్రక్రి య మార్చి 25తో ముగియనుంది. వార్డులు ఖరారై రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. తదుపరి ఎస్‌ఈసీ షెడ్యూల్‌ను ప్రకటించి, ఎన్నికలు నిర్వహిస్తుంది. కాగా ఎన్నికలు జరగనున్న ఏడు మునిసిపాలిటీలకు గురువారం ముసాయిదా వార్డుల జాబితాను తయారు చేశారు. ముసాయిదాపై మార్చి6 వరకు క్షేత్ర స్థాయి సర్వే చేపడతారు. మార్చి 9 నుంచి 15 వరకు సాధారణ ప్రజలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల నుంచి సలహా లు, సూచనలను స్వీకరిస్తారు. వాటిని మార్చి 16 నుంచి 21 వరకు విచారించి, పరిష్కరిస్తారు. మార్చి 22న నివేదికను పురపాలక శాఖ సంచాలకులకు అందజేస్తారు. మార్చి 23, 24 తేదీల్లో ప్రభుత్వానికి నివేదిక చేరుతుంది. మార్చి 25న వార్డుల తుది జాబితాను ప్రకటిస్తారు. కాగా గ్రే టర్ వరంగల్‌లో 66వార్డులు, ఖమ్మంలో 60, అచ్చంపేటలో 20, సిద్దిపేటలో 43, జడ్చర్లలో 27, నకిరేకల్‌లో 20, కొత్తూరులో 12 వార్డులు ఉన్నాయి.
ప్రత్యేకాధికారులు తప్పదా?
ఎన్నికలు జరగాల్సిన గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌లు, అచ్చంపేట మునిసిపాలిటీల పాలకమండలి పదవీకాలం మార్చి 14తో ముగుస్తోంది. ఈ లోగా ఎన్నికలు నిర్వహించడం అసాధ్యం. దీంతో, గడువు ముగిసిన వెంటనే వీటిల్లో ప్రత్యేకాధికారులను నియమించనున్నారు. సిద్దిపేట పాలకమండలి పదవీకాలం ముగిసే ఏప్రిల్ 15 నాటికి ఎన్నికలు పూర్తికాని పక్షంలో ఇక్కడా ప్రత్యేకాధికారిని నియమిస్తారు. ఇప్పటికే నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మునిసిపాలిటీలు అధికారుల పాలనలోనే ఉన్నాయి. జహీరాబాద్ మునిసిపాలిటీలో సమీప గ్రామాల విలీనం వివాదం కోర్టులో ఉన్న ది. మణుగూరు, పాల్వంచ, మందమర్రి మునిసిపాలిటీలు షెడ్యూల్ ఏరియాలో ఉన్నందున వీటిని నోటిఫై చేయాల్సి ఉన్నట్లు సమాచారం. కాగా మార్చిలో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉండటంతో ఆ తర్వాతే మునిసిపాలిటీలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.