సొంతూళ్లకు..!
ABN , First Publish Date - 2021-04-16T08:45:16+05:30 IST
మాయదారి కరోనా మళ్లీ వలస కూలీల్లో గుబులు పుట్టిస్తోంది. లాక్డౌన్ విధిస్తారేమోనన్న భయంతో ఎంతో మంది సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. ఫలితంగా వలసకూలీలతో నాడు కళకళలాడిన
హైదరాబాద్ నుంచి తరలివెళ్తున్న వలసకూలీలు
రైళ్లలో రోజుకు 250, లారీల్లో 300-500 మంది
కరోనా రెండో దశ, లాక్డౌన్ భయంతో పయనం
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): మాయదారి కరోనా మళ్లీ వలస కూలీల్లో గుబులు పుట్టిస్తోంది. లాక్డౌన్ విధిస్తారేమోనన్న భయంతో ఎంతో మంది సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. ఫలితంగా వలసకూలీలతో నాడు కళకళలాడిన అడ్డాలు, నిర్మాణ స్థలాలు, పరిశ్రమలు మళ్లీ బోసిపోతున్నాయి. నిరుడు మార్చి 2న నగరంలో తొలికేసు నమోదుకాగా, ఆ తర్వాత కేసులు పెరుగుతూ వచ్చాయి. లాక్డౌన్ నేపథ్యంలో మార్చి 16 నుంచి రైళ్లు, బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోవడంతో రాజస్థాన్, మహారాష్ట్ర ఒడిసా, బిహర్, ఛత్తీ్‌సగడ్, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన లక్షల మంది వలస కూలీలు పనులు లేక అల్లాడిపోయారు. ఈ క్రమంలో కొంతమంది మంది కాలినడకన స్వగ్రామాలకు వెళ్లగా, మరికొందరు శ్రామిక్ రైళ్లలో తరలివెళ్లారు.
అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా 2020 ఆగస్టు నుంచి నగరంలో అన్ని కార్యకలాపాలు ప్రారంభమయ్యాక మళ్లీ ఉపాధికోసం చాలా మంది నగరానికి వచ్చారు. దాదాపు నాలుగు నెలలపాటు ప్రశాంతంగా పనులు చేసుకున్నారు. ఇంతలో నెలరోజుల నుంచి ఒక్కసారిగా పెరిగిపోతున్న కొవిడ్ సెకండ్ వేవ్ కేసులతో కూలీలకు పనులు కరువయ్యాయి. గతంలో నెలరోజులపాటు పని ఉండగా.. మార్చి 20 నుంచి ఎవరూ పనికి పిలవడం లేదని బోయిన్‌పల్లిలో రేషన్ సరుకులు అన్ లోడింగ్ చేసే ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన సుభాష్ తెలిపారు. గత నాలు గు రోజులుగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక వైపు వెళ్తున్న రైళ్లలో ప్రతిరోజు 200 మంది, లారీలు, డీసీఎంలలో 300 నుంచి 500 మంది స్వస్థలాలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. కరోనా భయంతో కాంట్రాక్టర్లు పనులు లేవని వెళ్లగొడుతున్నందుకే ఇంటిబాట పడుతున్నామని కూలీలు వాపోతున్నారు.
గ్రేటర్లో 30 లక్షలకు పైగా కూలీలు..
గ్రేటర్ పరిధిలోని రోజువారీ కూలీలు 30 లక్షలకు పైగా ఉన్నారు. ఇందులో 7 లక్షల మంది భవన నిర్మాణ రంగంలో పనిచేస్తుండగా, 3 లక్షల మంది హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో పనిచేస్తున్నారు. కెమికల్, బీర్ల తయారీ, ఫ్లైవుడ్, ఎలక్ట్రికల్ పరిశ్రమల్లో 20 లక్షల మంది పనిచేస్తున్నారు. వీరంతా నగరంలోని రాజేంద్రనగర్, కాటేదాన్, నాచారం, కుషాయిగూడ, చర్లపల్లి, బాలానగర్, షాపూర్‌నగర్ ప్రాంతాల్లో పనిచేస్తున్నట్లు గ్రేటర్ కార్మిక సంఘం నాయకులు తెలిపారు. మొత్తం 30 లక్షల మంది కార్మికుల్లో దాదాపు 18 లక్షల మంది వలస కూలీలు ఉన్నట్లు వారు చెప్పారు.
ఈ ఫొటోలోని వ్యక్తి పేరు రామ్ ప్రసాద్. ఈయనది యూపీలోని ఝాన్నీ గ్రామం రామ్ ప్రసాద్ ఆరేళ్లుగా నిజాంపేట, బాచుపల్లి, పరిసర ప్రాంతాల్లో భవన నిర్మాణ రంగ మేస్త్రీగా పనిచేస్తూ నెలకు రూ.35 వేల దాకా సంపాదిస్తున్నాడు. నగరంలో కరోనా రెండో దశ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో లాక్డౌన్ విధిస్తారనే భయంతో ఇంటికి వెళ్లేందుకు బుధవారం రాత్రి 9 గంటలకు ఆయన ముల్లేమూటా సర్దుకున్నాడు. సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చి బికనీర్ రైలు ఎక్కాడు. మళ్లీ లాక్డౌన్ విధిస్తారేమోనన్న భయంతో రామ్ ప్రసాద్ మాదిరే ఎంతో మంది సొంతూళ్లకు వెళ్తున్నారు.

నాన్న రమ్మన్నాడు
నేను నాలుగేళ్ల నుంచి ఉప్పల్‌లో మేస్త్రీ పనిచేస్తున్నాను. నెలకు రూ.30 వేల వరకు సంపాదిస్తున్నాను. పోయునేడాది కరోనా కారణంగా జూన్‌లో ఇంటికి వెళ్లి అక్టోబరులో వచ్చిన. ప్రశాంతంగా పనులు చేసుకుంటున్నానని సంతోషపడుతుండగానే ఇప్పుడేమో లాక్డౌన్ పెడతారని చెబుతున్నారు. ఇంటి నుంచి నాన్న ఫోన్ చేసి రమ్మని చెబితే వెళ్తున్నాను. సికింద్రాబాద్‌లో రైలు ఎక్కి పోతున్నా. మధ్యప్రదేశ్‌లో 9 రోజులు లాక్డౌన్ పెట్టారట.
-సునీల్, రాతలామ్ గ్రామం (మధ్యప్రదేశ్)

వ్యవసాయం చేసుకుంటా
నేను మేస్త్రీ పనిచేసుకుంటూ సికింద్రాబాద్‌లోని శ్రీనివాసనగర్‌లో ఉంటున్నా. కరోనాతో పోయినసారి లాక్డౌన్ పెడితే లారీలో ఇంటికి వెళ్లేందుకు చాలా కష్టపడ్డాను. తిరిగి వచ్చి నగరంలో నాలుగు నెలలపాటు హాయిగా పనిచేసుకున్నా. మళ్లీ కరోనా పెరిగిందని చెబుతుండటంతో ఇంటికి వెళ్తున్నా. వచ్చేది వానకాలం కాబట్టి ఊరికిపోయి వ్యవసాయం చేసుకుంటా. కేసులు తగ్గిన తర్వాత ఆగస్టులో వస్తా.
- జితేందర్, ముంగేలి గ్రామం (ఛత్తీ్‌సగఢ్)
