ఉస్మానియా, నిమ్స్‌ మధ్య అవగాహన ఒప్పందం

ABN , First Publish Date - 2021-12-15T08:38:03+05:30 IST

ఉస్మానియా, నిమ్స్‌ ఆస్పత్రుల మధ్య వైద్య చికిత్సలు, టెస్టుల కోసం అవగాహన ఒప్పందం చేసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆ శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.

ఉస్మానియా, నిమ్స్‌ మధ్య అవగాహన ఒప్పందం

  • ఉస్మానియా ఆస్పత్రిలో అందుబాటులో లేని టెస్టులు, చికిత్సలు ఇక నిమ్స్‌కు 
  • వచ్చే ఏడాది ఔషధాల బడ్జెట్‌ పెంపు 
  • ‘గాంధీ’లో లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ప్రారంభించాలి: హరీశ్‌ రావు 
  • ఉస్మానియాలో  క్యాథ్‌ ల్యాబ్‌, సీటీ స్కాన్‌ల ప్రారంభం


హైదరాబాద్‌/మంగళ్‌హాట్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా, నిమ్స్‌ ఆస్పత్రుల మధ్య వైద్య చికిత్సలు, టెస్టుల కోసం అవగాహన ఒప్పందం చేసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆ శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఇకనుంచి ఉస్మానియాలో అందుబాటులోని పరీక్షలు, టెస్టుల కోసం నిమ్స్‌కు రిఫర్‌ చేయాలని సూచించారు. సర్కారీ దవాఖానాల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ టెస్టులను బయటకు రాయకూడదన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఔషధాల కోసం ఇచ్చే బడ్జెట్‌ను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మంగళవారం ఉస్మానియా ఆస్పత్రిలో రూ. 7 కోట్లతో ఏర్పాటు చేసిన క్యాథ్‌ ల్యాబ్‌, రూ. 212 కోట్లతో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్‌లను మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌లతో కలిసి ఆయన ప్రారంభించారు. అత్యవసర విభాగం, ఏఎంసీ వార్డుల్లోని రోగులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం మూడు గంటల పాటు.. అన్ని విభాగాల వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. గాంధీ ఆస్పత్రిలో తక్షణమే కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను ప్రారంభించాలని మంత్రి హరీశ్‌ రావు అధికారులను ఆదేశించారు. ఉస్మానియాలో ఉన్న గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులను తక్షణమే గాంధీకి పంపాలని ఆయన సూచించారు.  


మార్చురీల ఆధునీకరణ

రాష్ట్రంలోని అన్ని మార్చురీలను ఆధునికీకరిస్తామని, అందులో భాగంగానే ఉస్మానియా మార్చురీ నూతన భవనం కోసం రూ. 5 కోట్లు విడుదల చేస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు చెప్పారు. సమీక్ష అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గాంధీ, రిమ్స్‌, వరంగల్‌ ఆస్పత్రుల్లో వీలైనంత త్వరగా క్యాథ్‌ల్యాబ్‌లను అందుబాటులోకి తెస్తామన్నారు. ఉస్మానియాలో మరో 250 పడకల ఏర్పాటుకు పనులు జరుగుతున్నాయని, వచ్చే ఏడాది జనవరి 1వ తేదీన 50 పడకల ఐసీయూను ప్రారంభిస్తామని తెలిపారు. ఉస్మానియా పాత భవనానికి సంబంధించిన అంశం కోర్టులో ఉందని, ఆదేశాలు రాగానే తగిన చర్యలు తీసుకుంటామన్నారు.   ఉస్మానియాలో ఫైర్‌ ఫైట్‌ ఎక్యూ్‌పమెంట్‌ను సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  ఆస్పత్రుల్లో అందిస్తున్న డైట్‌ క్వాలిటీని మరింత పెంచుతామని, డైట్‌ చార్టీల పెంపు అంశాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎంఈ రమేశ్‌ రెడ్డి, ఉస్మానియా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌ తదితరులు పాల్గొన్నారు.


మూడో వేవ్‌ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: హరీశ్‌

రాష్ట్రంలో కరోనా మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అధికారులకు సూచించారు. కేరళ, మహారాష్ట్రలలో కేసులు పెరుగుతున్నాయని, అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. కరోనా వ్యాప్తిపై రోజువారీ పరిశీలన చేసేందుకు ప్రత్యేకంగా కమిటీ నియమించాలని ఆదేశించారు. కరోనా పరిస్థితులు, ఒమైక్రాన్‌ వేరియంట్‌, మూడో వేవ్‌ సన్నద్ధతపై బీఆర్‌కే భవన్‌లో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో 21 లక్షల హోం ఐసోలేషన్‌ కిట్లు సిద్ధం చేయాలని, 545 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ సదుపాయం కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీక్షలో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, హెల్త్‌ సెక్రెటరీ రిజ్వీ, డీఎంఈ రమేశ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-15T08:38:03+05:30 IST