నిరుద్యోగులను మోసం చేసిన కేసీఆర్
ABN , First Publish Date - 2021-02-26T05:34:15+05:30 IST
నిరుద్యోగులను మోసం చేసిన కేసీఆర్

గెలిపిస్తే ప్రజల గొంతుకై నిలబడుతా..
వామపక్షాల ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారథిరెడ్డి
వడ్డెపల్లి, ఫిబ్రవరి 25: నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో సీఎం కేసీఆర్ మోసం చేశారని నల్గొండ, ఖమ్మం, వరంగల్ వామపక్షాలు బలపర్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి బి.జయసారథిరెడ్డి విమర్శించారు. హన్మకొండ బాలసముద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో గురువారం నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చి ఆరేళ్లు గడిచినా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3.50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయకుండా మోసం చేసిందని దుయ్యబట్టారు. నిరుద్యోగ భృతి కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. సీఎం కేసీఆర్ ఉద్యోగులకు, నిరుద్యోగులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని జయసారథిరెడ్డి ఆరోపించారు. పీఆర్‌సీ ఇవ్వకుండా ఉద్యోగులను మోసం చేశారన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయలేదని అన్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాజేశ్వర్‌రెడ్డి ఉద్యోగాల కల్పన విషయంలో పచ్చి అబద్దాలు అడుతున్నారని అన్నారు. నమ్మించి మోసం చేయడంలో సీఎం కేసీఆర్‌ను మించిన ఘనుడు రాజేశ్వర్‌రెడ్డి అని ఎద్దేవా చేశారు. మాయ మాటలతో మోసం చేస్తున్న రాజేశ్వర్‌రెడ్డిని ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్యోగులకు నష్టం చేసేలా చట్టం చేస్తుందని తెలిపారు. బ్యాంకులు, సింగరేణి, ఎల్‌ఐసీ, రైల్వే, టెలికాం, విద్యుత్ రంగాలను ప్రైవేట్‌పరం చేసి నిరుద్యోగుల ఆశలకు గండి కొడుతోందని విమర్శించారు. పట్టభద్రులు, ప్రజ ల హక్కులను సాధించేందుకు శాసనమండలిలో ప్రశ్నించే గొంతుక అవుతానని జయసారథిరెడ్డి తెలిపారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ స్థాపించాలని, కాజీపేట రైల్వే కోచ్ ప్యాక్టరీని ఏర్పాటు చేయాలని, ములుగులో గిరిజన యూనివర్సిటీని స్థాపించాలనే అంశాలపై శాసనమండలిలో పోరాడుతానని తెలిపారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, జర్నలిస్టులు, పెన్షనర్ల సమస్యలే ఎజెండాగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. తనకు పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు టి.శ్రీధర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.వెంకటేశ్వర్లుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.