ప్రాణాలు తీసిన ఫొటో సరదా!

ABN , First Publish Date - 2021-06-22T08:46:45+05:30 IST

సరదాగా చెరువు వద్దకు వెళ్లి ఫొటోలు దిగుతుండగా కాలుజారి అందులో పడి వైద్యులైన ఇద్దరు సోదరులు దుర్మరణం పాలయ్యారు.

ప్రాణాలు తీసిన ఫొటో సరదా!

  • చెరువులో పడి వైద్య సోదరుల మృతి
  • కృష్ణాలో మునిగి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

శామీర్‌పేట, నేరేడుగొమ్ము, జూన్‌ 21: సరదాగా చెరువు వద్దకు వెళ్లి ఫొటోలు దిగుతుండగా కాలుజారి అందులో పడి వైద్యులైన ఇద్దరు సోదరులు దుర్మరణం పాలయ్యారు. విషాదకర ఈ ఘటన.. మేడ్చల్‌ జిల్లాలోని శామీర్‌పేట పెద్దచెరువు వద్ద ఆదివారం సాయంత్రం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బిహార్‌కు చెందిన నందన్‌(24), గౌతమ్‌(27) అన్నదమ్ములు. నందన్‌ అల్వాల్‌లోని ఎక్సెల్‌ ఆస్పత్రిలో డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌(డీఎంవో)గా పని చేస్తున్నారు. నందన్‌తో పాటు అతడి తల్లి బబితా కేసిరీదేవి అల్వాల్‌లోని అద్దె ఇంట్లో ఉంటున్నారు. గౌతమ్‌(27) బిహార్‌లో హోమియోపతి వైద్యుడిగా పని చేస్తుండగా, తండ్రి రాజ్‌ బిహారి అక్కడే ఉంటున్నారు. గౌతమ్‌ రెండు వారాల క్రితం అల్వాల్‌కు వచ్చారు. ఆదివారం సాయంత్రం బైక్‌పై అన్నదమ్ములు సరదాగా శామీర్‌పేట పెద్ద చెరువు వద్దకు వచ్చారు. అక్కడ ఫోటోలు దిగుతుండగా, నందన్‌ కాలుజారి చెరువులో పడిపోయాడు. తమ్ముడిని కాపాడేందుకు గౌతమ్‌ యత్నించగా, ఇద్దరూ నీట మునిగి చనిపోయారు. అలాగే, హైదరాబాద్‌లోని చైతన్యనగర్‌కు చెందిన క్రాంతికుమార్‌ (28)సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఆదివారం స్నేహితులతో కలిసి కారులో నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండలంలోని  కృష్ణా పరివాహక ప్రాంతానికి వచ్చాడు. నదిలో ఈత కొడుతూ ప్రమాదవశాత్తూ నీట మునిగి చనిపోయాడు.

Updated Date - 2021-06-22T08:46:45+05:30 IST