కిక్కు.. లక్కు..

ABN , First Publish Date - 2021-11-21T05:53:30+05:30 IST

కిక్కు.. లక్కు..

కిక్కు.. లక్కు..
మహబూబాబాద్‌ ఏబీ ఫంక్షన్‌హాల్లో లక్కీడిప్‌ ఎంపికలో టోకెన్‌ చూపుతున్న కలెక్టర్‌ శశాంక

మద్యం షాపులకు ఎంపికలు పూర్తి

59 షాపులకు లక్కీ డ్రా ద్వారా కేటాయింపు

పూర్తి సమయం కేటాయించిన కలెక్టర్‌

ఒక్కో ఇంట్లో పదుల సంఖ్యలో దరఖాస్తులు

తొమ్మిది షాపులకు మహిళలే మహారాణులు 


మహబూబాబాద్‌ రూరల్‌, నవంబరు 20 : జిల్లాలోని మద్యం షాపులకు 2021–23 ఎక్సైజ్‌ సంవత్సరానికి గాను టెండర్‌దారుల ఎంపిక ప్రక్రియ పూర్తిచేశారు. మద్యం షాపులను దక్కించుకోవడానికి దరఖాస్తు చేసుకున్న టెండర్‌దారులు శుక్రవారం వరకు షాపులు ఎవరికి దక్కుతాయోనని ఉత్కంఠతతో ఎదురుచూపులకు తెరపడింది.  జిల్లాలోని తొర్రూరు, గూడూరు, మహబూబాబాద్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ల పరిధిలోని 59 షాపులకు రిజర్వేషన్‌ల ప్రక్రియను పూర్తి చేసి ఈనెల 9 నుంచి 18 వరకు దరఖాస్తులను స్వీకరించగా మొత్తంగా 1572 మంది షాపులను దక్కించుకునేందుకు టెండర్లు వేశారు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఏబీ ఫంక్షన్‌హాల్లో శనివారం మద్యం షాపులకు టెండర్‌దారుల ఎంపిక ప్రక్రియను ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పెరుమాండ్ల దశరథం ఆధ్వర్యంలో నిర్వహించారు. కలెక్టర్‌ శశాంక స్వయంగా లక్కీడిప్‌ ద్వారా టోకెన్‌లను తీసి మద్యం షాపుల టెండర్‌దారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు. 1వ నంబర్‌ షాపు నుంచి మొదలుకుని 59 షాపుల వరకు స్వయంగా కలెక్టర్‌ టోకెన్‌లను తీసి ఎంపికలు చేశారు. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ ప్రక్రియ మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 4.20 గంటల వరకు అంటే దాదాపు నాలుగు గంటల పాటు ప్రక్రియ కొనసాగగా 59 మంది టెండర్‌దారులను ఎంపిక చేశారు. 


ప్రక్రియ సాగిందిలా...

మహబూబాబాద్‌ ఏబీ ఫంక్షన్‌హాల్లో మొదటగా 1 నుంచి 22 షాపుల వరకు దరఖాస్తుదారులను లోనికి అనుమతించారు. ప్రధాన ద్వారం వద్ద ఎక్సైజ్‌, పోలీసులు దరఖాస్తులకు ఇచ్చిన హాల్‌ టికెట్‌లను చూపించాకనే లోపలికి అనుమతించారు. ఎంపిక ప్రక్రియ జరిగే వేదిక వద్ద కలెక్టర్‌, ఎక్సైజ్‌ అధికారులు, దరఖాస్తుదారులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఎంపిక ప్రక్రియ మొత్తం వీడియో చిత్రీకరణ నడుమ కొనసాగింది. ఒకట్నుంచి 22 షాపుల ఎంపికలు పూర్తయ్యాక 23 నుంచి 48 షాపుల దరఖాస్తుదారులను లోనికి అనుమతించి ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు. అనంతరం ఏజెన్సీ మండలాలు బయ్యారం, గార్లకు చెందిన 49 నుంచి 53 షాపుల వరకు అనంతరం గూడూరు, కొత్తగూడ, గంగారం మండల పరిధిలో ఉన్న 54 నుంచి 59 మద్యం షాపుల వరకు ఎంపికలను పూర్తి చేయడంతో మద్యం షాపుల ఎంపికలు పూర్తయినట్లు ప్రకటించారు. 


నాలుగు గంటల పాటు..

దాదాపు 4 గంటల పాటు ఎన్నికల లెక్కింపు తరహాలోనే అభ్యర్థుల్లా దరఖాస్తుదారులు ఉత్కంఠతకు గురయ్యారు. వారి సంబంధించిన స్నేహితులు, అనుచరులు ఏబీ ఫంక్షన్‌హాల్‌ ఎదుట దాదాపు కిలోమీటర్‌ మేర ఉన్నారు. ఏ ఏ షాపులకు ఎవరు ఎంపికయ్యారు. అందులో తమకు సంబంధించిన వారు ఉన్నారా అని ఆరా తీస్తూ కన్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండ మానుకోట డీఎస్పీ పి.సదయ్య నేతృత్వంలో రూరల్‌ సీఐ రవికుమార్‌, ఎస్సైలు వెంకన్న, సతీష్‌లు బందోబస్తు నిర్వహించారు. 


9 షాపులు మహిళామణులకే..

 జిల్లాలోని 59 షాపుల్లో 9 షాపులు మహిళామణులకే దక్కాయి. మహిళలకు ప్రత్యేకంగా రిజర్వేషన్‌ లేనప్పటికి ఓపెన్‌ కేటగిరిలో టెండర్లు వేసి తొమ్మిది మద్యం షాపులు దక్కించుకోవడం విశేషం. మిగతా షాపులు దక్కించుకున్న వారిలో కూడా అత్యధికంగా యువకులే ఎక్కువగా ఉన్నారు. కొంతమందికి ఒకట్నుంచి మూడు షాపులు దక్కించుకుని ఆనందంతో కన్పించగా మరికొంతమంది 20 షాపులకు దరఖాస్తులు చేసుకున్నప్పటికి ఒక్కటి కూడా దక్కకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. కాగా, 2021–23 ఎక్సైజ్‌ సంవత్సరానికి గాను రిజర్వేషన్‌లు ఉండడంతో మహబూబాబాద్‌ జిల్లాలో 13 గౌడ కులస్తులు, 5 ఎస్సీలు, 12 షాపులను (ఏజెన్సీతో కలిపి) గిరిజనులు దక్కించుకున్నారు. ఒక ఓపెన్‌ కేటగిరిలో ఉన్న 29 షాపుల్లో కూడా కొన్నింటిని వీరు దక్కించుకున్నారు.  కాగా, గతంలో మద్యం షాపులు నడిపిన యాజమానులు కొంతమందికి ఈ సారి అదృష్టం వరించక షాపులు దక్కకపోవడంతో కొత్తగా వచ్చిన వారి షాపుల విక్రయాల కోసం పావులు కదుపుతున్నారు. షాపులు వచ్చిన వారు డిసెంబర్‌ 1 నుంచి కొత్త మద్యం పాలసీ ప్రకారంగా వ్యాపారం నిర్వహించుకుంటారని అధికారులు తెలిపారు.  ఎక్సైజ్‌ సీఐలు రమే్‌షచందర్‌, కృష్ణ పాల్గొన్నారు.









Updated Date - 2021-11-21T05:53:30+05:30 IST