ఉపాధ్యాయుడి హఠాన్మరణం
ABN , First Publish Date - 2021-12-31T05:31:58+05:30 IST
ఉపాధ్యాయుడి హఠాన్మరణం

స్పౌజ్ కౌన్సెలింగ్ ఆలస్యంతోనేనని కుటుంబసభ్యుల ఆరోపణ
మహబూబాబాద్ ఎడ్యుకేషన్, డిసెంబరు 30: మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బానోత్ జేత్‌రామ్ (57) గురువారం గుండెపోటు తో మృతిచెందాడు. ప్రభుత్వం చేపడుతున్న బదిలీల్లో భాగంగా స్పౌజ్ కౌన్సెలింగ్ ఆలస్యంతోనే జేత్‌రామ్ మృతిచెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారి వివరాల ప్రకారం.. మహబూబాబాద్ పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు నెల్లికుదురు మండలం చిన్నముప్పారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో హెచ్‌ఎంగా పనిచేస్తున్నారు. జేత్‌రామ్‌ను ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన బదిలీల్లో అధికారులు మానుకోట జిల్లా నుంచి ములుగు జిల్లాకు కేటాయించారు. రిపోర్టు చేసిన నాటి నుంచి ఆయన మానసికం గా ఆందోళనకు గురవుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, ఆయన సతీమణి జ్యోతి మహబూబాబాద్‌లోనే అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తోంది. అతడికి స్పౌజ్ అవకాశం ఉంటుందని, ఇది ఆలస్యం కావడంతో మనోవేదనకు గురైన జేత్‌రామ్‌కు ఇంటివద్దనే గుండెపోటు వచ్చి మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కు మారులు, కుమార్తె ఉన్నారు. కాగా, మహబూబాబాద్ పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జేత్ రాం 2017 నుంచి నెల్లికుదురు మండలం చిన్నముప్పారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎల్‌ఎ్‌ఫఎల్ హెచ్‌ఎంగా విధులు నిర్వర్తిస్తున్నాడు.
జేత్‌రాం మృతి ప్రభుత్వ హత్యే : టీఎస్ యూటీఎఫ్
జేత్‌రాం మృతి ప్రభుత్వ హత్యేనని టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి మైస శ్రీనివాస్, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మల్లారెడ్డి ఆరోపించారు. ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్తామని ఒక ప్రకటనలో తెలిపారు. స్థానికత ఆధారంగా చేపట్టాల్సి బదిలీలను ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయం లేకుండానే నిరంకుంశగా చేపట్టారని విమర్శించారు. ఉపాధ్యాయుడు జేత్‌రాం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.