‘ధరణి’లో ఒకరి భూమికి మరొకరికి పాస్‌ పుస్తకం

ABN , First Publish Date - 2021-11-26T05:39:07+05:30 IST

‘ధరణి’లో ఒకరి భూమికి మరొకరికి పాస్‌ పుస్తకం

‘ధరణి’లో ఒకరి భూమికి మరొకరికి పాస్‌ పుస్తకం
చికిత్సపొందుతున్న వెంకన్న

విసిగి వేసారి రైతు ఆత్మహత్యాయత్నం

చావుబతుకుల మధ్య రైతు 

నాలుగు నెలల క్రితం రైతు తల్లి మృతి

కేసముద్రం, నవంబరు 25 : భూములకు సులభతరంగా రిజిస్ట్రేషన్లు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ధరణి’లో రెవె న్యూ అధికారుల తప్పిదం వల్ల ఒక రైతు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. తమ భూమిని మరొకరికి పట్టా పాస్‌పుస్తకం జారీ చేశారని, దీన్ని సరిచేయాలని అధికారుల చుట్టూ నెల ల తరబడి తిరిగినా ఫలితం లేకపోవడంతో మనస్థాపంతో రైతు క్రిమిసంహారక మందు తాగిన ఘటన కేసముద్రం మండలం ఇనుగుర్తిలో చోటు చేసుకుంది. బాధిత రైతు మేడిద వెంకన్న ప్రస్తుతం మహబూబాబాద్‌ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఆయన భార్య శైలజ, కుమార్తె మేఘన తెలిపిన వివరాల ప్రకారం.. వెంకన్న తండ్రి అంతయ్య పేరిట ఇనుగుర్తిలో సర్వే నంబర్‌ 120లో 3.39 ఎకరాల భూమికి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన పట్టాదారు పాస్‌పుస్తకం ఉంది. 2017లో తెలంగాణ ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన పట్టా పాస్‌పుస్తకంలో 2.17 ఎకరాలే నమోదైంది. మిగిలిన 1.22 ఎకరాల భూమి తౌర్యాతండా పరిధిలోని ముత్యాలమ్మతండాకు చెందిన మరొకరి పేరిట పాస్‌పుస్తకం జారీ అయింది. అంతయ్యకు ఒకే కుమారుడు వెంకన్న. వెంకన్నకు ఒకే కుమార్తె మేఘన ఉండడంతో తనకు వారసత్వంగా రానున్న భూమిలో కూ తురు మూడెకరాలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు తమ భూమి పూర్తిగా 3.39 ఎకరాలకు పట్టాపా్‌సపుస్తకాన్ని జారీ చేయాలని తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ ఎనిమిది నెలలుగా వెంకన్న తిరుగుతున్నాడు. అయినప్పటికీ ధరణిలో ఎడిట్‌ ఆప్షన్‌ లేదని, ఎవరి పేరున అయితే తప్పుగా పట్టాపా్‌సపుస్తకం వచ్చిందో వారి నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని అధికారులు సలహా ఇచ్చారు. ఇదే మండలంలోని తౌర్యాతండా జీపీ పరిధిలో ముత్యాలమ్మతండాలోని సదరు రైతు వద్దకు వెళ్లి కోరగా వారు తిరస్కరించారు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన వెంకన్న బుధవారం సాయంత్రం క్రిమిసంహారక మందు తాగాడు. విషయం తెలుసుకున్న ఆయన్ను మహబూబాబాద్‌ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదే సమస్యతో వెంకన్న తల్లి ప్రమీల నాలుగు నెలల క్రితం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఇప్పటికైనా తమ భూమికి పట్టా ఇప్పించాలని కుటుంబ సభ్యులు అధికారులను కోరుతున్నారు.

 

Updated Date - 2021-11-26T05:39:07+05:30 IST