విస్తారంగా వర్షాలు

ABN , First Publish Date - 2021-07-12T05:35:18+05:30 IST

విస్తారంగా వర్షాలు

విస్తారంగా వర్షాలు
మహబూబాబాద్‌ జిల్లాలో అలుగుపారుతున్న భూపతిపేట తుమ్మలచెరువు
జిల్లాలో అలుగు పారుతున్న చెరువులు

ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు 

జలాశయాలకు జలకళ  

జాలువారుతున్న భీముని జలపాతం


మహబూబాబాద్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి) : మహబూబాబాద్‌ జిల్లాలో శనివారం రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తూన్నాయి. జిల్లాలోని కొత్తగూడ, గంగారం, గూడూరు, పెద్దవంగర, తొర్రూరు, నెల్లికుదురు మండలాల్లో శని, ఆదివారం భారీ వర్షం కురిసింది. బయ్యారం, గార్ల, కురవి, డోర్నకల్‌, మరిపెడ, చిన్నగూడూరు, నర్సింహులపేట, దంతాలపల్లి, కేసముద్రం, మహబూబాబాద్‌ మండలాల్లో ఓ మోస్తారు వర్షం కురిసింది. గూడూరు మండలంలోని చెరువులు అలుగులు పారుతుండడంతో భీమునిపాదం జలపాతం జాలువారుతోంది. గూడూరు–నెక్కొండ మధ్య ఉన్న పాకాలవాగు పొంగి ప్రవహిస్తుండడంతో రహదారిపై నీరు ప్రవహించి రాకపోకలు స్తంభించాయి. కొత్తగూడ, గంగారం, నర్సింహులపేటలలో వాగుల్లోని చెక్‌డ్యాంలు, ఆనకట్టపై నుంచి నీరు ప్రవహిస్తోంది.  


జిల్లా వ్యాప్తంగా వాగులు పొంగుతుండండతో చెరువుల్లోకి భారీగా నిరుచేరుతోంది. వరదనీరు పొలాల్లోకి భారీగా చేరింది. తొర్రూరు పట్టణానికి సమీపంలోని దారావత్‌ వెంకన్న అనే రైతు పొలం పనులు ముగించుకుని దుక్కిటెద్దులతో ఇంటికి తిరిగి వెళ్తుండగా కాలిబాట పక్కనే ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి విద్యుత్‌ సరఫరా జరిగి దుక్కిటెద్దు  మృతి చెందింది. రూ.60 వేల విలువైన దుక్కిటెద్దు మృతి చెందడంతో రైతు వెంకన్న రోదించసాగాడు.  మూడ్రోజులుగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి మళ్లీ వర్షం కురిస్తే జిల్లాలోని వివిధ చెరువులు, వాగులు పొంగి ప్రవహించే అవకాశం ఉంది. నర్సింహులపేట మండలంలోని ఆకేరువాగు అనకట్టపై నుంచి కూడ నీరు ప్రవహిస్తోంది.  చెరువులు మత్తడి పోస్తుండడంతో చేపల కోసం ప్రజలు వలలు పట్టుకుని చేపల వేటలో నిమగ్నమయ్యారు. 


220.8 మిల్లీ మీటర్ల వర్షపాతం ..

జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటలకు 220.8 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో సగటున 18.4 మిల్లిమీటర్ల వర్షపా తం నమోదైంది. బయ్యారం, గూడూరు, మహబూబాబాద్‌, కొత్తగూడ, గార్ల, నర్సింహులపేట మండలాల్లో భారీ నుంచి మోస్తారు వర్షం కురిసింది. కొత్తగూడ లో 28.2 మిల్లిమీటర్లు, బయ్యారంలో 66.4, గార్లలో 14.4, డోర్నకల్‌లో 3.6, కురవిలో 13.2, మహబూబాబాద్‌లో 36.4, గూడూరులో 39.0, కేసముద్రంలో 2.2, నెల్లికుదురులో 1.6, నర్సింహులపేటలో 10.4, మరిపెడలో 4.2, తొర్రూరులో 1.2మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు కాగా, పెద్దవంగర, దంతాలపల్లి, చిన్నగూడూరు, గంగారం మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 

Updated Date - 2021-07-12T05:35:18+05:30 IST