ఊరు ఊరునే ‘అడవి’ని చేస్తారా!?

ABN , First Publish Date - 2021-08-20T05:47:40+05:30 IST

ఊరు ఊరునే ‘అడవి’ని చేస్తారా!?

ఊరు ఊరునే ‘అడవి’ని చేస్తారా!?

వెయ్యి మంది రైతులకు పట్టాలు రాకుండా చేశారు..

‘ధరణి’ని మార్చకపోతే కేసీఆర్‌ను మార్చాలి

టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌

కేసముద్రం, ఆగస్టు 19 : అధికారులు, అధికార పార్టీ నాయకులు కలిసి నారాయణపురం గ్రామంలోని భూములను అటవీశాఖలోకి మార్చి అడవిగా మార్చారని కాంగ్రెస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ ఆరోపించారు.  కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో గురువారం సాయంత్రం ఆయనతోపాటు ఆదివాసీ ఏఐసీసీ జాతీయ ఉపాధ్యక్షుడు తేజావత్‌ బెల్లయ్యనాయక్‌, ఇతర నాయకులతో కలిసి గ్రామంలోని రైతుల భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా అద్దంకి దయాకర్‌ మాట్లాడారు. గ్రామం మొత్తాన్ని అటవీశాఖ పరిధిలో చేర్చి సుమారు వెయ్యి మంది రైతులకు పట్టాలు రాకుండా చేశారని తెలిపారు. కాంగ్రెస్‌, టీడీపీ హయాంలో 12లక్షల ఎకరాల భూములను పేదలకు పంచగా వాటిని లాక్కునేందుకు ప్రభుత్వం భూదందా చేస్తోందని ఆరోపించారు. మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక తిరిగి భూములను పేదలకు పంచుతామని తెలిపారు. రెవెన్యూ రికార్డుల్లో అనుభవదారు కాలం తొలగించి రాష్ట్రంలో వేలాది మంది రైతులకు పట్టాలు రాకుండా చేశారని ఆరోపించారు. నారాయణపురంతోపాటు రాష్ట్రంలో అనేక మంది రైతులు పట్టాల కోసం తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎస్‌ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. 

పట్టా భూమిని అటవీభూమిగా ఎందుకు మార్చారు?

నారాయణపురంలో 1959 నుంచి 2017 వరకు ఉన్న పట్టా భూమిని అకస్మాత్తుగా అటవీశాఖలోకి ఎవరు మార్చారు, ఎందుకు మార్చారనేది తేలాలని ఆదివాసీ ఏఐసీసీ జాతీయ ఉపాధ్యక్షుడు తేజావత్‌ బెల్లయ్యనాయక్‌ డిమాండ్‌ చేశారు. ధరణి వచ్చిన సాదాబైనామాలో గ్రామస్థులు దరఖాస్తు చేసుకోకపోతే పాతపట్టాలన్నీ అలాగే ఉంటూ కొత్తపట్టాలుగా మార్చాలని అంతేకాని భూమిని అటవీశాఖలోకి ఎందుకు మార్చారని ప్రశ్నించారు. దొంగతనంగా భూములు కాజేసే కుట్రజరుగుతోందని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ ఏం చేస్తున్నారు? పట్టాలిప్పించే బాధ్యత లేదా? సర్వేయర్‌ వస్తే అధికార పార్టీ నాయకులే అడ్డుపడుతున్నారని ఆరోపించారు. రెండునెలల క్రితం సర్వే పూర్తవగా ఇప్పటి వరకు నివేదిక ఇవ్వలేదని, 180 ఎకరాల భూమిని సర్వే చేయకుండా కాజేసేందుకు దొంగలముఠాగా మారి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇక్కడి ఎమ్మెల్యే, మంత్రి అండతో కుట్ర జరుగుతోందని ప్రజలు చెబుతున్నారని అన్నారు. 15 రోజుల్లో పట్టాలివ్వాలని, వాళ్ల భూములు వాళ్లకు ఇచ్చేందుకు కూడా రాజకీయ నాయకులు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ధరణి వల్ల పట్టాపాస్‌ పుస్తకాలు రాకపోవడంతో తహసీల్దార్‌ స్థాయిలో చేయాల్సిన పనులను కలెక్టర్‌, సీఎస్‌ వరకు వెళ్లాల్సివస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నారాయణపురం గ్రామానికి వచ్చి చూస్తే ఇక్కడి రైతులు పడే బాధలు తెలుస్తాయని అన్నారు. నాలుగేళ్లుగా పట్టాలు లేక వెయ్యి మంది రైతులు రైతుబంధు, రైతుబీమా కోల్పోయారని తెలిపారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు గుగులోత్‌ దస్రూనాయక్‌, టీఎంఎం రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్‌, ఎమ్మార్పీఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి గుగ్గిళ్ల పీరయ్య, కేయూ జేఏసీ నాయకుడు వినోద్‌నాయక్‌, ఎల్‌హెచ్‌పీఎ్‌స జాతీయ ప్రధాన కార్యదర్శి గుగులోత్‌ హరినాయక్‌, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్‌, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు మేకల వీరన్నయాదవ్‌, కిసాన్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు తోట వెంకన్న, మాజీ జడ్పీటీసీ హెచ్‌.వెంకటేశ్వర్లు, ప్రజాసంఘాలు, తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-08-20T05:47:40+05:30 IST