ప్లాస్టిక్‌ వినియోగాన్ని నియంత్రిద్దాం

ABN , First Publish Date - 2021-12-16T05:17:53+05:30 IST

ప్లాస్టిక్‌ వినియోగాన్ని నియంత్రిద్దాం

ప్లాస్టిక్‌ వినియోగాన్ని నియంత్రిద్దాం
సమావేశంలో మాట్లాడుతున్న మేయర్‌ సుధారాణి

వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి 


ఏకశిలనగర్‌, (వరంగల్‌)డిసెంబరు 15: మహిళలు తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదని మహిళల చైతన్యం ద్వారా ప్లాస్టిక్‌ వాడకాన్ని నియంత్రిద్దామని నగర మేయర్‌ గుండు సుధారాణి పిలుపునిచ్చారు. స్వచ్ఛ సర్వేక్షన్‌-2022లో భాగంగా ప్లాస్టిక్‌ నిర్మూలనపై బుధవారం 40వ డివిజన్‌లో స్థానిక కార్పొరేటర్‌ మరుపల్ల రవి ఆధ్వర్యంలో చైతన్య ర్యాలీ, అవగాహన సదస్సును నిర్వహించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు ప్లకార్డులు చేతబూని కరీమాబాద్‌ రామస్వామి గుడి నుంచి ఉర్సు సీఆర్‌సీ సెంటర్‌ వరకు జరిగిన ర్యాలీలో మేయర్‌ సుధారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నామోజు కళాజాత బృందం నిర్వహించిన ఆటాపాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం సీఆర్‌సీలో జరిగిన సదస్సులో గుండు సుధారాణి మాట్లాడుతూ.. సమష్టి కృషితోనే ప్లాస్టిక్‌ వాడకాన్ని నియంత్రించవచ్చని తెలిపారు. ప్లాస్టిక్‌ హోల్‌సేల్‌ వ్యాపారులతో తాము సమావేశం ఏర్పాటు చేసి 75 మైక్రాన్‌ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్‌ ఉత్పత్తులను విక్రయించొద్దని ఆదేశించామని తెలిపారు. ప్రజలు కూడా 75 మైక్రాన్‌ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్‌ వస్తువులను కొనుగోలు చేయొద్దని కోరారు. ఇలాంటి ఉత్పత్తులు భూమిలో కలిసిపోవడానికి లక్షల ఏళ్లు పడుతుందని తెలిపారు. ప్లాస్టిక్‌ ఉత్పత్తులకు బదులుగా కాగితపు, జ్యూట్‌ బ్యాగులను వాడాలని కోరారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ మరుపల్ల భాగ్యలక్ష్మి, ఎంహెచ్‌వో డాక్టర్‌ రాజారెడ్డి, ఇన్‌చార్జి పీడీ రేణుక, శానిటరీ సూపర్‌వైజర్లు నాగభూషణం, మధుకర్‌, సాంబయ్య, రమేష్‌, అలీ పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-16T05:17:53+05:30 IST