భారీగా పడిపోయిన పాజిటివ్‌ రేటు

ABN , First Publish Date - 2021-02-03T08:17:02+05:30 IST

రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. గత పక్షం రోజులుగా రోజుకు 250లోపు కేసులు నమోదవుతున్నాయి. గత పదిహేను రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 5,15,669 కొవిడ్‌ టెస్టులు చేయగా 3621 పాజిటివ్‌లు

భారీగా పడిపోయిన పాజిటివ్‌ రేటు

జనవరిలో 0.83%.. నెలనెలా తగ్గుదల

మెజారిటీ జిల్లాల్లో 10 లోపే కేసులు

గద్వాల, నారాయణపేట్‌లో వారంగా జీరో 

15 రోజులుగా రోజుకు 250 లోపే.. 

కొత్తగా 152, యాక్టివ్‌ కేసులు 2022..2.94 లక్షలకు చేరిక


హైదరాబాద్‌, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. గత పక్షం రోజులుగా రోజుకు 250లోపు కేసులు నమోదవుతున్నాయి. గత పదిహేను రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 5,15,669 కొవిడ్‌ టెస్టులు చేయగా 3621 పాజిటివ్‌లు మాత్రమే వచ్చాయి. జనవరిలో రాష్ట్రంలో పాజిటివ్‌ రేటు 0.83 శాతంగా నమోదైనట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం రోజుకు సగటున 34వేలకు పైగా కొవిడ్‌ టెస్టులు చేస్తున్నారు. అందులో సగటున రోజుకు 240 వరకు పాజిటివ్‌లు నమోదవుతున్నాయి. ఒకప్పుడు ఉగ్రరూపాన్ని చూపించిన మహమ్మారి ప్రభావం మెల్లమెల్లగా తగ్గుతోందని, అందుకు రాష్ట్రవ్యాప్తంగా అయా జిల్లాల్లో నమోదవుతున్న కేసులే నిదర్శనమని వైద్య వర్గాలు అంటున్నాయి. కొద్ది రోజులుగా మెజారిటీ జిల్లాల్లో పదిలోపే కేసులు నమోదవుతున్నాయి. ఓ ఐదారు జిల్లాల్లోనైతే ఒక్క పాజిటివ్‌ కూడా నమోదు కావడం లేదు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో మాత్రమే రెండెంకల్లో కేసులు ఉంటున్నాయి. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ పదిలోపే పాజిటివ్‌లు వస్తున్నాయి. గద్వాల, నారాయణపేట్‌  జిల్లాలోనైతే వారం రోజులుగా ఒక్క కేసూ నమోదు కాకపోవడం గమనార్హం.  


భూపాలపల్లి జిల్లాల్లో గత ఏడు రోజుల్లో నాలుగు రోజులు జీరో కేసులు రాగా, మిగిలిన మూడు రోజుల్లో 11 పాజిటివ్‌లు నమోదయ్యాయి. ఒకప్పుడు భారీగా కేసులు నమోదైన కరీంనగర్‌ జిల్లాల్లో కూడా వారం రోజులుగా  69 కేసులే వచ్చాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో వారం రోజులుగా వచ్చిన కేసుల సంఖ్య  222 మాత్రమే. రాష్ట్రంలో ప్రతి నెలా కొవిడ్‌ పాజిటివ్‌ రేటు తగ్గుతూ వస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో సెకండ్‌ వేవ్‌ భయపెట్టినా మన దగ్గర మాత్రం వైరస్‌ ప్రభావం కనిపించలేదు. తెలంగాణలో తొలి కేసు నిరుడు మార్చి 2న నమోదవ్వగా, అదే నెల 14 నుంచి మంగళవారం (ఫిబ్రవరి 2) వరకు  ప్రతి రోజు కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. గత ఏడాది మార్చి నుంచి రాష్ట్రంలో కరోనా వ్యాప్తి రేటు పెరుగుతూనే వచ్చింది. జూలై వరకు పెరిగి అనంతరం తగ్గుతూ వచ్చింది. జూన్‌లో వైరస్‌ వ్యాప్తి రేటు 21.73 శాతంగా నమోదై రికార్డు సృష్టించింది. అనంతరం ప్రతి నెలా తగ్గుతూ ప్రస్తుతం 0.83కి చేరింది. 


వైరస్‌తో ఒకరు మృతి

రాష్ట్రంలో కొత్తగా మరో 152 మందికి కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 2,94,739కు పెరిగింది. వైరస్‌ కారణంగా ఒకరు చనిపోవడంతో మరణాల సంఖ్య 1602కు చేరింది. సోమవారం మరో 221 మంది డిశ్చార్జ్‌ కావడంతో కోలుకున్న వారి సంఖ్య 2,91,115కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2022 యాక్టివ్‌ కేసులున్నాయి.  గ్రేటర్‌ హైదరాబాద్‌లో 29 రంగారెడ్డిలో 11 కేసులు వచ్చాయి.


నెల వ్యాప్తి రేటు

మార్చి 8.92

ఏప్రిల్‌ 5.2

మే 14.87

జూన్‌ 21.73

జూలై 13.06

ఆగస్టు 6.56

సెప్టెంబరు 4.05

అక్టోబరు 3.65

నవంబరు 2.57

డిసెంబరు 1.15

జనవరి 0.83

Updated Date - 2021-02-03T08:17:02+05:30 IST