మలుపుతిప్పిన ‘మానుకోట’
ABN , First Publish Date - 2021-05-28T06:21:30+05:30 IST
తెలంగాణ ఉద్యమ హోరులో..
సీమాంధ్ర నేతల కాల్పులు- ఉద్యమకారుల రాళ్ల దాడి ఘటనకు 11 ఏళ్లు
జగన్ ఓదార్పు యాత్ర కు నిరసనగా కదంతొక్కిన తెలంగాణ సమాజం
నెత్తురోడిన మహబూబాబాద్ రైల్వే స్టేషన్
‘మహిమ గల్ల రాళ్లు’ అంటూ స్ఫూర్తిగా తీసుకున్న ఉద్యమం
తెలంగాణ వీరోచిత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిదగిన అధ్యాయం
ఆంధ్రజ్యోతి, మహబూబాబాద్: తెలంగాణ ఉద్యమ హోరులో మానుకోట యువత చిందించిన రక్తం, గర్జించిన సమైక్య పిస్టళ్లకు కంకరరాళ్లతో ఎదురొడ్డిన తెలంగాణ వాదుల అసమాన గుండె ధైర్యం వెరసి తెలంగాణ సాధనోద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన 28 మే 2010 ఘటనకు నేటితో పదకొండేళ్లు. సరిగ్గా 11ఏళ్ల క్రితం ఇదే మండుటెండల్లో మానుకోట ప్రతిఘటన చోటు చేసుకుంది. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో అదొక మైలురాయి. తెలంగాణ ఆత్మగౌరవానికి నిలువెత్తు సాక్ష్యం. సమైక్యవాదులకు ఒక శాశ్వత హెచ్చరిక. సీమాంధ్ర ధన దురహంకారానికి పెను సవాలు. కట్ చేస్తే.... 2010 మే 16న జగన్ ఓదార్పు యాత్ర మానుకోట ద్వారా తెలంగాణలో కాలుమోపుతామని ప్రకటన చేశారు. అంతే పార్లమెంటులో సమైక్య ప్లకార్డు ప్రదర్శించిన జగన్ను తెలంగాణలోకి కాలు మోపనివ్వమని రాజకీయ జేఏసీతో పాటు టీఆర్ఎస్, న్యూడెమోక్రసీ, ఓయూ, కేయూ, న్యాయవాద జేఏసీలు ప్రకటించాయి. అనంతరం 17న జగన్ దిష్టిబొమ్మల దహనంతో ఆరంభమైన ఉద్యమం 27 వరకు తీవ్రస్థాయికి చేరుకుంది.
2010 మే 28 టెన్షన్.. టెన్షన్..
28న జగన్ పర్యటనను అడ్డుకోవడానికి రాజకీయ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం, ఢిల్లీ నుంచి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు ఎం.రాజేందర్, న్యాయవాద జేఏసీ కన్వీనర్ నల్లపు ప్రహ్లాద్, ప్రస్తుత మంత్రులు తన్నీరు హరీష్రావు, ఈటల రాజేందర్, బీజేపీ నేత గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, ఓయూ, కేయూ జేఏసీ, న్యూడెమోక్రసీ నేతలు మానుకోటకు చేరారు. జగన్ను స్వాగతించేందుకు అప్పటి ఎమ్మెల్యేలు కొండా సురేఖ, మాలోతు కవిత, ఎమ్మెల్సీలు కొండా మురళి, పుల్లా పద్మావతి, మాజీ మంత్రి రెడ్యా, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి తమ అనుచరులతో మానుకోట రైల్వే స్టేషన్ వెయిటింగ్ రూంలో మోహరించారు. ఇంకేముంది మానుకోటలో టెన్షన్.. అటెన్షన్..!
నిప్పులు కక్కిన పిస్టల్స్... తిరగబడ్డ రాళ్లు...
మానుకోట రైల్వే స్టేషన్ సమైక్యవాదులు-తెలంగాణ వాదుల మధ్య సమరానికి వేదికగా మారింది. వెయిటింగ్ రూమ్లో అంగరక్షకులతో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, అనుచరులకు తెలంగాణవాదుల నిరసన సెగలు తాకాయి. జై తెలంగాణ నినాదాలతో ఉద్యమకారుల హోరును తట్టుకోలేకపోయిన సమైక్యవాదులు గిల్లికజ్జాలు పెట్టినట్లు రెచ్చగొట్టారు. బయట పట్టణంలో చుట్టుపక్క నియోజకవర్గాల ప్రజలు ఇసుకవేస్తే రాలని తరహాలో వీధుల్లో నిండిపోయారు. అదే సమయంలో రైల్వేస్టేషన్ వెయిటింగ్ రూం నుంచి పిస్టల్స్ నిప్పులు కక్కాయి. కాంగ్రెస్ నేతల అనుచరులు సైతం కట్టెలు, రాళ్లతో తెలంగాణవాదులపైకి దుమికారు. తెలంగాణవాదులు వెనక్కి తగ్గలేదు. పిస్టల్ గుళ్లకు ఎదురొడ్డుతూ రైల్వే లైన్పై ఉన్న కంకరరాళ్లను తూటాలుగా మలుచుకుని ఎదురుదాడికి దిగారు. రణరంగంగా మారింది. పరస్పర దాడుల్లో అంగరక్షకుల కాల్పులకు 15 మంది తెలంగాణ వాదులు, రాళ్ల దెబ్బలతో 25 మంది గాయపడ్డారు.
మానుకోట రాళ్ల స్ఫూర్తితో...
మానుకోటలో సమైక్యవాదుల అంగరక్షకుల పిస్టల్ తూటాలకు జవాబిచ్చిన రైల్వే స్టేషన్లో ఉన్న కంకర రాళ్లను యావత్ తెలంగాణ వాదులు మహిమగల రాళ్లుగా కీర్తించారు. కళ్లకు అద్దుకుని ముద్దాడారు. వరంగల్ తెలంగాణ వాదులు మానుకోట రైల్వే స్టేషన్ రాళ్లకు పూజలు నిర్వహించి అతిపవిత్రంగా తీసుకువెళ్లి ప్రధాన కూడలిలో ప్రతిష్ఠించుకున్నారు. ప్రముఖ కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ అనేక వేదికలపై ‘ఎప్పుడైనా ధైర్యం సన్నగిల్లినప్పుడు, ఉద్యమం వెనక్కి తగ్గుతుంది అన్పించినప్పుడు మానుకోట రాళ్లను గుర్తుకు తెచ్చుకోండి, ఒక్కసారి వాటిని కళ్లకు అద్దుకుని హృదయానికి తాకించుకోండి. ఆ వెంటనే ఎక్కడ లేని ఉద్యమ స్ఫూర్తి, ధైర్యం మిమ్మల్ని ఉత్తేజ పరుస్తుంది’ అంటూ కితాబిచ్చాడు.
గళాలు విప్పిన కలాలు...
వరంగల్ జర్నలిస్టుల ఫోరం తరపున ‘తెలంగాణ అక్షరాళ్లు’ పేరిట ముద్రించిన ఉద్యమ సంఘటన సంపుటిలోనూ మానుకోట రాళ్లదాడి స్ఫూర్తి స్పష్టంగా కలాల ద్వారా గళం విప్పింది. తెలంగాణ జేఏసీ ప్రచురించిన ‘మానుకోట 28మే 2010’ పుస్తకం కూడా సమైఖ్యవాదుల దాడిని బహిర్గతం చేసింది. అనేక మంది కవులు, రచయితలు మానుకోట రాళ్లదాడిని పదేపదే స్మరిస్తూ కవితలు, ఉపోద్ఘాతాలు రాశారు. ప్రధాన పత్రికలు సైతం పతాక శీర్షికనే కాకుండా తెలంగాణ ఉద్యమానికి ప్రాధాన్యతనిచ్చే అంశాల్లో మానుకోట రాళ్లదాడిని ప్రస్తావించాయి.