మహిళలకు ‘మహిళా కమిషన్‌’ అండగా ఉంటుంది

ABN , First Publish Date - 2021-10-29T23:51:02+05:30 IST

మహిళల పట్ల వివక్ష, లైంగిక దాడులకు పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకునేవిధంగా మహిళా కమిషన్‌ అండగా ఉంటుందని తెలంగాణ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు

మహిళలకు ‘మహిళా కమిషన్‌’ అండగా ఉంటుంది

హైదరాబాద్‌: మహిళల పట్ల వివక్ష, లైంగిక దాడులకు పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకునేవిధంగా మహిళా కమిషన్‌ అండగా ఉంటుందని తెలంగాణ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. మహిళలు ధైర్యంగా ముందుకు రావాలని, అలాంటి వారికి కమిషన్‌ భద్రత కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. సమాజంలో మహిళల పట్ల వివక్ష, దాడులు, అన్యాయాలపై వారికి అవగాహన కల్పించేందుకు జాతీయ మహిళా కమిషన్‌ సహకారంతో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ శుక్రవారం బిర్లా ఆడిటోరియంలో సెమినార్‌ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మహిళలపై అనైతిక చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయ సలహాలు అందిస్తామన్నారు. 


లింగ నిర్ధారణ చేసే క్లినిక్‌లపై చర్యలు తీసుకుంటామన్నారు. మహిళల అభ్యున్నతి కోసం రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఇలాంటి అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెట్రోపాలిటన్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యదర్శి రాధాకి జైస్వాల్‌, సిటీ సివిల్‌ కోర్టు లీగల్‌ సర్వీస్‌ అథారిటీ కార్యదర్శి మురళీ మోహన్‌ ఈ సెమినార్‌లో మహిళల సంరక్షణ, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలుచేశారు. అలాగే మహిళా చట్టాలపై అవగాహనకల్పించారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్‌ సభ్యులు షహీన్‌ అఫ్రోజ్‌, కుమ్ర ఈశ్వరిబాయి, కొమ్ముఉమాదేవి యాదవ్‌, గద్దల పద్మ, సుదాంలక్ష్మి, కటారి రేవతిరావు, మహిళా కమిషన్‌ కార్యదర్వి సునంద తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-29T23:51:02+05:30 IST