లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

ABN , First Publish Date - 2021-12-25T07:55:32+05:30 IST

కన్నూమిన్నూ కానకుండా లారీని నడిపిన ఓ డ్రైవర్‌ నిర్లక్ష్యానికి

లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యానికి  నిండు ప్రాణం బలి

  • ఏబీఎన్‌ జర్నలిస్టును ఢీ కొట్టిన భారీ లారీ
  • అక్కడికక్కడే కన్నుమూసిన మధుసూదన్‌


బేగంపేట, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): కన్నూమిన్నూ కానకుండా లారీని నడిపిన ఓ డ్రైవర్‌ నిర్లక్ష్యానికి మూల్యం.. మరో మనిషి నిండు ప్రాణం. కర్నూలు జిల్లాలోని డోన్‌ ప్రాంతానికి చెందిన ఓతూరి మధుసూదన్‌(29), ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఇంటర్నెట్‌ డెస్క్‌లో సబ్‌-ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. రోజూలాగానే శుక్రవారం ఉదయం 6.30 గంటలకు సీతాఫల్‌మండి నుంచి బైక్‌పై జూబ్లీహిల్స్‌లో ఉన్న ఏబీఎన్‌ కార్యాలయానికి బయలుదేరారు. బేగంపేట మహిళా డిగ్రీ కళాశాల వద్దకు వచ్చేసరికి రాజస్థాన్‌కు చెందిన పది చక్రాల లారీ(ఆర్‌జె11జిబి 8494) వెనుకవైపుగా వచ్చి మధుసూదన్‌ను బైక్‌ను బలంగా ఢీకొట్టింది. కిందపడిన అతడిని సుమారు 10మీటర్ల మేర ఈడ్చుకుంటూ వెళ్లిపోయింది. దీంతో ఆయన అక్కడికక్కడే కన్నుమూశారు. ప్రమాదం తర్వాత లారీని అక్కడే ఆపేసి డ్రైవర్‌ పరారయ్యాడు.


స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని మధుసూదన్‌ మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. మధుసూదన్‌కు రెండేళ్ల క్రితం సంధ్యాయమునతో వివాహమైంది. తల్లిదండ్రులకంటే ప్రేమగా చూసుకుంటున్న భర్త ఇక లేరంటూ గుండెలవిసేలా రోదిస్తున్న ఆ ఇల్లాలిని ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. బేగంపేట ప్రధాన రహదారిలో వారం రోజులుగా రోడ్డు పనులు జరుగుతున్నాయి. కొత్త రోడ్డు వేసేందుకు ఇప్పటికే ఉన్న రోడ్డును తవ్వేశారు. మధుసూదన్‌ నెమ్మదిగా వెళ్తున్న క్రమంలోనే లారీ వేగంగా వచ్చి ఢీకొట్టినట్లు తెలుస్తోంది. 


Updated Date - 2021-12-25T07:55:32+05:30 IST