వినియోగదారుడిపై లాక్‌డౌన్‌ ట్యాక్స్‌

ABN , First Publish Date - 2021-05-21T09:15:01+05:30 IST

ఒక మోటార్‌బైక్‌ టైర్‌ ధర ఎంత? సాధారణంగా ఎమ్మార్పీపై రూ. 1,600 దాకా ఉంటుంది. కానీ, ఇటీవల ఓ టైర్ల దుకాణంలో వాటి ధరలను రూ. 2,500కు పెంచేశారు.

వినియోగదారుడిపై  లాక్‌డౌన్‌ ట్యాక్స్‌

ఏకపక్షంగా వ్యాపారుల నిర్ణయం..

అడ్డంగా ధరలు పెంచేసిన వైనం

ఎమ్మార్పీని మించి విక్రయాలు

పట్టింపే లేని అధికార వర్గాలు


హైదరాబాద్‌ సిటీ, మే 20 (ఆంధ్రజ్యోతి): ఒక మోటార్‌బైక్‌ టైర్‌ ధర ఎంత? సాధారణంగా ఎమ్మార్పీపై రూ. 1,600 దాకా ఉంటుంది. కానీ, ఇటీవల ఓ టైర్ల దుకాణంలో వాటి ధరలను రూ. 2,500కు పెంచేశారు. సిగరెట్‌ ధరలైతే దాదాపుగా 150ు పెరిగాయి. ఇక నిత్యావసర వస్తువుల ధరలకు ఏకంగా రెక్కలొచ్చాయి. పది రోజుల క్రితం రూ. 130కి కిలో కందిపప్పు వచ్చేది. ఇప్పుడు రూ. 20 దాకా పెంచి విక్రయిస్తున్నారు. రూ. 15కు కిలోగా ఉండే ఉల్లి.. ఇప్పుడు రూ. 25కు చేరుకుంది. ఇదీ అదీ అని కాకుండా.. అన్ని రకాల వస్తువుల ధరలు గత 10 రోజులుగా పెరిగిపోయాయి. ఇందుకు ప్రధాన కారణం.. వ్యాపారులే..! లాక్‌డౌన్‌ పేరుతో వారు ఎడాపెడా ధరలు పెంచి, విక్రయాలు జరుపుతున్నారు.


ప్రస్తుతం లాక్‌డౌన్‌లో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు వెసులుబాటు ఇవ్వడంతో.. వ్యాపారులు వారిని అడ్డంగా దోచుకుంటున్నారు. ప్రతి వస్తువు ధరను 10% నుంచి 50% వరకు పెంచేశారు. అదేమని కస్టమర్లు నిలదీస్తే.. ‘‘హోల్‌సేలర్లు మాకు కూడా ఎక్కువ ధరకే అమ్ముతున్నారు. మేమెవరికి చెప్పుకోవాలి?? కొంటే కొనండి.. లేకుంటే లేదు..’’ అని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. లాక్‌డౌన్‌ను సాకుగా చూపుతున్నారు. కొన్నిచోట్ల ఏకంగా ఎమ్మార్పీని మించి విక్రయాలు జరుపుతున్నారు. సబ్బులు, షాపూలు, నూనెలు వంటి వస్తువులకు గరిష్ఠ చిల్లర ధర(ఎమ్మార్పీ)పై రూ. 2 నుంచి రూ. 10 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. నిజానికి వంట నూనెలు హోల్‌సేల్‌లో ఎమ్మార్పీ కంటే రూ. 10 నుంచి రూ.20 తక్కువకే లభిస్తాయి. రిటైలర్లు వాటిపై రూ. 5 నుంచి రూ. 10 వరకు మార్జిన్‌ చూసుకుని, ఎమ్మార్పీ కంటే తక్కువకే విక్రయిస్తారు. కానీ, లాక్‌డౌన్‌ తర్వాత.. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు అమ్మకాలు జరుపుతున్నారు. ఓ రకంగా.. లాక్‌డౌన్‌ ట్యాక్స్‌ను అనధికారికంగా విధిస్తున్నారు. దీంతో.. పేద, మధ్యతరగతి ప్రజలు విలవిలలాడుతున్నారు.


ఇవీ.. కొన్ని ఉదాహరణలు..

ద్విచక్ర వాహనాల్లో వినియోగించే ఇం జన్‌ ఆయిల్‌ ధరలు రూ. 250 దాకా ఉంటాయి. వ్యాపారులు వాటిపై రూ. 10 నుంచి రూ. 30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.

చిన్న పిల్లల డైపర్లు, వారి ఆట వస్తువుల ధరలు రిటైల్‌ మార్కెట్లలో దాదా పు రెట్టింపయ్యాయి.

బేకరీ, మిఠాయి దుకాణాల్లోనూ ధరలను పెంచేశారు. కిలో స్వీట్‌పై రూ. 100 నుంచి రూ. 200మేర పెరిగాయి.

ఉల్లిగడ్డ ధరలు అకస్మాత్తుగా పెరిగిపోయాయి. రూ. 10 నుంచి రూ. 15 వర కు దిగిన ధర.. లాక్‌డౌన్‌లో రూ. 20- రూ. 30 మధ్యలో కొనసాగుతోంది.

సబ్బులు, డిటర్జెంట్లు, వాషింగ్‌ పౌడర్ల ధరలు 20% మించి విక్రయిస్తున్నారు. 

సిగరెట్ల విషయం చెప్పనవసరం లేదు. గతంలో గోల్డ్‌ఫ్లేక్స్‌ కింగ్స్‌ ధర 10 సిగరెట్ల ప్యాకెట్‌కు రూ. 170గా ఉండగా.. ఇప్పుడు రూ. 250 నుంచి రూ. 300 మధ్య లభిస్తోంది.



దొడ్డిదారిన విక్రయాలు..

లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత కూడా కొందరు వ్యాపారులు యథేచ్ఛగా విక్రయాలు జరుపుతున్నారు. దుకాణం షట్టర్లు మూసే ఉంచినా.. వెనకవైపు తలుపు/కిటికీ నుంచి గానీ, కస్టమర్లు వచ్చినప్పుడు షట్టర్లు లేపి గానీ అమ్మకాలు జరుపుతున్నారు. ఆ సమయంలో వారికి ఇష్టమొచ్చిన ధరలు వసూలు చేస్తున్నారు. ఒక్క కిరాణా దుకాణాలనే కాకుండా.. ఆటోమొబైల్‌, కూరగాయలు, మాంసం.. ఇలా అన్ని దుకాణాల్లో అనధికారిక లాక్‌డౌన్‌ ట్యాక్స్‌ కొనసాగుతోంది. పౌరసరఫరాల అధికారుల నిఘా లేకపోవడంతో.. రిటైల్‌ వ్యాపారులు అడ్డగోలుగా ధరలు పెంచారని కస్టమర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-05-21T09:15:01+05:30 IST