తెలంగాణలో పాక్షికంగా లాక్‌డౌన్!

ABN , First Publish Date - 2021-03-21T21:02:03+05:30 IST

పెరుగుతున్న కోవిడ్ కేసులతో సర్కార్ అప్రమత్తమైంది. పాఠశాలలను మూసివేతకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

తెలంగాణలో పాక్షికంగా లాక్‌డౌన్!

హైదరాబాద్: పెరుగుతున్న కోవిడ్ కేసులతో సర్కార్ అప్రమత్తమైంది. పాఠశాలల మూసివేతకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. సినిమా థియేటర్లు, జనాల రద్దీ ఉండే ప్రాంతాల్లో ఆంక్షలు విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కరోనాపై త్వరలో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో పాక్షికంగా లాక్‌డౌన్ అమలు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో వీకెండ్స్‌లో లాక్‌డౌన్  విధించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వారంలో 3 రోజుల పాటు లాక్‌డౌన్ లేదా రాత్రిపూట కర్ఫ్యూపై కసరత్తు చేస్తున్నారు. కోవిడ్ అదుపులోనే ఉన్నా.. ప్రభుత్వం కట్టడి చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే దేశంలోని పలు నగరాల్లో లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నెల 26 కంటే ముందే అసెంబ్లీ సమావేశాలు ముగించే యోచనలో సర్కార్ ఉంది.  


తెలంగాణలో కేసుల సంఖ్య ఎంత పెరిగినప్పటికీ దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. గతంలోనే లక్ష కేసులు వచ్చినా చికిత్స అందించేందుకు మౌలిక సదుపాయాల కల్పన చేసుకున్నామని, ప్రస్తుతం అటువంటి పరిస్థితులు రాకపోవచ్చని అధికారులు అంటున్నారు. తాజాగా రాష్ట్రంలో పది ప్రాంతాల్లో వైరస్‌ అవుట్‌ బ్రేకు అవ్వగా, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా విస్తృతమైన టెస్టులు చేసి కట్టడి చేయగలిగారు. గతంలో  సర్కారు చేపట్టిన చర్యల వల్ల తెలంగాణలో 1.44 లక్షల కేసులు రాకుండా ఆపడంతో పాటు, 2300 మరణాలు నివారించగలిగిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వేలో కూడా వెల్లడించిందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. 


నిరుడు దేశవ్యాప్తంగా వైరస్‌ వ్యాప్తి ప్రారంభమవ్వగా, నవంబరు నాటికి తీవ్రత తగ్గింది. మళ్లీ ఇప్పుడు వైరస్‌ విజృంభిస్తోంది. ప్రధానంగా  పొరుగున ఉన్న మహారాష్ట్రలో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా లోకల్‌ ట్రైన్స్‌తో పాటు, జనసమూహాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్త కేసులు ఎక్కువగా వస్తున్నట్లు తేలింది. మన దగ్గర కూడా విద్యా సంస్థలు, హాస్టళ్లు,  గురుకులాల్లో వైరస్‌ వ్యాప్తి ఇటీవల బాగా పెరిగింది.

Updated Date - 2021-03-21T21:02:03+05:30 IST