డ్యూటీగా బాదుడు!

ABN , First Publish Date - 2021-02-06T10:12:15+05:30 IST

2012 మే నెలలో పెట్రోల్‌ ధర లీటర్‌కు ఏకంగా రూ.7.54 మేర పెరిగిన నేపథ్యంలో నాటి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలివి.

డ్యూటీగా బాదుడు!

రెండు రోజుల్లో 65 ప్తెసలు పెంపు

ప్రజల నెత్తిన కేంద్రం ఎక్సైజ్‌ డ్యూటీ బండచట్టాన్ని సవరించి మరీ ‘ప్రత్యేక’ వడ్డన

నాడు మన్మోహన్‌ సర్కారుపై మోదీ ధ్వజం

నేడు ప్రజలపై మోయలేనంత భారం

గత ఆరేళ్లలో ఐదు లక్షల కోట్లకు పైగా

అదనపు ఆదాయం ఆర్జించినట్టు అంచనా

ఒక్కో వాహనదారుడిపై ఈ ఆరేళ్లలో

పడిన భారం దాదాపుగా రూ.18 వేలు!

2014 మేలో పెట్రోల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ రూ.9.48

ఆరేళ్లలో దాన్ని 32.98కి పెంచిన మోదీ సర్కారు

డీజిల్‌పై రూ.3.56 నుంచి రూ.31.83కి పెంపు

పెంచిన మొత్తంలో రాష్ట్రాలకు వచ్చే వాటా తక్కువే

హైదరాబాద్‌లో రూ.90కి చేరిన లీటరు పెట్రోలు


పెట్రోల్‌ ధరల భారీ పెరుగుదల.. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ వైఫల్యానికి ప్రధాన ఉదాహరణ


2012 మే నెలలో పెట్రోల్‌ ధర లీటర్‌కు ఏకంగా రూ.7.54 మేర పెరిగిన నేపథ్యంలో నాటి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలివి. అయితే, అప్పట్లో ఆ స్థాయిలో చమురు ధరలు పెరగడానికి రెండు ప్రధాన కారణాలున్నాయి. ఒకటి.. అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధర 14.5 శాతం మేర పెరిగింది. రెండోది.. రూపాయి విలువ 3.2 శాతం మేర పడిపోయింది. ఆ పెరుగుదలపై నాడు మన్మోహన్‌ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన బీజేపీ.. వామపక్షాలతో కలిసి భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. 2013 మార్చిలో మరోసారి చమురు ధరలు పెరిగినప్పుడు బీజేపీ నేతలు పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగకుండా ఆటంకం కలిగించారు.


యూపీఏ ప్రభుత్వం అప్పటికి తొమ్మిదేళ్లుగా అవలంబిస్తున్న తప్పుడు ఆర్థిక విధానాల వల్లనే చమురు ధరలు పెరిగాయని మండిపడ్డారు. ఆ తర్వాత 2014లో మోదీ సర్కారు ఏర్పాటైంది. అప్పటికి దాదాపు 110 డాలర్లుగా (మన కరెన్సీలో దాదాపు రూ.6425) ఉన్న బ్యారెల్‌ ముడిచమురు ధర.. 2015 జనవరి నాటికి 50 డాలర్లకు (దాదాపు రూ.3167) పడిపోయింది. 2016 జనవరిలో 27 డాలర్లకు పడిపోయింది!! అప్పటికి డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.66.3. అంటే బ్యారెల్‌ చమురు 1790 రూపాయలు. ఇక కరోనా లాక్‌డౌన్‌ వేళ.. 2020లో ఒక దశలో ఏకంగా 11 డాలర్లకు పడిపోయింది. 2020 సంవత్సరం మొత్తాన్నీ పరిగణనలోకి తీసుకుంటే ముడిచమురు ధర సగటున 39.68 డాలర్లుగా ఉంది. డాలర్‌ మారకం విలువ సగటున రూ.74.13గా ఉంది. అంటే 2020లో బ్యారెల్‌ ముడిచమురు ధర సగటున రూ.2941.47. ఈ లెక్కలన్నింటినీ పరిశీలిస్తే.. మోదీ ఆరేళ్ల పాలనలో ముడిచమురు ధర ఏ దశలోనూ యూపీఏ సర్కారు ఉన్నప్పటి ధరలకు దరిదాపుల్లో కూడా లేదని అర్థం చేసుకోవచ్చు. కానీ.. ఈ ఆరేళ్లలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు  ఆల్‌టైమ్‌ గరిష్ఠాలను నమోదు చేయడమే విషాదం.


అక్కడ తగ్గితే ఇక్కడ పెంచు...

యూపీఏ సర్కారు తప్పుడు ఆర్థిక విధానాల వల్లనే చమురు ధరలు పెరిగాయని పదేపదే ఆరోపించిన బీజేపీ పాలనలో అవలంబించిన అత్యద్భుత ఆర్థిక విధానం ఏంటంటే.. ‘‘అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధరలు తగ్గినప్పుడల్లా ఇక్కడ ఎక్సైజ్‌ డ్యూటీ పెంచు. ప్రజలకు ఏ మాత్రం ఊరట కలిగించొద్దు’’. ఇదే మోదీ సర్కారు పాటించిన, పాటిస్తున్న తారక మంత్రం. మోదీ పగ్గాలు చేపట్టిన 2014 మే నుంచి 2017 సెప్టెంబరు దాకా.. పెంచడమే తప్ప తగ్గించడం తెలియదన్నట్టుగా ఎక్సైజ్‌ డ్యూటీని ఏకంగా 12సార్లు పెంచారు! పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ ఎనాలిసిస్‌ సెల్‌ (పీపీఏసీ) గణాంకాల ప్రకారం 2014 మే నుంచి 2017 సెప్టెంబరు నడుమ పెట్రోల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ 54 శాతం పెరిగితే.. డీజిల్‌ మీద ఏకంగా 154 శాతం పెరిగింది. మోదీ సర్కారు ఏర్పాటైన మూడేళ్ల తర్వాత తొలిసారి.. అంటే 2017 అక్టోబరులో రూ.2 మేర ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించారు. అదీ.. ఆ తగ్గింపు వల్ల ఖజానాకు రూ.26 వేల కోట్ల నష్టమని సన్నాయినొక్కులు నొక్కుతూ తగ్గించారు! పైగా రాష్ట్రాలు పన్నులు తగ్గించాలని ఉచితసలహాలు కూడా ఇచ్చారు. కానీ వాస్తవమేంటంటే.. 2014-15లో చమురుపై పన్నుల రూపంలో రూ.99 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన మోదీ సర్కారు, 2016-17లో ఏకంగా రూ.2,42,000 కోట్లు ఆర్జించింది.


చట్ట సవరణ చేసి మరీ..

పెట్రోల్‌, డీజిల్‌పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ సుంకాన్ని గరిష్ఠంగా రూ.10కి, డీజిల్‌పై గరిష్ఠంగా రూ.4కు పెంచుకోవడానికి మాత్రమే చట్టపరంగా అవకాశం ఉండేది. కానీ, మోదీ సర్కారు ఆ సుంకాలను గరిష్ఠంగా పెట్రోలుపై రూ.18కి, డీజిల్‌పై రూ.12కు పెంచుకోవడానికి వీలుగా 2020 మార్చిలో చట్ట సవరణ చేసింది. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వచ్చినా పట్టించుకోలేదు. కొవిడ్‌తో జనం ఆర్థికంగా కుదేలైనా.. సుంకాన్ని కూడా పెంచుతూనే ఉంది. చట్టసవరణకు ముందు పెట్రోల్‌, డీజిల్‌పై రూ.3 చొప్పున అదనపు సుంకాన్ని విధించిన కేంద్రం వాటి ద్వారా రూ.39 వేల కోట్ల ఆదాయాన్ని అంచనా వేసింది. ఆ తర్వాత.. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు రెండు దశాబ్దాల కనిష్ఠ స్థాయికి తగ్గినా ఆ మేరకు వాహనదారులకు ప్రయోజనం కల్పించకుండా 2020 మే 6న ఎక్సైజ్‌ సుంకాన్ని మరోసారి పెంచింది.


లీటరు పెట్రోల్‌పై రూ.10 (ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ రూ.2+ రోడ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెస్‌ రూ.8), డీజిల్‌పై రూ.13 (ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ రూ.5+ రోడ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెస్‌ రూ.8) చొప్పున సుంకం విధించింది. ఎక్సైజ్‌ సుంకం పెంపుతో పెట్రోల్‌, డీజిల్‌ మొత్తం ధరలో పన్నుల వాటా దాదాపు 70 శాతానికి చేరినట్టయింది. ఈ పెంపు మూలంగా ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి దాదాపు రూ.1.6 లక్షల కోట్ల అదనపు ఆదాయం రానుందని అంచనా వేశారు.


ఎక్సైజ్‌ డ్యూటీ అలాగే ఉండి ఉంటే..

మన్మోహన్‌ హయాంలో ఎక్సైజ్‌ డ్యూటీ పెట్రోలుపై రూ.9.48, డీజిల్‌పై రూ.3.56 ఉండేది. మోదీ హయాంలో అది వరుసగా రూ.32.98, రూ.31.83కి చేరింది. 2014 నాటికి బ్యారెల్‌ చమురు ధర 100 డాలర్లు దాటేయడంతో ఆ భారం మనదేశంలోనూ ప్రతిఫలించినా.. ఎక్సైజ్‌ డ్యూటీ రూ.10 లోపే ఉండడంతో పెట్రోల్‌ ధర మన్మోహన్‌ దిగిపోయే సమయానికి రూ.72 లోపే ఉంది. కానీ, అప్పట్లో ముడిచమురు ధర భారీగా ఉన్న నేపథ్యంలో పెట్రోల్‌ మౌలిక ధర దాదాపు రూ.45గా ఉండేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదే హైదరాబాద్‌లో శుక్రవారంనాటి పెట్రోల్‌ ధర రూ.90ని పరిగణనలోకి తీసుకుంటే.. అందులో పెట్రోల్‌ మౌలిక ధర రూ.32 లోపే ఉంది. మిగతాదంతా పన్నులు+డీలర్‌ కమీషన్‌+రవాణా చార్జీలే.  ఒకవేళ ఎక్సైజ్‌ డ్యూటీ ఇప్పటికి కూడా మన్మోహన్‌ హయాంలోలాగానే 10 రూపాయలేఉండి ఉంటే (సగటు అంచనా ప్రకారం దాదాపుగా).. 


పెట్రోల్‌ బేస్‌ ప్రైస్‌ రూ.30

ఎక్సైజ్‌ డ్యూటీ రూ.10

డీలర్‌ కమీషన్‌ రూ.3.45

వ్యాట్‌ రూ.22.70

రవాణా రూ.1.18


..అన్నీ కలుపుకొనిలీటర్‌ పెట్రోల్‌ ధర దాదాపుగా రూ.67 ఉండి ఉండేది. అంటే లీటర్‌పై ప్రజలకు దాదాపుగా రూ.23 మిగిలేవి. ప్రజల మీద నిజంగా ప్రేమ ఉండి పెట్రోల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీని మరీ 32.98కి కాకుండా రూ.20 పెంచారనుకున్నా కూడా.. పెట్రోల్‌ ధర లీటర్‌ దాదాపుగా రూ.77గా ఉండేది. ప్రజలకు ప్రతి లీటరుపై రూ.13 మిగిలేవి. కానీ రాష్ట్రంలో ప్రస్తుతం పెట్రోల్‌ ధర లీటర్‌ రూ.90 దాటింది. ప్రస్తుతం మనదేశంలో పెట్రోల్‌ రోజువారీ వినియోగం దాదాపుగా 44 లక్షల బ్యారెళ్లు. అంటే దాదాపుగా 70 కోట్ల లీటర్లని అంచనా. గత ఆరేళ్లలో మోదీ సర్కారు ఎక్సైజ్‌ డ్యూటీ వసూళ్లు దాదాపుగా 14.6 లక్షల కోట్లు. అందులో దాదాపు రూ.5 లక్షల కోట్లు ఈ పెంపు వల్ల వచ్చిందేనని అంచనా. అంతేకాదు.. ఈ పెంచిన మొత్తం నుంచి రాష్ట్రాలకు వచ్చే వాటా చాలా తక్కువ. సెస్సుల రూపంలో కేంద్రం జేబుల్లోకే ఎక్కువ వెళ్తోంది. ఇంకో చిన్న లెక్క.. ఒక మధ్యతరగతి కుటుంబం నెలకు 25 లీటర్ల పెట్రోల్‌ వినియోగిస్తుందనుకుంటే ఆ కుటుంబం నుంచి లీటరుపై సగటున రూ.10 చొప్పున నెలకు రూ.250 దాకా అదనంగా వసూలు చేసినట్టు. ఆరేళ్లకు దాదాపు రూ.18 వేలు అదనంగా బాదినట్టు!! 


వరుసగా రెండో రోజూ పెట్రో సెగ

వరుసగా రెండో రోజు చమురు ధరలు పెరిగాయి. పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను లీటరుకు 35 పైసల చొప్పున గురువారం పెంచిన చమురు కంపెనీలు.. శుక్రవారం మరో 30 పైసల చొప్పున పెంచాయి. ఈ పెంపుతో దేశంలోని మెట్రో నగరాల్లో పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గినా..

మన్మోహన్‌ హయాం నాటికి.. ఇప్పటికీ డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోలేదా? అప్పటితో పోలిస్తే ఇప్పుడు డాలర్‌ విలువ ఇంకా పెరిగిపోయింది కదా? ఆ మేరకు చమురు ధరలు కూడా పెరుగుతాయి కదా? అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. వారి వాదనను పటాపంచలు చేసే ఉదాహరణ ఒకటి చూద్దాం...

2014 మే 25న ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. దానికి రెండు రోజుల ముందు.. అంటే.. 2014 మే 23న క్రూడాయిల్‌ ధర 110.19 డాలర్లు

ఆరోజున డాలర్‌ మారకం విలువ 58.415

ఒక బ్యారెల్‌లో ఉండే చమురు158.98 లీటర్లు అంటే.. బ్యారెల్‌ చమురు ధర 9287.24

మన్మోహన్‌ ప్రధానిగా ఉన్న ఆఖరు రోజున (2014 మే 25న) ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.71.41, డీజిల్‌ లీటరుకు రూ.56.71.


ఇప్పటి లెక్కలు చూస్తే..

2021 ఫిబ్రవరి 4న క్రూడాయిల్‌ ధర  56.16 డాలర్లు. డాలర్‌ మారకం విలువ 72.96

బ్యారెల్‌లో ఉండే చమురు 158.98 లీటర్లు.. అంటే 2021 ఫిబ్రవరి4న బ్యారెల్‌ ముడి చమురు ధర 4097.43

ఫిబ్రవరి 4న ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర 86.65..  లీటర్‌ డీజిల్‌ ధర రూ.76.87

..అంటే, డాలర్‌ మారకం విలువ భారీగా పెరిగినా కూడా 2014తో పోలిస్తే ముడిచమురు ధర సగానికి సగం తగ్గిపోయింది. కానీ, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మాత్రం 2014 కన్నా ఎక్కువ ఉండి, ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయికి చేరుకున్నాయి.’

సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - 2021-02-06T10:12:15+05:30 IST