తెలంగాణలో లిక్కర్ మాఫియాదే రాజ్యం
ABN , First Publish Date - 2021-01-20T08:09:19+05:30 IST
తెలంగాణలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ ఛుగ్ ఆరోపించారు. మాఫియా డాన్‌కు కేసీఆర్ అధికారిక నివాసం అడ్డా

బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్ ఛుగ్
హైదరాబాద్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ ఛుగ్ ఆరోపించారు. మాఫియా డాన్‌కు కేసీఆర్ అధికారిక నివాసం అడ్డా అయిందని, ఆ మాఫియా ప్రభుత్వంలో ఒక భాగమైందని విమర్శించారు. మంగళవారం బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తరుణ్‌ఛుగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తామని అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్, మద్యనిషేధం అమల్లో విఫలమయ్యారన్నారు. తెలంగాణాలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, మహిళా స్వయం సహాయక సంఘాలను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు ఘనత బీజేపీ కార్యకర్తలదే అని, దివంగత నేత వనం ఝాన్సీ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. బాగున్నారా అంటూ తెలుగులో మహిళా నేతలను పలుకరించిన తరుణ్ ఛుగ్.. తెలంగాణాలో ఒక లంక ఉందని, ఆ లంకా దహనంలో మహిళలంతా కీలకపాత్ర పోషించాలని అన్నారు. కేసీఆరే బూతుల ముఖ్యమంత్రి అని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు.