రేపు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు
ABN , First Publish Date - 2021-10-29T08:49:26+05:30 IST
రేపు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు

- పెరుగుతున్న చలి తీవ్రత
- ఆదిలాబాద్‌లో 15.7 డిగ్రీలు
హైదరాబాద్, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో శనివారం అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శుక్రవారం పొడి వాతావరణం ఉంటుందని, ఈశాన్య దిశ నుంచి కింది స్థాయి గాలులు తెలంగాణ వైపు వీస్తున్నాయని వెల్లడించింది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గురువారం ఆగ్నేయ బంగాళాఖాతం వరకు కొనసాగుతున్నట్లు తెలిపింది. ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉన్నదని, ఉపరితల ద్రోణి సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తువరకు వ్యాపించి ఉన్నదని పేర్కొంది. మరోవైపు, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గిపోతుండడంతో చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు ఆవరిస్తోంది. గురువారం ఆదిలాబాద్‌లో 15.7 డిగ్రీల అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. హన్మకొండ, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో 20 డిగ్రీల కంటే తక్కువగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.