సొంత పార్టీ నేతలు ‘పల్లా’ను గెలిపిస్తారో.. లేదో..? టెన్షన్!?
ABN , First Publish Date - 2021-03-08T19:32:38+05:30 IST
ఆ నాయకుడి విజయం కోసం ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు ఎంతో శ్రమించారు. ...
ఆ నాయకుడి విజయం కోసం ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు ఎంతో శ్రమించారు. కాళ్లకు బలపాలు కట్టుకుని ఊరుఊరంతా తిరిగారు. ఆయన గెలిస్తే ఎన్నో సమస్యలు పరిష్కరిస్తామని హామీల వర్షం కురిపించారు. అనుకున్నట్లుగానే ఆ నాయకుడు గెలిచారు. తక్కువ సమయంలో అధికార పార్టీలో ఉన్నత స్థాయికి ఎదిగారు. కానీ పదవులు అనుభవించిన ఆ నాయకుడు మాత్రం గెలిపించిన వారిని మరిచారట. మరోసారి ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆ నేతకు ఝలక్ ఇచ్చేందుకు పార్టీ నాయకులు ప్లాన్ చేస్తున్నారట. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏమిటా కథ? అనేది ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఇన్‌సైడ్‌లో చూద్దాం.
పల్లాకు ఇంటి పోరు!
ప్రైవేట్ విద్యాసంస్థల ప్రతినిధిగా రాజకీయాల్లోకి వచ్చిన పల్లా రాజేశ్వర్ రెడ్డి షార్ట్ టైంలోనే సీఎం కేసీఆర్‌కు దగ్గరయ్యారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా విజయం సాధించడం, తర్వాత రైతు బంధు సమితి అధ్యక్షుడుగా పార్టీలో కీలక వ్యక్తిగా ఎదిగారు. కేసీఆర్‌కు అతి సమీపంగా ఉండే కొద్ది మంది వ్యక్తుల్లో పల్లా ఒకరు. ఇప్పుడు మరోసారి గ్రాడ్యువేట్ ఎమ్మెల్సీ బరిలోకి దిగిన పల్లాకు ఇంటి పోరు ఇబ్బందిగా మారిందనే టాక్ వినిపిస్తోంది.
సహకరిస్తారో.. లేదో..!?
గత గ్రాడ్యువేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించి మండలికి పంపారు. ఇక గెలిచిన తర్వాత తమను పల్లా పట్టించుకోలేదనే అసంతృప్తితో ఉన్నారట ఉమ్మడి నల్గొండ నేతలు. కనీసం ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే సైతం లిఫ్ట్ చేసేవారు కాదట. ఎమ్మెల్సీగా, రైతుబంధు అధ్యక్షుడిగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి.. తాము చెప్పిన పనులను చేయలేదని వారంత కుతకుత ఉడికిపోతున్నారట. ఇప్పుడు పల్లాను మరోసారి గెలిపించే విషయంపై వారంతా ఆగ్రహంగా ఉన్నారనే ప్రచారం గులాబీదళంలో గుప్పుమంటుంది. పల్లాపై అసంతృప్తితో ఉన్న నేతలు ఆయన విజయానికి సహకరిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారిందట.

టాక్ ఏంటి..!?
గత ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన వేమిరెడ్డి నర్సింహా రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అధికారపార్టీ అభ్యర్థిగా ఉండి కోట్ల రూపాయాలు ఖర్చు చేసినా..ఎందుకు ఓడిపోయాననే రివ్యూలో అసలు విషయం తెలిసిందట. పార్టీ నేతల్లో ఉన్న అసంతృప్తి, కొందరు నేతలు సహకరించకపోవడమే ఓటమికి కారణమని గ్రహించారట. అప్పట్లో విషయం తెలిసినా పార్టీ పెద్దలు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదనీ..ఇప్పుడు పల్లా విషయం కూడా అలాగే ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల టాక్.

మళ్ళీ ఆయన్నే గెలిపిస్తే..!
సాధారణ ఎన్నికలను తలపించేలా పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాలు ఉండడంతో..ఓటర్లను మరింతగా ఆకర్షించేందుకు ప్లాన్ చేస్తోంది టీఆర్ఎస్ హైకమాండ్. ఖర్చు విషయంలోనూ అదే ధోరణిలో ఉంది. పల్లా నామినేషన్ వేసిన రోజే దాదాపు 8 లక్షల వరకు ఖర్చు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. నలుగురు మంత్రులు, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరయ్యారు. నేతల్లో కొంత అసంతృప్తిని ముందే గుర్తించిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కింది స్థాయి కార్యకర్తలతో కలిసి పట్టభద్రులను తన వైపు తిప్పుకునేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యేలు మాత్రం ఆయనను గెలిపించే భాద్యతలను భుజానికెత్తుకోకూడదని.. కట్టె విరగకుండా పాము చావకుండా అన్న ధోరణితో వ్యవహరించాలని చూస్తున్నారట. మిర్యాలగూడలోని ఓ మున్సిపల్ వార్డులో ఒక్క పట్టభద్ర ఓటర్ కూడా లేరని పల్లాకు పార్టీ నేతలు చెప్పడం..ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. మళ్ళీ ఆయన్నే గెలిపిస్తే ఆయనకు ప్రయోజనం తప్ప తమకు ఒరిగేదేమి ఉండదనే భావనలో పార్టీ నేతలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

పల్లా కోరినా వర్కవుట్ కాలేదు!
పల్లాకు ఇంటిపోరుతో పాటు తోటి విద్యాసంస్థల పోరు కూడా తప్పేలా లేదు. గతంలో తమ వ్యక్తి అని విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రెస్టేజ్‌గా తీసుకుని పల్లాను గెలిపిస్తే.. తమకు ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారట. పల్లా మాత్రం సొంతంగా యూనివర్సిటీ తెచ్చుకోవడం తమ సమస్యలు పరిష్కరించాలని కోరినా పట్టించుకోలేదని ఫీలవుతున్నట్లు సమాచారం. ఇక ఏళ్లుగా ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల కాకపోవడం పీఆర్సీ వంటివి పల్లా విజయానికి ప్రతిబంధకం కావొచ్చని మరో చర్చ సాగుతోంది. ఇటీవలే హాలియాలో ఉపాధ్యాయులతో జరిగిన సమావేశంలో భోజనం టేబుళ్లను సైతం టీచర్లు పడవేసి ఆందోళన తెలపడం ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే పీఆర్సీ ప్రకటించాలని పల్లా సైతం కోరినా వర్కవుట్ కాలేదు.

ఎలా గట్టెక్కుతారో..?
ఇలాంటి ఇంటర్నల్ సమస్యలు ఉన్నాయనే పల్లా.. పోటీకి మొదట వెనుకంజ వేశారనే ప్రచారం జరుగుతోంది. చివరకు సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే ఆయన బరిలోకి దిగారని అంటున్నారు. ఇక సొంత పార్టీ నేతలే పల్లాను ఓడగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. మొత్తానికి ఇంటిపోరు... బయటి పోరు మధ్య పల్లా పట్టభద్రుల సమరంలో ఎలా గట్టెక్కుతారో..? వేచిచూడాలి.

