బీసీల ఆత్మగౌరవ భవనాలకు భూములు

ABN , First Publish Date - 2021-11-09T07:41:30+05:30 IST

వెనుకబడ్డ కులాల ప్రజల రాజకీయ, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

బీసీల ఆత్మగౌరవ భవనాలకు భూములు

రూ.5,500 కోట్ల విలువైన స్థలాలు ఇస్తున్నాం: మంత్రి గంగుల

హైదరాబాద్‌, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): వెనుకబడ్డ కులాల ప్రజల రాజకీయ, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. 41 బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతాలైన కోకాపేట, ఉప్పల్‌, బగాయత్‌లో 82.30 ఎకరాల భూమి కేటాయించామని మంత్రి తెలిపారు. బీసీల ఆత్మగౌరవ భవనాలకు సంబంధించి రాష్ట్రస్థాయి కుల సంఘాల నాయకులతో ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో రెండు రోజులపాటు బీసీ సంక్షేమ శాఖ సమావేశం ఏర్పాటు చేసింది. గంగుల కమలాకర్‌ అధ్యక్షతన సోమవారం జరిగిన మొదటి రోజు సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌ పాల్గొన్నారు. ఆత్మగౌరవ భవనాలకు సంబంధించిన నిర్దిష్ట కార్యాచరణను గంగుల ప్రకటించారు.


 41 బీసీ కులాలకు రూ.5,500 కోట్ల విలువైన భూమిని కేసీఆర్‌ ప్రభుత్వం కేటాయించిందన్నారు. భూ కేటాయింపుతోపాటు మౌలిక సదుపాయాలు, భవన నిర్మాణానికి రూ.95.25 కోట్లు కేటాయించామని చెప్పారు. ఏక సంఘంగా ఏర్పడిన కులసంఘాలకు వెంటనే పట్టాలు అందజేస్తామని తెలిపారు. నవంబరు 17లోగా ఏక సంఘంగా రిజిస్ట్రర్‌ చేయించి ప్రభుత్వాన్ని సంప్రదించాలన్నారు. నవంబర్‌ 21, 22 తేదీల్లో  సీఎం కేసీఆర్‌  చేతుల మీదుగా పట్టాలు ఇప్పించేందుకు ప్రయత్నిస్తామని మంత్రి తెలిపారు. ఏక సంఘంగా ఏర్పడడం సాధ్యంకాని పరిస్థితుల్లో ఆయా కులాల భవన నిర్మాణాల బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని గంగుల కమలాకర్‌ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీసీలకు మంచిరోజులు వచ్చాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. బీసీలు ఏక సంఘంగా ఏర్పడి ఆత్మగౌరవ భవనాల్ని అద్భుతంగా నిర్మించుకోవాలని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ సూచించారు. 

Updated Date - 2021-11-09T07:41:30+05:30 IST