లీకవుతున్న ప్రశ్నపత్రాలు

ABN , First Publish Date - 2021-08-22T05:06:30+05:30 IST

లీకవుతున్న ప్రశ్నపత్రాలు

లీకవుతున్న ప్రశ్నపత్రాలు

లోపభూయిష్టంగా కేయూ డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు

ఆన్‌లైన్‌లో విడుదలతో అక్రమాలు

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు కళాశాలు


కేయూ క్యాంపస్‌, ఆగస్టు 21: కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ ఆఖరు సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణ తీరు అస్తవ్యస్తంగా మారింది. కొందరు ప్రయివేటు యాజమాన్యాలు డిగ్రీ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ చేయిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేయూ పరిధిలోని ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో నిర్వహిస్తున్న డిగ్రీ ఆఖరు సెమిస్టర్‌ బీఏ, బీకాం, బీఎస్సీ పరీక్షల కోసం విద్యార్థులకు ఆన్‌లైన్‌ పద్ధతిలో పంపుతున్న ప్రశ్నాపత్రాలు అంగట్లో సరుకుగా మారినట్లు వి శ్వసనీయ వర్గాల సమాచారం. పరీక్షల నిర్ణీత సమ యం కంటే ముందే జిరాక్స్‌ సెంటర్లలో ప్రశ్నాపత్రాలు దర్శనమిస్తున్నాయని తెలుస్తోంది. దీంతో మూడేళ్లపా టు కష్టపడి చదివిన తమ భవిష్యత్తు అంధకారంలో పడుతుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.


జిరాక్స్‌ సెంటర్లలో ప్రశ్నపత్రాలు

గత నెల 9నుంచి నిర్వహిస్తున్న డిగ్రీ ఆఖరు సెమిస్టర్‌ పరీక్షల ప్రశ్నాపత్రాలను యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారులు ఆన్‌లైన్‌లో పంపుతున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల మేరకు కళాశాలకు సెల్ఫ్‌ సెంటర్లను కేటాయించారు. ఉదయం 9గంటలకు పరీక్షలు ప్రారంభమవడానికి ముందే ప్రశ్నాప్రశ్నాల కీ, పాస్‌వర్డ్‌ను కళాశాల యాజమాన్యాల సెల్‌ఫోన్లకు పంపుతారు. అయితే కొందరు ప్రయివేటు యాజమాన్యాలు తమ సెల్‌ఫోన్‌కు వచ్చే కీ, పాస్‌వర్డ్‌లను ఎక్స్‌రాక్స్‌ (జిరాక్స్‌) సెంటర్‌ నిర్వాహకులకు అందజేస్తున్నారు. ఆ ప్రశ్నాపత్రాలను జిరాక్స్‌ తీయించి విద్యార్థులకు అందజేస్తున్నారు. ఇదే అదనుగా జిరాక్స్‌ సెంటర్ల నిర్వాహకులు ప్రశ్నపత్రాలను లీక్‌ చేస్తున్నారని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారులకు ఫిర్యాదులు అందాయి. 


పలు సెంటర్ల తొలగింపు

పరీక్షల నిర్వహణలో కొన్ని ప్రయివేటు కళాశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండంతో యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. కేయూ పరిధిలో మాస్‌కాపీయింగ్‌తో సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న కళాశాలలో సెల్ఫ్‌ సెంటర్‌ను తొలగించి అందుబాటులో ఉన్న మరో కళాశాలకు మారుస్తున్నారు. ఇటీవల నెక్కొండ, మహబూబాబాద్‌లోని వికాస్‌ డిగ్రీ కళాశాల, దుగ్గొండిలో మాతృశ్రీ డిగ్రీ కళాశాల, నర్సంపేట బాలాజీ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన సెల్ఫ్‌ సెంటర్లను తొలగించి అందుబాటులో ఉన్న మరో కళాశాలకు సెంటర్లను మార్చారు. వీటితో పాటు అనేక మంది విద్యార్థులను పరీక్షలలో మాస్‌ కాపీయింగ్‌ చేస్తుండగా పట్టుకొని డీబార్‌ చేశారు. కాపీయింగ్‌కు పాల్పడే అధ్యాపకులపై పోలీ్‌సస్టేషన్లలో కేసులు నమోదు చేస్తున్నారు. ప్రశ్నాపత్రాలను లీక్‌ చేసినవారి వివరాలను పోలీసు యంత్రాగానికి అందిస్తున్నారు. 


స్క్వాడ్‌ బృందాలపై నిఘా

కేయూ డిగ్రీ ఆఖరు సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించి ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసేందుకు స్క్కాడ్‌ బృందాలను ఏర్పాటు చేశారు. అయితే కొందరు స్క్వాడ్‌ అధికారులు ప్రయివేటు కళాశాలలతో కుమ్మక్కై పరీక్ష కేంద్రాలకు వెళ్లకుండానే చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని కేయూ అధికారులు దృష్టికి వచ్చింది. అలాంటి వారిపై నిఘా పెట్టారు. పరీక్షల డ్యూటీలు సక్రమంగా నిర్వర్తించనివారి వివరాలను సేకరించారు. వారిపై కూడా చర్యలు చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.  

Updated Date - 2021-08-22T05:06:30+05:30 IST